- అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ప్రాజెక్ట్ ఆపరేటింగ్
- ప్రత్యేకంగా కంట్రోల్‌రూం ఏర్పాటు
- వరద ప్రవాహం మొదలుకాగానే ట్రయల్ రన్
భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్ట్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్‌లోకి నీరు వస్తే ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఇంజినీర్లు వెయిట్ చేస్తున్నారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ (ఎన్‌హెచ్‌పీ) కింద స్కడా (సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్) సిస్టంతో ప్రాజెక్ట్‌ను అనుసంధానించనున్నారు. రాష్ట్రంలోని చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుతో పాటు గద్వాల్‌లోని జూరాల ప్రియదర్శిని, మంచిర్యాలలోని కుమ్రంభీం, అదిలాబాద్‌లోని సాత్నాల ప్రాజెక్ట్‌లను కూడా ఈ స్కీంలో ఆధునికీకరిస్తున్నారు. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్ట్ వద్ద పనులు పూర్తయ్యాయి.
ఆపరేటింగ్ మొత్తం కంట్రోల్ రూం నుంచే...
తాలిపేరు ప్రాజెక్ట్‌ను ఆధునికీకరించేందుకు రూ. కోటితో జపాన్‌కు చెందిన యొకొగావా సంస్థ గతేడాది పనులు ప్రారంభించింది. ప్రాజెక్ట్ వద్ద మెయిన్ డేటా కంట్రోల్ రూంను నిర్మించారు. ఆటోమెటిక్ సిస్టం ద్వారా గేట్లను ఆపరేట్ చేయడం, ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద స్థాయిని ముందుగానే పసిగట్టడం వంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటి నిర్వహణ మొత్తం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో కంట్రోల్‌రూం నుంచే జరుగనుంది. ప్రాజెక్ట్ క్రస్టు గేట్ల నుంచి దిగువకు వదిలే వరద నీటి క్రమబద్ధీకరణ కూడా ఈ టెక్నాలజీ ద్వారా కంట్రోల్ రూం నుంచే చేయనున్నారు. తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి వచ్చే వరద, రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటిమట్టం ఇలా ప్రతీ అంశం ఆటోమెటిక్‌గా సీడబ్ల్యూసీకి చేరుతుంది.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో ప్రాజెక్ట్ నిర్వహణ
తాలిపేరు ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహ తీరును అంచనా వేసేందుకు వద్దిపేట వద్ద ఫ్లో మెజర్‌మెంట్ డివైజ్‌ను ఏర్పాటు చేశారు. దిగువన తాలిపేరు హైలెవల్ వంతెన వద్ద మరో డివైజ్‌ను ఏర్పాటు చేశారు. ఈ డివైజ్‌ల ద్వారా రిజర్వాయర్‌లోకి వచ్చే వరద ప్రవాహం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంలోని సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ అవుతుంది. ప్రాజెక్ట్ గేట్ల ఆపరేషన్ సైతం మెయిన్ కంట్రోల్ రూం నుంచే జరుగనుంది. కుడి, ఎడమ కాల్వలతోపాటు, ప్రాజెక్ట్‌కు చెందిన 25 గేట్ల వద్ద బుల్లెట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేందుకు ప్రాజెక్టు వంతెనపై 300 డిగ్రీలు చూపే పీటీజెడ్(ప్యాన్‌టిల్ట్ జూమ్ కెమెరా)లు అమర్చారు. ఎన్‌క్లోజర్ల ద్వారా గేట్ల ఆపరేషన్ జరిగేలా టెక్నాలజీని జోడించి కంట్రోల్‌రూంకు అనుసంధానించారు. జలాశయంలో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ట్రాన్స్‌మీటర్లు ఏర్పాటు చేశారు. హైలెవల్ వంతెనపై వీఎఫ్‌డీ (వేరియబుల్ ప్రీక్వెన్సీ డ్రైవ్)ను ఏర్పాటు చేశారు. వరద ప్రవాహం మొదలుకాగానే ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆఫీసర్లు అన్నీ సిద్ధం చేశారు.
ట్రయల్ రన్‌కు రెడీ
తాలిపేరు ప్రాజెక్ట్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. ట్రయన్ రన్ కోసం అంతా రెడీ చేశాం. రిజర్వాయర్‌లోకి నీరు వస్తే టెక్నాలజీని పరీక్షించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేశాం. ఇక ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ మొత్తం కంట్రోల్ రూం నుంచే జరుగనుంది.
– తిరుపతి, డీఈ, తాలిపేరు ప్రాజెక్ట్