పక్కా బిజినెస్​ టూర్​!

ఇండో–చీనీ భాయీ భాయీ అన్నది పాత నినాదం. నెహ్రూ ప్రతిపాదించిన పంచశీల నాటి స్లోగన్​ అది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం, కొన్ని తగాదాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలో ట్రేడ్​ వార్​ సాగుతున్న ప్రస్తుత నేపథ్యంలో… చైనా వైఖరిలో మార్పు కనబడుతోంది. ‘డ్రాగన్​ (చైనా), ఎలిఫెంట్​ (ఇండియా) కలిసి మెలిసి కదం తొక్కాలి’ అన్నది తాజా ఎత్తుగడ. మోడీ–జిన్​పింగ్​ల మూడో ఇన్​ఫార్మల్​ భేటీ పరస్పర లాభదాయకంగా ఉండేలా మాటలు సాగాయి. అయితే, గత అనుభవాలనుబట్టి, చైనా ఎంతవరకు మాట మీద నిలబడుతుందన్న సందేహం లేకపోలేదు. పైకి చెప్పకపోయినా  జిన్​పింగ్​ టూర్​ పక్కా బిజినెస్​ కోసమేనని అంటున్నారు.

మారుతున్న చైనా వైఖరి మహాబలిపురంలో జరిగిన ‘చెన్నై కనెక్ట్​’ మీట్​లో మరోసారి కనిపించింది. ప్రధాని నరేంద్ర మోడీ, చైనా ప్రెసిడెంట్​ జిన్​పింగ్ చిన్ననాటి స్నేహితుల్లా కలిసి తిరిగారు. ప్రపంచ ఎకానమీలో టాప్​–5 పొజిషన్​లో ఉన్న చైనాకి… దూసుకొస్తున్న ఆర్థిక శక్తి ఇండియాతో స్నేహం చాలా అవసరమన్న సంకేతాన్ని జిన్​పింగ్​ ఇచ్చారు. వీరిద్దరి మధ్య ఇన్​ఫార్మల్​ భేటీ  జరగడం ఇది మూడోసారి. ఏడాదిన్నరలోనే రెండుసార్లు జరగడం చెప్పుకోదగ్గ విషయం.  తొలిసారి 2014లో అహ్మదాబాద్​లో, 2018​లో చైనాలోని వూహన్​ సిటీలో రెండోసారి,  లేటెస్ట్​గా మూడోసారి చెన్నైలోనూ కలిశారు. ఆర్టికల్–370​​ రద్దు తర్వాత పాకిస్థాన్​కే చైనా సపోర్ట్​ చేసింది. గతంలోనూ చాలాసార్లు దాని తరఫునే వకాల్తా పుచ్చుకుంది. తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ ‘ఒన్​ బెల్ట్​ ఒన్​ రోడ్​’ని కూడా పాక్​ భూభాగం నుంచే వెళ్లేలా ప్లాన్​ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఇండియా ప్రధానితో రెండు రోజులు పర్సనల్​ మీటింగ్​కి రావటం, ఇద్దరూ దోస్తుల్లా తిరుగుతూ వివిధ అంశాలపై మనసు విప్పి మాట్లాడుకోవటం అందర్నీ ఆశ్చర్యపరచింది.

అమెరికాతో చైనాకి  వ్యాపార సంబంధాలు అంత సజావుగా లేవు.  సాటి ఆసియా దేశమైన ఇండియాతో అంటీముట్టనట్లు ఉండాలనే ఉద్దేశం చైనాకి లేదని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. చైనాతో స్నేహానికి ‘చెన్నై కనెక్ట్​’ ఎంతో ఉపయోగపడుతుందని మన దేశంకూడా ఆశిస్తోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న ట్రేడ్​ ఇన్​బ్యాలెన్స్​ని సరిచేయటానికి కొత్త మెకానిజాన్ని ఏర్పడాలని పెద్దలిద్దరూ ఓ అంగీకారానికి రావటం చెప్పుకోదగ్గ విషయం. దీనివల్ల రెండు దేశాలకూ మంచి ఫలితాలే వస్తాయని ట్రేడ్​ వర్గాల అభిప్రాయం.

