పెద్దపల్లి, వెలుగు: అమృత్ భారత్ స్కీం లో భాగంగా రైల్వే స్టేషన్లను సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి చేస్తోంది. ఈ స్కీమ్‌కు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్ రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 39 స్టేషన్లు ఎంపిక కాగా ఉమ్మడి జిల్లా స్టేషన్లకు చోటు దక్కడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన స్టేషన్ల అభివృద్ధకి రూ. 20 కోట్ల అందుతాయి. ప్రతీ రైల్వే స్టేషన్లలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్కే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కే ఇంపార్టెన్స్...
రామగుండం, పెద్దపల్లి రైల్వే స్టేషన్ల మీదుగా నిత్యం రైళ్లు వెళ్తుంటాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు రైలు ప్రయాణం మీదనే ఆధారపడుతున్నారు. ఈ స్టేషన్లలో మౌలికసదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో గతం నుంచి ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. అమృత్‌భారత్ నిధుల ద్వారా ఈ మూడు స్టేషన్లు అభివృద్ది చెందటంతో పాటు మౌలికసదుపాయాల కల్పన జరుగుతుంది. రైల్వే డివిజనల్ మేనేజర్లతో ప్రత్యేకనిధిని ఏర్పాటు చేస్తారు. ఈ స్కీం ద్వారా స్టేషనల్లో రూఫ్ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.
సంవత్సరంలోపే పనులన్నీ పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. రైల్వేస్టేషన్ల ఎంట్రెన్స్‌లు, రైల్వేట్రాకులను మాడ్రనైజ్ చేయడం, వెయిటింగ్ రూంల ఏర్పాటు, పార్కింగ్ స్థలాలనుపెంచడం, ఆధునిక లైటింగ్, రైళ్ల రాకపోకలు తెలిసేలా డిజిటల్ బోర్డులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు లాంటివి ఈ స్కీం ద్వారా ఏర్పాటు చేయనున్నారు.ఎంపిక కావడం సంతోషంరామగుండం, కరీంనగర్ రైల్వేస్టేషన్ల ను అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. ఈ స్టేషన్ల నుంచి నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు పోతుంటారు. ఇక్కడి నుంచి ఎక్కువ మంది ఢిల్లీ, ముంబాయి కి రైళ్లున్నాయి. ఏండ్ల నుంచి చూస్తున్న. గతంలో ఈ స్టేషన్లలో సరైన సౌకర్యాలు లేవు. ఇప్పుడు అమృత్ భారత్ స్కీం ద్వారా ఈ స్టేషన్లు అభివృద్ధి కావడం సంతోషంగా ఉంది.
- సయ్యద్ సజ్జాద్, స్థానికుడు, పెద్దపల్లి