ఆధునిక విద్యాభివృద్ధి

ఆధునిక విద్యాభివృద్ధి

19వ శతాబ్ది మధ్యకాలంలో ప్రధాన మంత్రి మొదటి సాలార్​జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, ప్రైవేట్​ వ్యక్తులు, క్రైస్తవ మిషనరీల కార్యకలాపాల ద్వారా హైదరాబాద్​ రాజ్యంలో ఆధునిక, పాశ్చాత్య విద్యావిధానం ప్రారంభమైంది. ​మొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల సెయింట్​ జార్జి గ్రామర్​ స్కూల్​ను 1834లో స్థాపించారు. సాలార్​జంగ్​ ప్రభుత్వపరంగా 1854లో దార్​–ఉల్​–ఉలూమ్​ అనే ఓరియంటల్​ హైస్కూల్​ను ప్రారంభించారు. ఈ పాఠశాలలో ఇంగ్లీష్​ను ఒక తప్పనిసరి సబ్జెక్టుగా బోధించేవారు. నిజాం ప్రభుత్వం విద్యావ్యాప్తి కోసం 1859లో ప్రభుత్వపరంగా ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రతి తాలూకా, జిల్లా హెడ్​క్వార్టర్స్​లో ఒక్కో స్కూల్​ను స్థాపించాలని నిర్దేశించారు. అందులో ఒకటి పర్షియన్​, రెండోది స్థానిక భాషలో ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా ఒక ప్రత్యేక విద్యాశాఖను ఏర్పాటు చేశారు. అప్పటి ఇంజినీరింగ్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డబ్ల్యూ.హెచ్.విల్​కిన్​సన్​ను మొదటి డైరెక్టర్​గా నియమించారు.

1870లో సిటీ హైస్కూల్​, పబ్లిక్ వర్క్స్​ డిపార్ట్​మెంట్​ అవసరాల తీర్చడానికి స్కూల్​ ఆఫ్​ ఇంజినీరింగ్​ను స్థాపించారు. 1872లో చాదర్​ఘాట్​ ఇంగ్లీష్​ స్కూల్​ను స్థాపించారు. 1880లో స్కూల్​ ఆఫ్​ ఇంజినీరింగ్​, చాదర్​ఘాట్​ ఇంగ్లీష్​ స్కూల్​ను కలిపి సెకండ్​ గ్రేడ్​ కాలేజీగా ప్రమోట్​ చేస్తూ హైదరాబాద్​ కాలేజీగా పిలిచారు. తర్వాత కాలంలో 1887లో నిజాం కాలేజీగా వాడుకలోకి వచ్చింది. ఇది పూర్తిగా ఇంగ్లీష్ మీడియం కాలేజీ కావడం వల్ల మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగేది. 1873లో మదరస–ఇ–ఆలియా అనే ప్రైవేట్​ స్కూల్​ను సాలార్​జంగ్​ పిల్లలు, వారి బంధువుల కోసం ఇంగ్లీష్​ టీచర్స్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీన్నే తర్వాత కాలంలో సంపన్న వర్గాల పిల్లల కోసం కేటాయించారు. మదరస ఇ ఐటా (1878)ను నిజాం రాజుల పిల్లల కోసం ఏర్పాటు చేశారు. ఇందులో తక్కువ ఫీజుతోపాటు విద్యార్థులకు స్కాలర్​సిప్స్ ఏర్పాటు చేశారు. 1882 వరకు ఎయిడెడ్​ ఇంగ్లీష్​ స్కూల్స్​ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అవే సెయింట్​ జార్జస్​ గ్రామర్​ స్కూల్​, ఆల్​ సెయింట్స్​ స్కూల్​, మహబూబ్​ కాలేజీ. 

1884వ సంవత్సరం అనేది విద్యావిధానంలో గొప్ప మైలురాయి. ఆరో నిజాం మీర్ మహబూబ్​ అలీఖాన్​ సయ్యద్​ హుస్సేన్​ బిల్​గ్రామి(నవాబ్​ ఇమాద్​ ఉల్​ముల్క్​)ను విద్యాశాఖ అధికారిగా లేదా డైరెక్టర్​ ఆఫ్​ పబ్లిక్ ఇన్​స్ట్రక్షన్​గా నియమించారు. ఇతని నియామకంతో విద్యాశాఖకు ప్రాధాన్యత పెరిగింది. ఈ శాఖకు 2.50 లక్షల వార్షిక బడ్జెట్​ కేటాయించారు. ఆర్థిక వనరులు సమకూరడంతో బిల్​గ్రామి విద్యాశాఖను పునర్​నిర్మించారు. ప్రతి సుభా హెడ్​ క్వార్టర్స్​లో ఒక హైస్కూల్​, ప్రతి జిల్లా హెడ్​ క్వార్టర్స్​లో హైస్కూల్​, ముఖ్యమైన పట్టణాల్లో అప్పర్​, లోయర్, ప్రైమరీ స్కూల్స్​ను ఏర్పాటు చేశారు. 

