మోదీకి తమ్ముడు ‌కేసీఆర్.. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటరు : ప్రియాంక గాంధీ

  • కేంద్రం, రాష్ట్రంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటరు: ప్రియాంక గాంధీ
  •     ప్రజల సంపదను రెండు పార్టీలు దోచుకుంటున్నయ్
  •     ఉద్యోగాలు కావాలంటే బీఆర్ఎస్‌ను గద్దె దించి కాంగ్రెస్‌ను గెలిపించండి
  •     ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలో రోడ్ షోలు, మధిర మీటింగ్‌లో కామెంట్స్

ఖమ్మం, వెలుగు: ప్రజల సంపదను కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ దోచుకుంటున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని విమర్శించారు. ఈ మూడు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి రోడ్ షోలలో, మధిరలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు. ‘‘మోదీకి కేసీఆర్ తమ్ముడిలా ఉంటాడు. 

కేంద్రంలో అవసరం అయితే మోదీకి తమ్ముడు ‌కేసీఆర్ సపోర్ట్ ఇస్తారు. తెలంగాణలో కేసీఆర్‌‌కు మోదీ మద్దతిస్తారు. వాళ్లిద్దరికీ ఎంఐఎం మద్దతిస్తుంది. ఇలాంటి నాయకులు మనకు కావాలా?” అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు పదేండ్లుగా ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్.. తన కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని మండిపడ్డారు. ‘‘తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది కేసీఆర్ కుటుంబం బాగు కోసం కాదు. రైతులు, ఆడబిడ్డలు, యువత, విద్యార్థుల శ్రమతో రక్తం చిందించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. 

మాయమాటలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. గత పదేండ్లలో ప్రజల కలలను నిజం చేయలేదు. తెలంగాణను భ్రష్టు పట్టించింది. మీ పనులు కావాలంటే కేసీఆర్‌‌కు కమీషన్లు ఇవ్వాలి. కాళేశ్వరం ప్రాజెక్టుతో మొదలు గ్రామాల వరకు అవినీతి జరిగింది. పేపర్లు లీక్ చేసి పిల్లల భవిష్యత్తు నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే” అని ఆరోపించారు. రుణమాఫీ జరగలేదన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామని బీజేపీ అంటున్నదని, సంస్థ ప్రజలదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సింగరేణి ప్రభుత్వ పరిధిలో ఉంటుందని హామీ ఇచ్చారు.

సంపదను ప్రజలకు పంచినం

‘‘దేశంలో రెండు రకాల పార్టీలున్నాయి. మీ సంపద దోచుకొనే పార్టీ ఒకటైతే.. మీ జేబులోకి డబ్బులు వేసే పార్టీ ఇంకోటి. రాజస్థాన్‌లో మహిళల‌ కోసం మంచి పథకాలు తీసుకొచ్చాం. చత్తీస్‌గఢ్‌లో మహిళలకు ఉపాధి కల్పించాం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులను భర్తీ చేశాం. ప్రజల సంపదను ప్రజలకు పంచినం. యువతకు కొలువులు, అందరికీ ఇండ్లు, మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించే పథకాలు, రైతులకు రుణమాఫీ చేసే ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎన్నుకోవాలి. 

భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రజల సంపద ప్రజలకు అందుతుంది” అని ప్రియాంక గాంధీ అన్నారు. కేసీఆర్ పాలనలో ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ‘‘ఓట్ల కోసం చాలా మంది నేతలు వస్తారు. వారితో జాగ్రత్త. సరైన ఆలోచన చేసి మంచి నాయకులను ఎన్నుకోండి. మీ అందరి ముఖ్యమైన బాధ్యత మీ ఓటు” అని సూచించారు. ‘‘నిన్న రాత్రి మా అమ్మ సోనియాతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ‘ఎక్కడున్నావు’ అని అడిగారు. 

హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పాను. ప్రత్యేక తెలంగాణ కోసం ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆందోళనలు, పోరాటాలు చేశారని సోనియా గుర్తుచేసుకున్నారు. అనేక మంది తల్లులు, వారి బిడ్డలు రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగాలు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నావని నన్ను అడిగారు. సత్యం మాత్రమే చెబుతానని చెప్పాను. ‘హామీలు ఇవ్వడం కాదు.. దానిని అమలు చేసేందుకు కృషి చేయాలి’ అని అమ్మ నాతో చెప్పారు’’ అని ప్రియాంక చెప్పారు.

డబ్బులు ఆశ జూపేటోళ్లతో జాగ్రత్త

‘‘నాయకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలి.. ఎదిరించాలి. నరేంద్ర మోదీ దగ్గర ఉన్న కొంత మంది వేల కోట్లు సంపాదిస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల నుంచి పాలన సాగిస్తూ ఫామ్‌హౌస్ కే పరిమితమయ్యారు. ఆస్తులు సంపాదించుకున్నారు. కేసీఆర్‌‌ని గద్దె దింపాలా వద్దా? ఉద్యోగాలు కావాలనుకునే నిరుద్యోగులు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించి.. కొలువులు ఇచ్చే కాంగ్రెస్‌ను గెలిపించాలి” అని ప్రియాంక విజ్ఞప్తి చేశారు. ‘‘ఎవరికి పడితే వారికి ఓటు వేయకండి. డబ్బులు ఆశ చూపి, స్కీమ్‌లు తీసుకొచ్చి ఆశ పెడతారు. అలాంటోళ్లతో జాగ్రత్త. ప్రజలు క్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మేమొచ్చినంక ఆరు గ్యారంటీలను అమలు చేస్తం’’ అని హామీ ఇచ్చారు.

వాహనంపై ప్రియాంక డ్యాన్స్

ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలో ప్రియాంక రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. ఖమ్మంలో వైరా రోడ్డులోని జడ్పీ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు కూడా కనిపించాయి. తర్వాత పాలేరు నియోజకవర్గంలో నాయుడుపేట నుంచి వరంగల్ క్రాస్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించారు. వేల మంది జనం హాజరుకాగా.. గిరిజనుల కొమ్ము డ్యాన్సులు, సంప్రదాయ నృత్యాలతో ప్రియాంకకు స్వాగతం పలికారు. 

దారిమధ్యలో చిన్న పాపను ఎత్తుకొని ప్రియాంక ముద్దు చేశారు. పాపకు చాక్లెట్లు ఇచ్చారు. డీజే పాటలకు గిరిజనులు డ్యాన్సులు వేస్తుండటంతో.. వాహనంపై నుంచే ప్రియాంక కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలంటూ తెలుగులో నినాదాలు చేశారు. రోడ్ షో, బహిరంగ సభల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి రోడ్ షోలో మట్టా రాగమయి పాల్గొన్నారు.