- ఛత్తీస్గడ్ సీఎం భూపేశ్ బఘేల్
- కేసీఆర్ పతనం మొదలైంది : తీన్మార్మల్లన్న
హనుమకొండ/కాజీపేట, వెలుగు: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారని ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ బఘేల్మండిపడ్డారు. బీజేపీకి బీఆర్ఎస్బీ టీమ్‌గా పని చేస్తోందని, రెండు పార్టీలు కలిసి దోచుకుంటున్నాయని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు విసుగు చెంది ఉన్నారని, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారన్న భయంతోనే చాలాచోట్లా వారి ఓట్లు తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డికి మద్దతుగా ఆదివారం ఆయన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
కాజీపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో భూపేశ్ బఘేల్ మాట్లాడుతూ గతంలో కేసీఆర్ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించారని, డబుల్ బెడ్రూం ఇండ్లు, మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని చెప్పిన మోదీ ఆ మాటే మరిచారన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన ఆయన మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు.
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తాగుబోతుల రాజ్యంగా మారిందన్నారు. హామీలు అమలు కాలేదని, గల్లీకొక బెల్ట్ షాపు మాత్రం పెట్టించాడని మండిపడ్డారు. ఓరుగల్లును ప్రపంచాన్ని తలదన్నే సిటీగా చేస్తానని హామీ ఇచ్చి, ప్రపంచం ముందు తలదించుకునేలా మార్చారని విమర్శించారు. కేసీఆర్పతనం మొదలైందని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏఐసీసీ ప్రతినిధి డాలీ శర్మ, కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి, నాయకులు జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మేం గెలిస్తే ప్రజలకే పంచుతాం..
కరీంనగర్ : కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్ కు మద్దతుగా జ్యోతిబాపూలే గ్రౌండ్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభకు హాజరైన భూపేష్ బఘేల్ మాట్లాడుతూ తొమ్మిదేండ్ల పాలనలో రూ.5లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్...మళ్లీ గెలిస్తే రూ.10 లక్షల కోట్లు చేయడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే ఖజానా అంత కేసీఆర్ కుటుంబానికే పోతుందని, బీజేపీకి ఓటేస్తే అదానీ ఖాతాలోకి పోతుందన్నారు. కాంగ్రెస్ ఓటేస్తే అంతా ప్రజలకే పంచుతామని స్పష్టం చేశారు. బీజేపీకి తెలంగాణలో బలం లేకున్నా..బీఆర్ఎస్ ను గెలిపించడం కోసమే మోదీ, అమిత్ షా తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో మార్పు ఉంటుందా లేదా చెప్పాలని అడగడంతో ఉంటుందని ప్రజలు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి పురుమళ్ల శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, టీపీసీసీ నాయకులు రోహిత్ రావు, అంజన్ కుమార్, రమ్యారావు పాల్గొన్నారు.