- చివరిరోజు ఆయా పార్టీల ముఖ్యనేతల రోడ్‌షోలు
కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ వారం రోజుల ప్రచారం మరింత కీలకం కానుంది. దీంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కామారెడ్డికి ఈ వారంలోనే ఇద్దరు అగ్రనేతలు వస్తున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీల అభ్యర్థుల ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. కామారెడ్డిలో గెలుపును బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి.
ఇక్కడ కేసీఆర్, రేవంత్‌రెడ్డి పోటీ చేస్తుండడంతో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నా యి. ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామారెడ్డికి వస్తున్నారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి మద్దతుగా జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే ఎన్నికల సభలో ఆయన పాల్గొంటారు.
26న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం కామారెడ్డికి రానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు, మండల కేంద్రాల్లో నిర్వహించిన మీటింగ్స్, రోడ్డు షోల్లో కేటీఆర్ పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి కూడా భిక్కనూరు, రాజంపేట మండలాల్లో కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొన్నారు.
కార్నర్మీటింగ్స్, రోడ్‌షోలు
టీపీసీసీ ప్రెసిడెంట్, కామారెడ్డి కాంగ్రెస్అభ్యర్థి రేవంత్‌రెడ్డి శుక్రవారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో రోడ్‌షో, కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. ప్రచారం చివరి రోజు ఈనెల 28న జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు ఆయా పార్టీల ప్రతినిధులు తెలిపారు. బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్, కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి, బీజేపీ తరఫున ఆ పార్టీ ముఖ్య నేతలు రోడ్‌షోకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మిగతా నియోజకవర్గాల్లోనూ..
ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీల అభ్యర్థుల తరఫున ఆ పార్టీల ముఖ్యనేతలు రోడ్‌షోలు, కార్నర్మీటింగ్స్లకు హాజరుకానున్నారు. ఈ వారంలో జుక్కల్నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి జుక్కల్ నియోజకవర్గానికి ఈటెల రాజేందర్ రానున్నారు.