దేశ ప్రధానిగా నరేంద్రమోదీ వచ్చాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని రేట్లు పెంచారని.. అగ్గిపెట్టె, సబ్బుబిల్లతో మొదలు చివరికి అగర్‍బత్తిపై కూడా జీఎస్టీ వేశారని సీఎం రేవంత్‍రెడ్డి అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ చెప్పారని, అట్లయితే పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలివ్వాలని, అవి ఎటుపోయాయని ప్రశ్నించారు. ‘‘మోదీ ఇచ్చిన హామీలు ఏవైనా అమలయ్యాయా? బీజేపీ నేతలు చెప్పాలి. దేశంలో ప్రజల ఆదాయం పెరగలేదు కానీ.. అదానీ, అంబానీ ఆస్తులు పెరిగినయ్. స్విస్ బ్యాంక్ నుంచి లక్షలాది కోట్లు తీసుకొచ్చి అందరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని మోదీ చెప్పిండు. అవి వేయకుండా ఏ ముఖంతో ఓట్లు అడుగుతరు?” అని ఆయన నిలదీశారు. కాజీపేటకు సోనియమ్మ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే దాన్ని మోదీ మహారాష్ట్రకు తరలించారని ఫైర్ అయ్యారు.
‘‘బీజేపోళ్లు శ్రీరామనవమి వస్తే రాజకీయం.. హనుమాన్ జయంతి వస్తే ఇంకో రాజకీయం చేస్తున్నరు. దేవుడు గుడిలో, భక్తి గుండెల్లో ఉండాలి.. దేవుడి పేరుతో ఓట్లు పొందాలని చూసేవారికి పోలింగ్ బూత్‍లో గుణపాఠం చెప్పాలి” అని అన్నారు. గడిచిన పదేండ్లలో రాష్ట్రాన్ని ఢిల్లీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని.. బొమ్మ బొరుసులా కేసీఆర్, మోదీ తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు.