
7th Pay Commission: ఉగాది పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. యూనియన్ క్యాబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నోరు తీపి చేసే నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో ఉద్యోగులకు చెల్లించే డియర్నెస్ అలవెన్స్ 2 శాతం పెంచుతున్నట్లు నేడు ప్రకటించింది.
తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ గతంలో ఉన్న 53 శాతం నుంచి ప్రస్తుతం 55 శాతానికి పెరుగుతుంది. దీనికి ముందు చివరి సారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ సవరణ జూలై 2024లో జరిగింది. అప్పట్లో కేంద్రం ఉద్యోగుల డీఏను 3 శాతం మేర పెంచి 50 శాతంగా ఉన్న డియర్నెస్ అలవెన్స్ 53 శాతానికి పెంచింది.
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి వీలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీఏ పెంపు ప్రకటన చేస్తూనే ఉంటుంది. దీనివల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలను పాటించటానికి, వారు సంతోషంగా జీవించటానికి వీలు కల్పించటమే దీని లక్ష్యం. వాస్తవానికి దశాబ్ధానికి ఒకసారి ఉద్యోగుల బేసిస్ వేతనాన్ని పెంపు నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను పే కమిషన్ చూసుకుంటుంది. అయితే ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా కేవలం డీఏ మాత్రమే ఎప్పటికప్పుడు సవరించబడుతుంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమలులో ఉండగా.. కొన్ని రోజుల కిందట ప్రధాని మోదీ 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఎంత జీతం పెరుగుతుంది..?
ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం రూ.50 వేలుగా పరిగణిస్తే అందులో గత ఏడీ 53 శాతం రూ.26 వేల 500గా ఉంటుంది. ప్రస్తుతం రెండు శాతం డీఏ పెంచిన తర్వాత 55 శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే డీఏ కింద రూ.27 వేల 500 అవుతుంది. అంటే ఇక్కడ సదరు ఉద్యోగి వేతనం వెయ్యి రూపాయలు పెరిగినట్లు. ఇదే విధంగా వివిధ స్కేల్స్ వేతనాన్ని అందుకుంటున్న ఉద్యోగుల జీతంలో కూడా డీఏ పెంపు ప్రభావం ఉంటుంది.