నన్ను ఓడించడం మోదీ, అమిత్​షా వల్లే కాలేదు: అసదుద్దీన్ ఒవైసీ

నన్ను ఓడించడం మోదీ, అమిత్​షా వల్లే కాలేదు: అసదుద్దీన్ ఒవైసీ
  • ఎన్ని ఎత్తులు వేసినాచివరికి నేనే గెలిచా
  • హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నరు
  • కొడంగల్ ​సభలో హైదరాబాద్​ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

కొడంగల్, వెలుగు: హైదరాబాద్​లో ఎంఐఎం పార్టీని, తనను ఓడించడం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్  షాకే సాధ్యం కాలేదని హైదరాబాద్  ఎంపీ అసదుద్దీన్  ఒవైసీ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఢిల్లీ నుంచి దారుస్సలాం వరకు ఎన్నో ఎత్తులు వేశారని, చివరకు తానే గెలిచానని ఆయన ​ పేర్కొన్నారు. శనివారం కొడంగల్​లో ఏర్పాటు చేసిన ఎంఐఎం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఒవైసీ మాట్లాడారు.

బీజేపీ పాలనలో ముస్లింలపై  దాడులు పెరిగాయని, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆరోపించారు. మతాల మద్య చిచ్చుపెట్టి హిందు, ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్​లో నిర్వహింస్తున్న కన్వర్​ యాత్రలో షాపులకు యాజమాని పేరు ప్రదర్శించాలని యోగి ప్రభుత్వం, ఉత్తరాఖండ్  ప్రభుత్వం ఉతర్వులు ఇవ్వడం మతాల మద్య చిచ్చుపెట్టడమే అని వ్యాఖ్యానించారు.

 ఎంఐఎం పార్టీ ముస్లింల కోసమే పనిచేయదని, రోజూ తనను కలిసేందుకు అన్ని మతాల వారు వస్తుంటారని తెలిపారు. అన్ని మతాలు, వర్గాల మద్దతు ఎంఐఎంకు ఉందన్నారు. హైదరాబాద్​ మాదిరిగానే కొడంగల్​లో ఎంఐఎం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కొడంగల్​లో ఉర్దూ మీడియం కాలేజీలు, పాఠశాలల  ఏర్పాటుకు అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.