పర్సనల్​ డిప్లొమసీకి ప్రాధాన్యం

సహజంగా ఏ రెండు దేశాల మధ్య అయినా వ్యక్తులకు బదులు స్ట్రక్చరల్​ సిస్టమ్​ ఉంటుంది. కానీ.. ఇండియా, చైనా పాలకులు ప్రస్తుతం దానికి భిన్నంగా నడుచుకుంటున్నారు. పర్సనల్​ డిప్లొమసీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశాల మధ్య సంబంధాలు వ్యవస్థల మధ్య చర్చల ద్వారా కన్నా టాప్​ లీడర్​ల రిలేషన్స్​ ద్వారానే బలపడతాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తమ మధ్య లోతుగా, ఎలాంటి దాపరికాలూ లేకుండా చర్చలు జరిగాయని జిన్​పింగ్​ అన్నారు.  చైనా అఫీషియల్​ మీడియాకూడా చాలా పాజిటివ్​గా స్పందించింది. ‘ఇండియా, చైనా మంచి ఇరుగూపొరుగులా ఉండాలి. పొందికగా, పొరపొచ్చాల్లేని పార్ట్​నర్స్​గా పనిచేయాలి. డ్రాగన్​, ఎలిఫెంట్​ కలిసిమెలిసి కదం తొక్కాలి’ అని చైనా అఫిషియల్​ మీడియా సైతం కోరుకుంటోంది. వూహన్ సమావేశం ‘హార్ట్​ టు హార్ట్​ సమ్మిట్​’ ఇచ్చిన స్పూర్తి​తోనే చైనాతో సహాయ సహకారాల్లో కొత్త శకానికి తెర లేచిందని ప్రధాని మోడీ చెప్పారు. తాజా భేటీలో ఆయన జిన్​పింగ్​తో ఎన్నో అంశాలు ప్రస్తావించి ఉంటారని అంటున్నారు. ముఖ్యంగా రెండు విషయాలు మోడీకి చాలా సంతృప్తి కలిగించాయని వివరిస్తున్నారు.

ట్రేడింగ్​పై ఫోకస్​

మహాబలిపురంలో జిన్​పింగ్​తో దాదాపు ఆరు గంటల పాటు ఒన్​–టు–వన్​గా జరిగిన చాటింగ్​లో ప్రధాని మోడీ చైనాతో ట్రేడింగ్​పైనే ఫోకస్​ పెట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 2018​ డేటా ప్రకారం ఇండియా, చైనా మధ్య ఏటా 95.54 బిలియన్​ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది. ఇందులో చైనా వాటా ఎక్కువ. మన దేశం లోటు 53 బిలియన్​ డాలర్లు. ఈ లోటు తగ్గించి రెండు దేశాలూ సమానంగా ఎగుమతులు, దిగుమతులు చేసుకునేలా చూడాలని లీడర్లు ఇద్దరూ చెన్నై కనెక్ట్​లో నిర్ణయించారు. ఇండియా, చైనా ఈక్వల్​ ట్రేడింగ్​ పార్ట్నర్​షిప్​ దిశలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, చైనా డిప్యూటీ పీఎం హు చున్​హువా రంగంలోకి దిగనున్నారు. ట్రేడ్​, ఇన్వెస్ట్​మెంట్​, సర్వీసెస్​ రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై రానున్న రోజుల్లో చర్చిస్తారు. జిన్​పింగ్​ ఇండియా టూర్​ ముగిశాక ఫారిన్ సెక్రెటరీ విజయ్​ గోఖలే కూడా ఇదే చెప్పారు.  ట్రేడింగ్​ గురించి మోడీ వివరించిన అంశాలను శ్రద్ధగా విన్న జిన్​పింగ్​ వాణిజ్య లోటు తగ్గింపునకు చైనా సిన్సియర్​ యాక్షన్​ తీసుకుంటుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఇది మూడోసారి!

రెండు రోజులపాటు మహాబలిపురంలో జరిగిన ‘చెన్నై కనెక్ట్’ సమావేశానికంటే ముందు ఇండో–చైనా ప్రభుత్వాధినేతలు రెండుసార్లు ఇదే పద్ధతిలో కలుసుకున్నారు. 2014 సెప్టెంబరులో భార్య పెంగ్ లియువాన్​తోపాటుగా జిన్​పింగ్ ఇండియాకి వచ్చి, అహ్మదాబాద్​లోని సబర్మతీ నదీ తీరంలో గడిపారు. ‘ఇండియా సోజర్న్’ పేరుతో జరిగిన పర్యటనలో మోడీతో కలిసి ఉయ్యాలలూగడం, గాంధీజీ ఆశ్రమంలో చరఖా తిప్పి నూలు వడకడం, గుజరాతీ జానపద నృత్యాలను ఎంజాయ్ చేయడం వంటివి చేశారు జిన్​పింగ్ దంపతులు. 2018 ఏప్రిల్ నెలలో రెండు రోజులపాటు మన ప్రధాని నరేంద్ర మోడీ చైనా వెళ్లి ‘హార్ట్ టు హార్ట్ సమ్మిట్’లో పాల్గొన్నారు. జిన్​పింగ్​తోపాటు బోటు షికారు, మ్యూజియం సందర్శన, ఈస్ట్ లేక్ ఒడ్డున ‘ఛాయ్ పె చర్చ’ వంటివి చేశారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఇద్దరి మధ్య దాదాపుగా ఏకాంత చర్చలే సాగాయి. ట్రాన్స్​లేటర్లు మినహా మరెవరూ లేకుండా ఇండో–చైనా వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలపైనే చర్చించారని ఆ తర్వాత ఫారిన్ ఎఫైర్స్ సెక్రటేరియట్ తెలిపింది.  రెండు దేశాల మధ్య బలమైన దీర్ఘకాలిక సత్సంబంధాలు ఏర్పడాలంటే.. ‘కామన్‌ థింకింగ్‌, కామన్‌ రిలేషన్స్‌, కామన్‌ కో-ఆపరేషన్‌, కామన్‌ ఆస్పిరేషన్‌, కామన్‌ డ్రీమ్స్‌’ అనే అయిదు కీలకాంశాలు అవసరమని అనుకున్నారు.

