షాపులు కేటాయించేదెన్నడు ?..మహబూబాబాద్‌‌లో రూ.5.61 కోట్లతో మోడ్రన్‌‌ మార్కెట్ల నిర్మాణం

  •    ఆరు నెలల కిందే ప్రారంభించిన కేటీఆర్‌‌
  •     షాపుల కేటాయింపును పట్టించుకోని ఆఫీసర్లు
  •     రోడ్ల వెంట, తాత్కాలిక మార్కెట్‌‌లోనే అమ్మకాలు

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌ జిల్లా కేంద్రంలో కోట్లు ఖర్చు చేసి అధునాతన హంగులతో నిర్మించిన మోడ్రన్‌‌ మార్కెట్లు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. పనులు పూర్తై, మార్కెట్‌‌ ప్రారంభమై నెలలు గడుస్తున్నా షాపులను కేటాయించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వ్యాపారులు రోడ్ల మీద, దుమ్మ, ధూళి మధ్యే తమ బిజినెస్‌‌ కొనసాగిస్తున్నారు.

రు. 5.61 కోట్లతో నిర్మాణం 

మహబూబాబాద్‌‌ పట్టణంలో రూ.5.61 కోట్లతో వెజ్, నాన్‌‌ వెజ్, పూలు, పండ్ల మార్కెట్‌‌ను నిర్మించారు. మేజర్‌‌ వర్క్స్‌‌ మొత్తం పూర్తి కావడంతో గతేడాది జూన్‌‌ 30న అప్పటి మున్సిపల్‌‌ శాఖ మంత్రి కేటీఆర్‌‌ చేతుల మీదుగా మార్కెట్‌‌ను ప్రారంభించారు. తర్వాత మిగిలిన చిన్నచిన్న పనులను సైతం ఇటీవల పూర్తి చేశారు. మార్కెట్‌‌ను మంత్రి ప్రారంభించి ఆరు నెలలు గడుస్తున్నా షాపుల కేటాయింపు, మార్కెట్‌‌ షిఫ్టింగ్‌‌ను ఆఫీసర్లు, లీడర్లు పట్టించుకోవడం లేదు.

షాపుల కేటాయింపులో తప్పని చిక్కులు

కొత్తగా నిర్మించిన మార్కెట్లలో షాపులు కేటాయించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మున్సిపల్‌‌ అనుమతితో కూరగాయల మార్కెట్‌‌లోని షెటర్లలో బిజినెస్‌‌ నిర్వహించిన వారి వివరాలు మున్సిపల్‌‌ ఆఫీసర్ల వద్ద ఉన్నప్పటికీ, మోడ్రన్‌‌ మార్కెట్‌‌లోని షాపులలో ఆధిపత్యం చలాయించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఎన్నికల ముందు షాపులు కేటాయిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు అప్పట్లో ఆ పనిని పక్కన పెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్‌‌ గెలవంతో సీన్‌‌ రివర్స్​అయింది. షాపుల కేటాయింపు ఎలా జరుగుతుందోనని పలువురు చర్చించుకుంటున్నారు.

రోడ్లపైనే అమ్మకాలు

జిల్లా కేంద్రంలోని ప్రజలతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన గ్రామాలు, తండాల ప్రజలు కూరగాయలు, నాన్‌‌ వెజ్‌‌ కోసం మహబూబాబాద్‌‌కే వస్తుంటారు. మోడ్రన్‌‌ మార్కెట్లు కట్టినా షాపులను కేటాయించకపోవడంతో వ్యాపారులు రోడ్లపైన, రైల్వే స్టేషన్‌‌ సమీపంలోని గాంధీ పార్కులోని తాత్కాలిక మార్కెట్‌‌లో కూరగాయలను విక్రయిస్తున్నారు. అక్కడ అరకొర వసతులు, అపరిశుభ్ర వాతావరణంతో ఇటు వ్యాపారులు.. అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొత్తగా కట్టిన మార్కెట్‌‌లో షాపులను కేటాయించి బిజినెస్‌‌ అక్కడే జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. 

మోడ్రన్‌‌ మార్కెట్‌‌ను వినియోగంలోకి తేవాలి 

కోట్లు ఖర్చు చేసి నిర్మించిన వెజ్, నాన్‌‌ వెజ్, పండ్లు, పూల మార్కెట్‌‌ను వినియోగంలోకి తీసుకురావాలి. ప్రస్తుతం వీధుల వెంట అపరిశుభ్ర వాతావరణంలో కూరగాయలు, మాంసం విక్రయించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్కెట్‌‌ను ప్రారంభించి ఆరు నెలలు గడుస్తున్నా వినియోగంలోకి తీసుకురాకపోవడం సరికాదు. ఆఫీసర్లు స్పందించి కొత్త మార్కెట్‌‌ను వినియోగంలోకి తీసుకురావాలి.    - 

బండి శ్రీహరి, మహబూబాబాద్‌‌ టౌన్‌‌

త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం 

మహబూబాబాద్‌‌లో నిర్మించిన వెజ్‌‌, నాన్‌‌ వెజ్‌‌ మార్కెట్లను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకొస్తాం. ఫినిషింగ్‌‌ పనుల మూలంగా కొంత మేరకు ఆలస్యం జరిగింది. మున్సిపల్‌‌ పాలకవర్గం సహకారంతో మార్కెట్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
-
 ప్రసన్నరాణి, మున్సిపల్‌‌ కమిషనర్‌‌, మహబూబాబాద్‌‌