విశ్వవిద్యాలయ విద్య

హైదరాబాద్​ రాజ్యంలో ఉర్దూలో విశ్వవిద్యాలయం నెలకొల్పాలని 1873లో ఇద్దరు ప్రముఖ విద్యావేత్తలు రఫత్​యార్ జంగ్​, జమీలుద్దీన్​ అఫ్​ఘనీలు ప్రతిపాదించారు. 1879లో కైరో అల్ అజరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మౌల్వీ జమాలుద్దీన్​ అఫ్ఘాని హైదరాబాద్​ను సందర్శించి ఉర్దూ భాషలో ఇస్లామిక్​ విద్యా బోధన ప్రాముఖ్యతను చాటిచెప్పాడు. 1884లో బ్రిటీష్​ విద్యావేత్త డబ్ల్యూఎస్​ బ్లంట్​ హైదరాబాద్​ను సందర్శించి దక్కన్​ యూనివర్సిటీ స్థాపన గురించి ఆరో నిజాంతో చర్చించాడు. 1884, జనవరి 24న దక్కన్​ యూనివర్సిటీ స్థాపనకు సంబంధించిన ముసాయిదా ప్లాన్​ను ఆరో నిజాంకు డబ్ల్యూఎస్ బ్లంట్​ అందజేశాడు.

1919లో దారుల్​ ఉల్​ ఉలూమ్​ కాలేజీ విద్యార్థులు ఓల్డ్​ బాయిస్ సంఘంగా ఏర్పడి విశ్వవిద్యాలయ అవసరాన్ని గురించి ఒక ప్రతిపాదనను నిజాం రాజుకు సమర్పించారు. దాంతో నిజాం నవాచిబు తన ఆర్థిక మంత్రి సర్ అక్బర్​ హైదరీతో చర్చించి ఉస్మానియా యూనివర్సిటీ అనే పేరుతో అనుమతించాడు. ఈ ఉస్మానియా యూనివర్సిటీని 1400 ఎకరాల్లో స్థాపించడానికి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1918, ఆగస్టు 28న ఒక రాజ శాసనాన్ని జారీ చేశాడు. దీని స్థాపనకు కచ్చితంగా నిర్ణయిస్తూ 1919, ఆగస్టు 7న మరో రాజశాసనాన్ని జారీ చేశాడు. ఇందుకు సంబంధించిన తరగతులు మొదట ఆబిడ్స్​లోని అద్దె ఇండ్లలో ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీకి ఉర్దూ మీడియంలో కావాల్సిన పాఠ్యపుస్తకాల కోసం 1918లోనే ఒక ట్రాన్స్​లేషన్​ని​, కంపయిలేషన్​ బ్యూరోను స్థాపించారు. ప్రొఫెసర్ సర్ ప్యాట్రిక్​ జెడెస్ అనే ఆంగ్లేయుడు ఎంతో శ్రద్ధతో సర్వే చేసి ఇప్పటి 1400 ఎకరాల యూనివర్సిటీ ప్రాంతాన్ని నిర్మాణం కోసం ఎన్నుకున్నాడు.

నవాబ్​ యార్​జంగ్​, సయ్యద్​ అలీరజాలు వీరిద్దరు ఐరోపా దేశాలు తిరుగుతూ ఈజిప్టు విశ్వవిద్యాలయ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న బెల్జియన్​ శిల్పి జాల్ఫర్​ను కలిశారు. ఆయన డిజైన్​కు ముగ్ధులై 1933లో అతన్ని హైదరాబాద్​కు రప్పించారు. భారతదేశంలోని ప్రధాన కట్టడాలను తిలకించిన జాస్ఫర్​ ప్రాచీన హిందూ, మధ్యయుగ ముస్లిం, ఆధునిక ఐరోపా కట్టడాలతో మిళితమై డిజైన్​ను తయారు చేశారు. ఈ డిజైన్​ ప్రకారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్​ కళాశాల నిర్మాణం 1934లో ప్రారంభించగా 1939, డిసెంబర్​లో పూర్తయింది. అబిడ్స్​లో నడుపుతున్న తరగతులను ఇక్కడకు మార్చారు. ఇదే శైలి ఉస్మానియా లా కాలేజీ, ఇంజినీరింగ్​, సైన్స్​ కళాశాలల నిర్మాణల్లో కూడా కనిపిస్తుంది. ఈ కళాశాల నిర్మాణంలో ఫినిష్​ గ్రానైట్​ రాయిని ఉపయోగించడంతోపాటు హిందూ వాస్తు నిర్మాణ రీతితోపాటు ముధ్యుగాల ముస్లిం, అరబ్​, యూరిష్, గోతిక్​ మొదలైన వాస్తు కళా శైలులను మేళవించారు. 1949లో ఓయూ బోధనా భాషను ఉర్దూ నుంచి ఇంగ్లీష్​లోకి మార్చారు. 