చైనా మౌనానికి వూహాన్లో పునాది

కాశ్మీర్ విషయంలో ఎన్డీయే సర్కారు చాలా తెగువగా నిర్ణయం తీసుకుంది. పోయినేడాది ఏప్రిల్ 27, 28 తేదీల్లో చైనా రిసార్ట్ సిటీ వూహాన్లో   ప్రెసిడెంట్ జిన్పింగ్, ప్రధాని నరేంద్ర మోడీల మధ్య జరిగిన ‘హార్ట్ టు హార్ట్ సమ్మిట్’లోనే దీనికి పునాది పడింది. అందుకే ఈ ఏడాది బడ్జెట్ సెషన్లో ఆర్టికల్–370ని రద్దు చేసినా, ప్రపంచ వేదికలపై పాకిస్థాన్ గొంతు చించుకున్నా చైనా నుంచి ఎలాంటి నెగెటివ్ కామెంట్లు రాలేదు. ఈస్ట్‌ లేక్‌లో గంటసేపు బోటు షికారు చేసినప్పుడు… వారిద్దరూ ఇండో–చైనా సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం ప్రాధాన్యతపైనే చర్చించుకున్నారు. మిలిటెన్సీని ఉమ్మడి శత్రువుగా భావించి, స్ట్రేటజిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్​ని పటిష్టపరచుకోవాలనుకున్నారు. ముఖ్యంగా ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమ్మిట్​కు కొనసాగింపుగానే ఇప్పుడు మహాబలిపురంలో మళ్లీ ఇద్దరు నేతలు కలుసుకున్నారు.

ఇండియన్ సినిమాకి విపరీతంగా ఫాన్స్

హాలీవుడ్ సినిమాలకి చైనాలో మంచి మార్కెట్ ఉంది. ఒకప్పుడు ఇంగ్లిష్ పిక్చర్లంటే పిచ్చెక్కిపోయే చైనీస్ ఇప్పుడు మన బాలీవుడ్ సినిమాలకు అడిక్ట్ అవుతున్నారు. మోడీ పవర్​లోకి వచ్చాక ఈ మోజు బాగా పెరిగింది. చైనా యువత ఆమిర్ ఖాన్​కి ఫిదా అయిపోయింది. అతను  నటించి, నిర్మించిన దంగల్, సీక్రెట్ సూపర్​స్టార్ సినిమాలు చైనా థియేటర్లలో హౌస్​ఫుల్​తో నడిచాయి. దంగల్ సినిమా ఇండియాలో తెచ్చుకున్న కలెక్షన్లకంటే చైనాలో దాదాపు 15 రెట్లు ఎక్కువ కొల్లగొట్టిందట! ఒక అంచనా ప్రకారం ‘దంగల్’ 1,351 కోట్ల రూపాయలు వచ్చాయంటున్నారు. చైనీయులు తమ కల్చర్, కుటుంబ వ్యవహారాలు, సొసైటీ లాంటి విషయాల్లో ఇండియాకి దగ్గరగా ఉండడంతో మన సినిమాల్ని బాగా చూస్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘హిందీ మీడియం’ మూవీలో మంచి స్కూలులో పిల్లల్నిచేర్చడంకోసం తల్లిదండ్రులు పడే పాట్లు తీశారు. సరిగ్గా ఇలాంటివే చైనాలోనూ ఉండేసరికి ఆ సినిమాని తమ మూవీగానే భావించారట!

పోయినేడాది వూహాన్​లో జరిగిన సమ్మిట్​లో ఇండియన్ ఎంటర్​టైన్​మెంట్ మూవీస్​ని చైనాలో పంపిణీ చేయడానికి జిన్​పింగ్, మోడీ నిర్ణయించుకున్నారు, ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమాలే వెళ్తున్నాయి. ఇకపైన రీజనల్ లాంగ్వేజ్ సినిమాలుకూడా చైనాలో రిలీజ్‌ కానున్నాయి.