
గుజరాత్ లోని మోధేరా సూర్యదేవాలయం ధగధగ మెరిసిపోతుంది. మిరిమిట్లు గొలిపే అందాలతో ఆకట్టుకుంటోంది. మోధేరా గ్రామం పూర్తి సౌరశక్తితో నడిచే గ్రామంగా అక్టోబర్ 9న ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించబోతుండటంతో...చారిత్రిక సూర్యదేవాలయాన్ని ముస్తాబు చేశారు. సూర్య దేవాలయంలో సౌరశక్తితో ఏర్పాటు చేసిన హెరిటేజ్ లైటింగ్,3డి ప్రొజెక్షన్ మోధేరా చరిత్రపై సందర్శకులకు అవగాహన కల్పిస్తుంది. ఈ 3డీ ప్రొజెక్షన్ ను అక్టోబర్ 9న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత ప్రతీ రోజూ..15 నుంచి -18 నిమిషాలు 3డి ప్రొజెక్షన్ పనిచేస్తుంది. సందర్శకులు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు హెరిటేజ్ లైటింగ్‌లను ఆస్వాదించవచ్చు. 3డి ప్రొజెక్షన్ మాత్రం ప్రతి సాయంత్రం 7 గంటల నుండి 7:30 గంటల వరకు పని చేస్తుంది.
మొట్టమొదటి గ్రామం..
గుజరాత్‌లోని మోధేరా గ్రామం అక్టోబర్9న భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే గ్రామంగా మారబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 9న ఈ ప్రకటన చేయనున్నారు. ఈ గ్రామంలోని 1,300 కంటే ఎక్కువ ఇండ్లపై ప్రజలు సోలార్ పలకలను ఏర్పాటు చేసుుకన్నారు. దీని వల్ల విద్యుత్ బిల్లులు 60 శాతం నుంచి 100 శాతం తగ్గాయి. పర్యావరణ పర్యాటకానికి ఒక ప్రధాన ఉదాహరణగా.. మోధేరా సూర్యదేవాలయ ప్రాంతంలో సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటైంది.
రెండు దశల్లో రూ.80 కోట్లు ఖర్చు..
గుజరాత్ మెహ్సానాలోని మోధేరా గ్రానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో పాటు 24 గంటలూ సౌర శక్తిని అందించడానికి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘సోలారైజేషన్ ఆఫ్ మోధేరా సన్ టెంపుల్ అండ్ టౌన్ పథకం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 12 హెక్టార్ల భూమిని కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దశల్లో 50:50 ప్రాతిపదికన రూ. 80.66 కోట్లు ఖర్చు చేశాయి. మొదటి దశలో రూ. 69 కోట్లు, రెండో దశలో రూ. 11.66 కోట్లు ఖర్చుపెట్టాయి. ప్రస్తుతం మోధేరా గ్రామంలో సోలార్ ప్యానెళ్ల ద్వారా పగటిపూట విద్యుత్ సరఫరా అవుతుండగా..సాయంత్రం వేళల్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా ఇళ్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసమే..
“క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే ప్రధాన మంత్రి దార్శనికతను నెరవేర్చడంలో గుజరాత్ మరోసారి ముందంజ వేసినందుకు సంతోషిస్తున్నట్లు సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. 2030 నాటికి భారతదేశ ఇంధన అవసరాలలో 50% పునరుత్పాదక ఇంధనం ద్వారా ఉత్పత్తి చేయాలనే మోడీ సంకల్పించారని చెప్పారు. ప్రధాని సంకల్పాన్ని నెరవేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
సున్నా విద్యుత్ బిల్లులు..
మోధేరా గ్రామంలో ఏర్పాటు చేసిన సౌరశక్తి..తమ గ్రామ ప్రజలకు మేలు చేకూరిందని మోధేరా సర్పంచ్ జతన్బెన్డి ఠాకోర్ అన్నారు. గతంలో కరెంట్ బిల్లులు వెయ్యి రూపాయలకంటే ఎక్కువగా వచ్చాయని..సోలార్ పవర్ వల్ల విద్యుత్ బిల్లులు తగ్గిపోయాయన్నారు. సాధ్యమైనంత వరకు తమ గ్రామంలో అన్ని ఇళ్లపై సౌర ఫలకాలను ఉచితంగా అమర్చారని చెప్పారు. సౌరశక్తి వల్ల..తమకు ఖర్చులు మిగిలాయని చెప్పుకొచ్చారు.