ప్రాథమిక విద్య

విద్యాధికారి ఎంటీఏ మ్యేయో సూచనలు, సలహాలను ఏడో నిజాం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక విద్యావ్యాప్తికి సెకండరీ విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఎల్మా లతీఫ్​ను డైరెక్టర్​ ఆఫ్​ పబ్లిక్ ఇన్​స్ట్రక్టర్​గా నియమించింది. ఈయనే తనిఖీ వ్యవస్థను బలోపేతం చేస్తూ హైస్కూల్స్​పై ఇన్​స్పెక్టర్లను నియమించాడు. మ్యేయో సూచనల మేరకు ప్రాథమిక విద్యావ్యాప్తికి 1917–18లో నిజాం ప్రభుత్వం ఒక పథకాన్ని తయారుచేసింది.

దీని ప్రకారం ప్రాథమిక పాఠశాలలకు సరిపడేటట్లు అధ్యాపకులు, ఇతర సిబ్బందిని నియమించడం, సరైన సామగ్రి, బిల్డింగ్​ వనరులను సమకూర్చడం, కొన్ని పురాతన లోకల్​ఫండ్​ స్కూల్స్​ను అధిక జనాభా ప్రాంతాలకు లేదా వృద్ధి దశలోకి వచ్చే ప్రాంతాలకు మార్చడం, 243 ఎక్సపరిమెంటల్​ స్కూల్స్​ను స్థాపించడం, 77 స్కూల్స్​కు సాయం అందించడం, ఇందులో బాలికల పాఠశాలలు 46, బాలుర పాఠశాలలు 31గా ఉన్నాయి. ఈ చర్యల వల్ల 1921 నాటికి ప్రాథమిక పాఠశాలల సంఖ్య 4203కు విద్యార్థుల సంఖ్య 2,08,332కు పెరిగింది. 1921లో నిజాం నవాబు ప్రాథమిక విద్య పూర్తి ఉచితంగా అనే శాసనాన్ని జారీ చేశాడు. 1947లో నిజాం ప్రభుత్వం ఎంపిక చేసిన 10 ప్రాంతాల్లో నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. 6 నుంచి 8 సంవత్సరాల పిల్లలను పాఠశాలలలో చేర్పించారు. ఇలాంటి చర్యల వల్ల 1947-48లో ప్రాథమిక పాఠశాలల సంఖ్య 6,300లుగా విద్యార్థుల సంఖ్య 3.98 లక్షలు, అధ్యాపకుల సంఖ్య 13,940కు చేరింది. 

స్త్రీ విద్య

స్త్రీ విద్యలో ప్రభుత్వపరంగా ప్రయత్నాలు ఆరో నిజాం మీర్ మహబూబ్​ అలీఖాన్​ కాలంలో 1890లో నాంపల్లిలో జనానా బాలికల పాఠశాల స్థాపనతో ప్రారంభమయ్యాయి. స్త్రీ విద్యావ్యాప్తికి, స్త్రీల ఉన్నతికి కృషిచేసిన వాళ్లలో మొదటి సాలార్​జంగ్​ కూతురు నూరినిసాబేగం ఒకరు. ఈమె కులీనులు, జాగీర్దార్ల పిల్లలకు బాలిక పాఠశాలలను రాజభవనాల్లో స్థాపించి విద్యనందించారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్​ 1911లో రాజ్య పరిపాలన చేపట్టి నాటి నుంచి స్త్రీ విద్యకు ప్రోత్సాహం లభించింది. జనానా హైస్కూల్​ నాంపల్లి, మహబూబియా హైస్కూల్​, స్టాన్లీ బాలికల ఉన్నత పాఠశాల హుసైనీ మొహళ్ల మిడిల్​ స్కూల్​, శాలిబండ మిడిల్​ స్కూల్​, మదరసా నిజ్వాన్ హన్మకొండ, సికింద్రాబాద్​లో బాలికల పాఠశాలలు మొదలయ్యాయి.