కాంగ్రెస్-బీజేపీ.. రాజకీయంగా రెండు భిన్న ధ్రువాలు. రెండు పార్టీల ఐడియాలజీలు పూర్తిగా వేర్వేరు. కానీ నాయకుల మధ్య సిద్ధాంత, రాజకీయ పరమైన శత్రుత్వమే తప్ప వారి వారి వ్యక్తిత్వాలను బట్టి ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవం ఉంటుందని పార్లమెంటు సాక్షిగా దేశమంతా చూసింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ పార్లమెంట్ సభ్యత్వం ముగుస్తున్న సందర్భంగా వీడ్కోలు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకోవడం దీనికి నిదర్శనం. ఈ నెల 8న రాజ్యసభలో జరిగిన ఈ ఘటన.. ఆ ఇద్దరు నేతల గొప్ప వ్యక్తిత్వాన్ని, హుందాతనాన్ని చాటింది.
బీజేపీ సర్కారు, ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు, పాలసీలను నిరంతరం విమర్శించే వ్యక్తి.. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. పార్లమెంటులో, బయట ఆయన విమర్శలకు మోడీ సహా కేంద్ర మంత్రులు, ఇతర బీజేపీ నేతలు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరేండ్లుగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఆజాద్ రాజ్యసభ సభ్యత్వానికి ఫిబ్రవరి 15న ముగింపు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయన ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడం చూసి.. రాజకీయంగా శత్రు పక్షమైన బీజేపీ సంతోషించాలి. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు వీడ్కోలు చెప్తూ రాజ్యసభలో ప్రసంగించినప్పుడు ఎమోషనల్ అయ్యారు. గతంలో జరిగిన ఓ సంఘటన సందర్భంగా ఆయన చూపిన మానవత్వాన్ని గుర్తు చేసుకుని మోడీ కంటతడి పెట్టారు. ఆజాద్ వ్యక్తిత్వాన్ని పొగుడుతూ నేటి తరం రాజకీయ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఆజాద్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నేతలతో స్నేహంగా ఉండడం గులాం నబీ ఆజాద్ గొప్ప వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెబుతోంది. 1980 నుంచి 2021 వరకు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన పార్లమెంటరీ రాజకీయాల్లో ఎన్నో పదవులు చేపట్టినా ఏనాడూ గర్వానికి పోయి అవతలివారిని కించపరచలేదు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ వీడ్కోలు సభలో ప్రస్తావించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఆయన ఎప్పుడూ ఒకేలా ఉన్నారని, చాలా డీసెంట్‌గా వ్యవహరించారని, ఎప్పుడూ అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదని అన్నారు. ఆజాద్ నుంచి మిగతా పార్లమెంట్ సభ్యులంతా ఈ విషయాన్ని నేర్చుకోవాలని చెప్పారు. తన పార్టీ రాజకీయ ప్రయోజనాలతో పాటు, రాజ్యసభ, దేశ ప్రయోజనాల కోసం కూడా ఆయన పని చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు.
సభ సజావుగా సాగడంలో సహకారం
ప్రస్తుతం బడ్జెట్ సెషన్‌లో రాజ్యసభలో 99 శాతం ప్రొడక్టివిటీ రికార్డ్ అయింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆజాద్‌కు ఈ ఘనత దక్కుతుంది. పార్లమెంట్ సమావేశాలు మొదలైన ఫస్ట్ డే కాంగ్రెస్ పార్టీ సభలో నిరసన తెలిపింది. కానీ ఆ తర్వాతి రోజు నుంచి సభ సజావుగా సాగడానికి సహకారం అందించింది. పార్లమెంటులో నిరసన తెలపడం పార్టీలకు ప్రజాస్వామిక హక్కు అని గతంలో దివంగత అరుణ్ జైట్లీ సభలో ఓపెన్‌గా అన్నారు. ఆ నిరసనలు శ్రుతి మించకుండా సభకు సహకరించడంపై ఆజాద్‌ను మెచ్చుకోవాలి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. పీవీ ప్రధానిగా ఉన్న టైమ్‌లో 1991–96 మధ్య, మన్మోహన్ సింగ్ హయాంలో 2004–2005 మధ్య ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆజాద్ ప్రతిపక్షాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో మంచి రిలేషన్స్ పెంచుకున్నారు. పార్లమెంటును సజావుగా నడపడానికి ఆయనకు చేసిన కృషి ఆ టైమ్‌లో అందరి మెప్పు పొందింది. ఏదైనా విషయం గురించి చర్చించేటప్పుడు వ్యక్తుల పేర్లు ప్రస్తావించి, వాళ్ల మనోభావాలను దెబ్బ తీయాల్సిన అవసరం లేదని, సమస్య పరిష్కారాన్ని అందరినీ ఒప్పించేలా కూడా చూపించొచ్చని ఆజాద్ నమ్ముతారు. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరినీ నొప్పించకుండా ఒప్పించడం వాజ్‌పేయి లాంటి నేతలను చూసి స్ఫూర్తి పొందానని ఆజాద్ కూడా స్వయంగా చెప్పడం గొప్ప విషయం. కశ్మీర్ సీఎంగా ఉన్న టైమ్‌లో జరిగిన టెర్రర్ అటాక్ గురించి తలచుకుని ఆజాద్ కూడా కంటతడి పెట్టుకున్నారు.
