న్యూక్లియర్ పోటీలో అందరూ అందరే!

న్యూక్లియర్ పోటీలో అందరూ అందరే!

20వ శతాబ్దంలో మనిషి కనిపెట్టిన టాప్​–3 అద్భుతాల్లో ఒకటి న్యూక్లియర్​ పవర్​. దీనిని మొదట వినాశనానికి ఉపయోగిస్తే… ఆ తర్వాత నుంచి మోడర్న్​ లైఫ్​ స్టయిల్​కి కావలసిన సదుపాయాలకు వినియోగిస్తున్నారు. ప్రపంచంలో ఉత్పత్తయ్యే కరెంట్​లో 11 శాతం న్యూక్లియర్​ ఎనర్జీయే! ఇంత ఉపయోగమున్న అణుశక్తిని సైనిక బలం పెంచుకోవడానికి ఎనిమిది దేశాలు వాడుతున్నాయి. అమెరికా, రష్యాల పవర్​ పాలిటిక్స్​ని అడ్డం పెట్టుకుని మిగిలిన దేశాలన్నీ న్యూక్లియర్​ గేమ్​ ఆడుతున్నాయి.

ఒక్కసారిగా మళ్లీ అణు బాంబుల మీద అందరి దృష్టి పడింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్​నాథ్ సింగ్ తాజాగా చేసిన ప్రకటనతో మన దేశంకూడా అణు బాంబు విషయంలో చాదస్తాలకు పోదన్న విషయం క్లియర్ అయింది. ‘మొదట అణుబాంబు వేయకూడదన్న’ పాలసీ నుంచి మన దేశం పక్కకు జరిగినట్లు రాజ్​నాథ్ ప్రకటన చెప్పకనే చెబుతోంది. అంతేకాదు అమెరికా, రష్యా మధ్య తాజాగా మధ్యంతర శ్రేణి న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం రద్దు కావడంకూడా అణుశక్తిపై చర్చలకు దారి తీసింది. ఈ ఒప్పందం రద్దయిన తర్వాత రష్యా శుక్రవారం ‘బ్యూరేవెస్ట్నిక్​’ పేరుతో న్యూక్లియర్ మిస్సైల్​ని టెస్ట్​ చేసినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు నార్త్ కొరియా అణుబాంబు తయారు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆగడం లేదు. ఇరాన్ సైతం న్యూక్లియర్ రేసులోకి రావడానికి ఉబలాటపడుతోంది. రెండో ప్రపంచ యుద్దం తర్వాత దాదాపుగా అన్ని దేశాలు అణ్వాయుధాలపై  దృష్టి పెట్టాయి. పొరుగుదేశాలతో ఉన్న గొడవలు, అక్కడి ప్రత్యేక పరిస్థితులు అయా దేశాలు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి కారణాలవుతున్నాయి. ఇప్పటివరకు తమ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని కేవలం ఎనిమిది దేశాలే (అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్​, ఉత్తర కొరియా) బయటకు వెల్లడించాయి. ఇజ్రాయెల్​ దగ్గర అణు బాంబులున్నా తమ దగ్గర వెపన్స్​ ఉన్న విషయాన్ని బయటకుమాత్రం ఆ దేశం వెల్లడించడంలేదు.

ఆయుధాల్లో అమెరికానే టాప్

ప్రపంచంలో అణ్వాయుధాలను కలిగిన మొదటి దేశంగా అమెరికా చరిత్ర కెక్కింది. న్యూక్​ వెపన్స్​ని పెద్ద సంఖ్యలో పోగేసుకున్న దేశం కూడా అమెరికానే. తొలిసారిగా యుద్ధంలో అణ్వాయుధాన్ని ప్రయోగించిన దేశంకూడా అమెరికానే. ఫ్రాంక్లిన్ రూజ్​వెల్ట్ ప్రెసిడెంట్​గా ఉన్నప్పుడు ‘మాన్ హట్టన్  ప్రోగ్రాం’ పేరుతో న్యూక్లియర్ వెపన్స్ తయారీని అమెరికా మొదలెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశ (1945)లో జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిల​పై తొలిసారిగా అణు బాంబులు వేసింది.  మొత్తం 6,185 వెపన్స్​ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ప్రయోగించడానికి వీలుగా 1,600 వార్ హెడ్స్​ని అమెరికా రెడీ చేసి పెట్టుకుంది.

