ముంబైని దోచుకునేందుకే మోదీ, అదానీ వస్తున్నరు: రేవంత్ రెడ్డి

ముంబైని దోచుకునేందుకే  మోదీ, అదానీ వస్తున్నరు: రేవంత్ రెడ్డి
  • శివాజీ వారసులమని చెప్పుకొనే ఆ బందిపోటు ముఠాను తరిమికొట్టాలి
  • చంద్రాపూర్​లో సీఎం ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ముంబైని దోచుకోవడానికి గుజరాత్ నుంచి ప్రధాని, అదానీ వస్తున్నారని సీఎం రేవంత్​ అన్నారు.  శివాజీ మహరాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్​, బాలా సాహెబ్ ఠాక్రే వారసులుగా చెప్పుకొనే ఆ బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని మరాఠా ప్రజలకు పిలుపునిచ్చారు. వెన్నుపోటు రాజకీయాలతో ప్రతిపక్ష ప్రభుత్వాలపై కుట్రలు చేసే బీజేపీని ఈ ఎన్నికల్లో మొత్తానికే పాతిపెట్టాలని అన్నారు. శనివారం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గుగస్​, రాజురా, డిగ్రాస్, వార్ధా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల సభల్లో కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ హోదాలో  రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 

ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి దేశంలోనే పెద్దమొత్తంలో పన్నులు చెల్లించే మహారాష్ట్రకు మోదీ సర్కారు తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. పోరాటాల గడ్డ మహారాష్ట్ర జనమంతా ఏకమై కమలం పార్టీ అన్యాయాలకు వ్యతిరేకంగా  పోరాటం చేసే సమయం ఆసన్నమైందని తెలిపారు.   ‘‘ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఇప్పుడు ఇక్కడ జరిగేవి ఎన్నికలు కాదు.. ఒక పోరాటం.. ఈ పోరాటంలో మహా వికాస్ అఘాడీ కూటమిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఒక వీరుడిగా మారాలి” అని పిలుపునిచ్చారు. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లాంటి వెన్నుపోటుదారులతో క్షుద్ర రాజకీయాలు చేసే బీజేపీని తరిమికొట్టాలని కోరారు. తెలంగాణలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తరిమికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. 

తెలంగాణలో రైతు ప్రభుత్వం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు విజయవంతమైనట్టే మహారాష్ట్రలోనూ మహా వికాస్ అఘాడీ ఇచ్చిన ఐదు గ్యారంటీలు రాష్ట్రంలో, ప్రత్యేకించి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ తదితర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. 

మహారాష్ట్ర గడ్డ.. మహాయోధులను కన్న నేల అని, శివాజీ మహరాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్, బాలా సాహెబ్ ఠాక్రే వారసులుగా, రాహుల్ గాంధీ సైనికులుగా కుట్రల పార్టీ బీజేపీతో కలబడి గెలువాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజురా అసెంబ్లీ సీటులో మహా వికాస్ అఘాడీ అభ్యర్థి సుభాష్ ధోతేను 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సీటులో ఓటమి తప్పదని భావించిన బీజేపీ తన బీ టీమ్ వ్యక్తులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపిందని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇక్కడ గెలిచే అభ్యర్థితోపాటు పొరుగు రాష్ట్ర సీఎంగా తానూ  రాజురా ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యత తీసుకుంటానని, ఒక్క ఓటుతో ఇద్దరు సేవకులను పొందే అవకాశాన్ని రాజురా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ కోరారు.

వెన్నుపోటుదారులకు బుద్ధిచెప్పండి

దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న ముంబై మహానగరం తర్వాత ఇతర పెద్ద నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌‌‌‌‌‌‌‌కతాల్లో బీజేపీకి అసలు ప్రాతినిధ్యమే లేదని అన్నారు. ముంబైలో కూడా బీజేపీకి స్థానం ఉండబోదని, ముంబై నగరం  మహా వికాస్ అఘాడీతోనే ఉంటుందని చెప్పారు. ఏక్‌‌‌‌‌‌‌‌నాథ్ షిండే, అజిత్ పవార్ లు ఇద్దరూ గుజరాత్ కు గులాంలుగా మారారని, మహారాష్ట్ర ప్రజల తీర్పును ఈ ఇద్దరు కాలరాశారని మండిపడ్డారు. 

ఇలాంటి వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘‘ తెలంగాణ ప్రజలకు ఆరాధ్యులైన  కొండా లక్ష్మణ్ బాపూజీ  గతంలో ఉమ్మడి హైదరా బాద్ స్టేట్ లో ఇదే  రాజురా ప్రాంతం నుంచి చట్టసభకు ప్రాతినిధ్యం వహించారు. కాలక్రమంలో రాష్ట్రాలుగా విడిపోయినా విదర్భ ప్రాంతం, తెలంగాణ ప్రజల మధ్య బంధుత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ అనుబంధంతోనే మీ అన్నగా నేను ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ లో మరో సోదరుడిగా మీకు అండగా నిలబడతాను” అని మహారాష్ట్ర ప్రజలనుద్దేశించి  రేవంత్ వ్యాఖ్యానించారు.