2015లో ఔట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు
ప్రభుత్వ పాలసీల్లో లోపాలను ఎత్తి చూపడంలో ఆజాద్ ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. ఎదుటి వారిని గౌరవిస్తూనే వారి పొరపాట్ల గురించి చెప్పొచ్చన్న వ్యక్తిత్వాన్ని ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ఔట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు ఆజాద్‌కు రావడానికి ఈ విధానమే కారణమని చెప్పొచ్చు. ఏదైనా ఒక ఐడియాలజీని నమ్మిన వాళ్లు ఇతరుల పాయింట్ తప్పు అని చెప్పడానికి వాళ్లను అవమానించేలా గొంతేసుకుని పడిపోవాల్సిన అవసరం లేదని గతంలోనూ ఆజాద్ చెప్పిన సందర్భాలున్నాయి. మనం చెప్పాలనుకున్న విషయాన్ని నెమ్మదిగా, పొలైట్‌గా కూడా చెప్పొచ్చని, మన ప్రసంగాల్లో ఆ డిగ్నిటీ ఉంటే అవతలి వాళ్లు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా మన పాయింట్‌ను వినాలనుకుంటారని ఆయన అన్నారు.
పెద్దల సభలో సుదీర్ఘ అనుభవం
ఆజాద్ తొలిసారి 1980లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984లో లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అయితే 1990లో రాజ్యసభ ఎంపీగా తొలిసారి పెద్దల సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజ్యసభ ద్వారానే పార్లమెంట్ మెంబర్‌గా వచ్చారు. అంతటి ఎక్కువ కాలం పెద్దల సభ అనుభవమే ఆజాద్ పెద్దరికాన్ని పెంచడంలో ఉపయోగపడింది. ఇందిరా గాంధీ సహా ఎంతో మంది పెద్ద పెద్ద నేతలను దగ్గరి నుంచి చూసిన ఆయన వారి నుంచి ఎన్నో మంచి గుణాలు నేర్చుకున్నానని చెబుతారు.
ఇద్దరూ సీఎంలుగా ఉండగా..
మోడీ, ఆజాద్.. ఇద్దరూ గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన సమయంలో జరిగిన ఘటనను గుర్తు చేసుకుని ప్రధాని ఎమోషనల్ అయ్యారు. 2005–2008 మధ్య గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ తరఫున జమ్మూ కశ్మీర్ సీఎంగా ఉన్నారు. ఆయన సీఎం అయిన తొలి సంవత్సరమే కశ్మీర్‌లో టూరిస్టులపై టెర్రర్ అటాక్ జరిగింది. ఆ దాడిలో కొంత మంది గుజరాతీ టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆ టైమ్‌లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ విషయం తెలియగానే రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీకి ఫోన్ చేసి, మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా డెడ్ బాడీలను కశ్మీర్ నుంచి గుజరాత్‌కు చేర్చాలని కోరారు. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఆజాద్ ఫోన్ చేసి అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి మోడీకి వివరించారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను మోడీ రాజ్యసభలో ప్రస్తావించారు. ‘ఆ రోజు ఆజాద్ ఫోన్ చేసినప్పుడు ఆయన నుంచి వచ్చిన స్పందన నేను ఊహించలేదు. తన సొంత కుటుంబ సభ్యులనో, స్నేహితులనో కోల్పోయినంతగా ఏడ్చారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏ ఒక్కరినీ అంతకుముందు కనీసం ఆయన చూసి కూడా ఉండరు. అయినా టెర్రరిస్టుల చర్య ఆయనను కదిలించేసింది’ అని మోడీ చెప్పారు. ఆయన మానవత్వం గురించి చెప్పడానికి ఇది చాలంటూ ప్రధాని ఎమోషనల్ అయ్యారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. అపోజిషన్‌లో ఉన్న వ్యక్తి గొప్పతనం చెప్పడానికి కూడా ఎంతో హుందాతనం అవసరం. అది మోడీ ఈ సందర్భంలో ప్రదర్శించారు. పర్సా వెంకట్, పొలిటికల్ ఎనలిస్ట్.
ఇవి కూడా చదవండి
ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మార్కెట్ అనుకూలం
రూ. 431 కోట్లు కట్టండి : బార్క్‌కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు
టెస్లా రాకతో రూపురేఖలు మారిపోనున్న.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్