అమెరికా తర్వాత ఎక్కువ వార్ హెడ్స్​ని కలిగి ఉన్న దేశం రష్యానే. అమెరికాకి దీటుగా 1,600 వార్ హెడ్స్​ని ప్రయోగానికి సిద్ధం చేసుకుంది. రష్యా దగ్గర మొత్తం 6,490 వార్ హెడ్స్ ఉన్నాయి. రష్యా 1949 ఆగస్టు 29న తొలి అణు పరీక్ష నిర్వహించింది. అమెరికా, రష్యా తర్వాత అణ్వాయుధాలను తయారు చేసుకున్న మూడో దేశం యునైటెడ్ కింగ్​డమ్​. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘ట్యూబ్ అల్లాయ్స్’ పేరుతో  న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్​ని బ్రిటన్​ డెవలప్ చేసుకుంది. 2016 నాటికి బ్రిటన్​ దగ్గర ప్రయోగానికి సిద్ధంగా 120 వార్ హెడ్స్ ఉన్నట్లు అంచనా. యూకే దగ్గర మొత్తం 200 వార్ హెడ్స్ ఉన్నాయి. యూకే తర్వాతి స్థానం ఫ్రాన్స్​ది. చార్లెస్ డీగల్​ హయాంలోనే న్యూక్లియర్ వెపన్స్​ని తయారు చేసుకునే కార్యక్రమాన్ని ఫ్రాన్స్ చేపట్టింది. 1960లో తొలిసారి న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసింది. లేటెస్ట్ లెక్కల ప్రకారం ఫ్రాన్స్ దగ్గర 300 వార్ హెడ్స్ ఉన్నాయి. వీటిలో 280 వార్ హెడ్స్​ని ప్రయోగించడానికి వీలుగా డిప్లాయ్​మెంట్ పొజిషన్​లో ఫ్రాన్స్ రెడీ చేసి పెట్టింది.

పాకిస్తాన్​ దగ్గర ..

పాకిస్తాన్​ దగ్గర 160 వార్ హెడ్స్ ఉన్నట్లు అంచనా. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై పాకిస్తాన్​ సంతకం చేయలేదు. దీంతో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న వార్ హెడ్స్ సంఖ్య బయటకు వెల్లడి కాలేదు. పొరుగుదేశమైన ఇండియా పై వ్యతిరేకతతో వార్ హెడ్స్​ని అదే పనిగా పోగేసుకుంది పాకిస్తాన్​. జుల్ఫీకర్ అలీ భుట్టో హయాంలో ముల్తాన్​లో ఓ సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అవసరం లేకపోయినా ఇండియాని బూచిగా చూపించి, న్యూక్లియర్ వెపన్స్ తయారీ, కొనుగోళ్లకే ఉన్న డబ్బంతా ఊడ్చి పెడుతోంది పాకిస్తాన్​.

చైనాలో అంతా రహస్యమే

చైనాలో న్యూక్లియర్ వెపన్స్​కి కొదవ లేదు. ఈ విషయంలో చైనా చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తోంది. చైనా దగ్గర 290 వరకు వార్ హెడ్స్ ఉన్నాయంటూ నిపుణులు లెక్కలు చెబుతున్నా వాటిని నమ్మే పరిస్థితులు లేవు. చైనా దగ్గర వాస్తవంగా ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరూ ఏం చెప్పినా అన్నీ  ఊహాగానాలే. తమ దేశం 1964లో తొలిసారి అణ పరీక్ష నిర్వహించినట్లు చైనా అధికారులు చెబుతారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడమంటే చిన్న విషయం కాదు. అదో పెద్ద ప్రాసెస్. ఎంతోమంది సైంటిస్టులు ఏళ్ల తరబడి ప్రయత్నాలు జరిపితేగానీ, న్యూక్​ వెపన్స్​ తయారు కావు. వీటి తయారీకి ఇంటర్నేషనల్​గా ఎన్నో రూల్స్ అండ్  రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయినా ఈ రూల్స్​ను ఎవరూ పట్టించుకోవడం లేదు.

న్యూక్లియర్ వెపన్స్​పై  పెదవి విప్పని ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అన్ని దేశాలు భావిస్తున్నాయి. మొత్తం 80 నుంచి 400 వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని బయటి దేశాల సమాచారం. 1967 ప్రాంతంలోనే ఇజ్రాయెల్ వార్​హెడ్స్​ను సమకూర్చుకుందని ఇంటర్నేషనల్ వర్గాల కథనం. అయితే ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఎన్నడూ తన దగ్గర న్యూక్స్ ఉన్నట్లు బహిరంగంగా ఒప్పుకోలేదు. అలా అని లేవని కూడా చెప్పలేదు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఒక్క ఇజ్రాయెల్​లోనే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇరాన్ నుంచి తమ దేశ భద్రతకు డేంజర్ ఉందని ఇజ్రాయెల్ చెబుతోంది.

