
- అనురాగ్ ఠాకూర్‌కు కేబినెట్‌లో దక్కని చోటు
- అమేథి నుంచి పోటీచేసి ఓడిపోయిన స్మృతి ఇరానీ
- కొత్త ప్రభుత్వంలో అవకాశం ఇవ్వని ఎన్డీయే
- నారాయణ్ రాణే, రాజీవ్ చంద్రశేఖర్‌కు నిరాశే
- మోదీ 3.0 కేబినెట్‌లో ఓబీసీలు 27 మంది
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ గత కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న సుమారు 17 మందికి మోదీ 3.0లో చోటు దక్కలేదు. కొంతమంది ఎన్నికల్లో ఓడిపోవడంతో మంత్రి పదవి దక్కకపోగా.. మరికొందరు ఎంపీలుగా గెలిచినా కేబినెట్‌లో చోటు లభించలేదు. సీనియర్ కేంద్ర మంత్రులను కొనసాగించడంతో పాటు పలువురు మాజీ సీఎంలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణేతో పాటు మొత్తం 20 మంది మోదీ 3.0 నుంచి ఔట్ అయ్యారు. యూపీలోని అమేథీ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 1.60 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన స్మృతి ఇరానీకి మోదీ 3.0లో చోటు దక్కలేదు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమిర్పూర్ సెగ్మెంట్ నుంచి అనురాగ్ ఠాకూర్ గెలిచినప్పటికీ కేంద్ర మంత్రి పదవి వరించలేదు. మోదీ 2.0లో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్‌గా సేవలందించిన నారాయణ్ రాణేకు కూడా ఈసారి కేంద్ర మంత్రి పదవి దక్కలేదు. రాణే మహారాష్ట్రలోని రత్నగిరి–సింధుదుర్గ్ నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ నిరాశే ఎదురైంది. గత మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అజయ్‌భట్ ఈ ఎన్నికల్లో గెలిచినా మంత్రి పదవి దక్కలేదు.
22 మందికే ఎన్డీయే కూటమి నుంచి ఫోన్
మోదీ 2.0లో కేంద్ర మంత్రిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు చంద్రశేఖర్ గట్టి పోటీ ఇచ్చారు. సాధ్వి నిరంజన్, పురుషోత్తం రూపాలా, భారతీ పవార్, రావు సాహెబ్ దాన్వే, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, నితీశ్ ప్రమాణిక్, అజయ్ మిశ్రా తేని, సుభాశ్ సర్కార్, అశ్విని కుమార్ చౌబే, కపిల్ పాటిల్, భగవత్ కరాద్‌లు గత మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పని చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో వీరంతా ఓడిపోయారు. గత మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా ఉన్న 22 మందికి మాత్రమే ఆదివారం ఉదయం బీజేపీతో పాటు మిత్రపక్ష పార్టీల నుంచి కాల్స్ వచ్చాయి. వెంటనే ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసానికి రావాల్సిందిగా ఆదేశించాయి.
సామాజికవర్గాల వారీగా ప్రాధాన్యం
కేబినెట్‌లో అన్ని సామాజికవర్గాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. 71 మందిలో 27 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ, ఐదుగురు మైనార్టీ, మిగిలిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. అయితే, తొలిసారి రికార్డ్ స్థాయిలో 18 మంది సీనియర్ మంత్రులు మంత్రిత్వ శాఖలను నిర్వహించబోతున్నారు. ఇక ఈ మంత్రి వర్గంలో 43 మంది మూడు, అంతకన్నా ఎక్కువ సార్లు ఎంపీగా గెలిచారు. 39 మంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారు. ఇక చాలా మంది సీఎంలుగా పని చేయగా.. 34 మంది రాష్ట్ర మంత్రులుగా సేవలందించారు.