- మహిళా చట్టాల అమలులో విఫలమయ్యారు: మమతా బెనర్జీ
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ రేప్‌లు జరుగుతున్నయ్
- ఏండ్లు గడుస్తున్నా న్యాయం దొరకడం లేదు
- యూపీ హథ్రాస్ కేసు ఏమైంది?
- అసెంబ్లీలో ‘అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు’ కు ఆమోదం
కోల్‌కతా: మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కఠినమైన చట్టాలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారుల కోసం బెంగాల్ ప్రభుత్వం ‘అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు–2024’ పేరిట హత్యాచార నిరోధక ముసాయిదాను మంగళవారం అసెంబ్లీ స్పెషల్ సెషన్లో ప్రవేశపెట్టింది. అత్యాచారానికి గురైన బాధితురాలు చనిపోతే.. నిందితుడికి మరణ శిక్ష విధించేలా ఈ బిల్లు రూపొందించింది. సభ్యులందరూ బిల్లుపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రభుత్వం ఈ బిల్లును గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు పంపిస్తుంది. ఆయన ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెళ్తుంది.
ఇదొక చరిత్రాత్మక బిల్లు
‘‘ఇదొక చరిత్రాత్మక బిల్లు. కోల్‌కతా ట్రైయినీ డాక్టర్‌కు ఈ బిల్లు ద్వారా నివాళులర్పిస్తున్నం. బిల్లు ఆమోదానికి ఆటంకం కలిగిస్తున్న శాసనసభ ప్రతిపక్ష నేత సువేందు అధికారి తన పదవికి రాజీనామా చేయాలి. అత్యాచారం వంటి దారుణాలు జరగకుండా సామాజిక సంస్కరణలు రావాలి’’ అని మమతా బెనర్జీ అన్నారు. యూపీ, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై ఎక్కువ నేరాలు జరుగుతున్నాయన్నారు. ‘‘బెంగాల్లోనే బాధిత మహిళలకు సత్వర న్యాయం జరుగుతోంది. 2020 హథ్రాస్‌లో 20 ఏండ్ల దళిత యువతిపై అత్యాచారం జరిగితే ఏం న్యాయం చేశారు? రాజస్థాన్‌లో గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నారిపై రేప్ జరిగింది. ఆ కేసు ఏమైంది?’’ అని మమత ప్రశ్నించారు. కోల్‌కతా ట్రైయినీ డాక్టర్ కేసులో సీబీఐ నుంచి న్యాయం డిమాండ్ చేస్తున్నామని మమతా బెనర్జీ అన్నారు. ‘మేము ప్రవేశపెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు అడగాలి. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత మాది’’ అని మమతా బెనర్జీ చెప్పారు.
బిల్లులో ఏముందంటే..
- అత్యాచారానికి గురైన బాధితురాలు చనిపోయినా, బాధితురాలిని నిస్సహాయ స్థితిలో వదిలేసినా నిందితుడికి ఉరి
- ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత 21 రోజుల్లో దర్యాఫ్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష విధించాలి. ప్రత్యేక సందర్భాల్లో సీనియర్ పోలీసు అధికారి రాత పూర్వక హామీతో దర్యాప్తును పొడిగించవచ్చు.
- అత్యాచారం లేదా సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి నో పెరోల్.. జీవితాంతం జైల్లోనే ఉండాలి.
- బాధితురాలికి సత్వర న్యాయం అందించేందుకు అత్యాచారం సహా లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయ స్థానాల ఏర్పాటు..
- జిల్లా స్థాయిలో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో అపరాజిత స్పెషల్ టాస్క్‌ఫోర్స్. కేసు పరిశోధనపై ఈ టాస్క్‌ఫోర్స్ ఫోకస్ చేస్తుంది.
- మళ్లీ.. మళ్లీ అత్యాచారానికి పాల్పడే నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి మరణ శిక్ష ఉంటుంది.
- బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచి.. ఆమెకు భద్రత కల్పిస్తుంది.
- కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చేసినా.. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించినా.. పోలీసులు, హెల్త్ ఆఫీసర్లకు జరిమానాలు విధిస్తుంది.
- అత్యాచారాలకు సంబంధించిన కోర్టు ప్రొసీడింగ్స్‌ను అనధికారికంగా ప్రచురిస్తే మూడు నుంచి ఐదేండ్ల పాటు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.