 

ఎన్పీటీ ఒప్పందం అంటే…

ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ వెపన్స్​ని తగ్గించే ఉద్దేశంతో ‘ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (న్యూక్లియర్ నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ–ఎన్పీటీ)’ని రూపొందించారు. 1968లో ఈ ఒప్పందం కుదిరింది. 1970 మార్చి 5 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. న్యూక్లియర్ వెపన్స్ లేని దేశాలు వాటిని తయారు చేసుకోవడాన్ని ఈ ఒప్పందం నిరోధిస్తుంది. అలాగే ఆల్రెడీ అణ్వాయుధాలు ఉన్న దేశాలు వాటిని మరింతగా పోగేసుకోవడానికి ఈ ఒప్పందం చెక్ పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 180 కన్నా  ఎక్కువ దేశాలు ఎన్పీటీని ఆమోదించాయి. ఎన్పీటీ అసలు టార్గెట్ ప్రపంచంలో అణ్వాయుధాలు లేకుండా చూడటమే. ఈ ఒప్పందంపై  కేవలం ఐదు దేశాలే సంతకాలు చేశాయి. అవి అమెరికా, రష్యా, బ్రిటన్​, ఫ్రాన్స్, చైనా. అయితే ఎన్పీటీ ఒప్పందంలోని అనేక అంశాలు ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నాయంటున్నారు రక్షణ రంగ నిపుణులు. దీంతో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై  ఇండియా సంతకం పెట్టలేదు.

సోవియట్ డీయాక్టివేషన్​

కోల్డ్​ వార్​ సమయంలో సోవియట్​ యూనియన్​ (రష్యా) అమెరికాకి పోటీగా న్యూక్లియర్​ వెపన్స్​ పోగేసుకుంది. ముక్కలు ముక్కలుగా సోవియట్​ విడిపోయేనాటికి 35,000 అణ్వాయుధాలు ఉండేవి. వీటన్నింటినీ యూనియన్​లోని ఉక్రెయిన్, కజకిస్తాన్, బెలారస్​లలో పెద్ద సంఖ్యలో దాచి ఉంచింది. సోవియట్​ విడిపోయాక ఈ వెపన్స్​ని రష్యాకి తరలించారు. చాలా వాటిని రష్యా డీ–యాక్టివేట్ చేసేసింది. పనికొస్తాయనుకున్న కొన్ని భాగాలనుమాత్రం న్యూక్లియర్ పవర్ స్టేషన్లలో వాడుకుంది.

 

 

రష్యా కొత్త ఆయుధం ‘స్కైఫాల్​’!

రష్యా లేటెస్ట్​గా స్కైఫాల్​ పేరుతో ఒక మిస్సైల్​​ను సమకూర్చుకునే ప్రయత్నం చేసింది. ఇనీషియల్​ పరీక్షల్లో సక్సెస్​ అయినా దీనికి సంబంధించి పూర్తి ప్రయోగాలు జరుగలేదు. కొన్ని వేల మైళ్ల దూరాన ఉన్న టార్గెట్​ను స్కైఫాల్​ మిస్సైల్​​ ఛేదించగలదని   రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. డిఫెన్స్​ సిస్టమ్​లో ఇది చాలా పవర్​ ఫుల్​ మిస్సైల్​​ అంటున్నారు. ఈ మిస్సైల్​​కు  ‘బ్యూరేవెస్ట్నిక్’ అనే మరో పేరు కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈ  మిస్సైల్ పరీక్షలో ప్రమాదం జరిగినట్లు  వార్తలొచ్చాయి.

న్యూక్లియర్​ వార్​ హెడ్స్​ వివరాలు

తాజా అంచనాల ప్రకారం ప్రపంచంలోని ఎనిమిది దేశాల్లో మొత్తంగా 14,000 న్యూక్లియర్​ వార్​హెడ్స్​​ ఉన్నాయి. వీటిలో 90 శాతం అమెరికా, రష్యాలే పోగేసుకున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రపంచ యుద్ధం గనుక వస్తే… ప్రయోగించడానికి రెడీగా 9,500 అణు బాంబులు ఉన్నాయట. మిగతావాటిలో ఎన్నింటిని తగ్గించుకోవాలనే విషయంలో చర్చలు సాగుతున్నాయి.

దేశం                 వార్​ హెడ్స్​

అమెరికా         6,185

రష్యా              6,490

ఫ్రాన్స్​               300

బ్రిటన్               200

ఇండియా         140

పాకిస్తాన్​          160

నార్త్ కొరియా      30

ఇజ్రాయెల్​          90

ఆధారం : స్టాక్​ హోమ్​ ఇంటర్నేషనల్​ పీస్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​, అమెరికా విదేశాంగ శాఖ ఈ ఏడాది జూన్​లో విడుదల చేసిన నివేదిక.