తిట్లకు ఓట్లు రాలతాయా.?

తిట్లకు ఓట్లు రాలతాయా.?

చనిపోయిన వ్యక్తి ఎంతటి శత్రువు అయినా వాళ్ల గురించి చెడుగా మాట్లాడం. అది కనీస మర్యాద. ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి కనీస మర్యాదలను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.  “ మిస్టర్ క్లీన్ అంటూ  ప్రశంసలు అందుకున్న రాజీవ్​పై ‘భ్రష్టాచారి నెంబర్ వన్ గా ’ ఆయన జీవితం ముగిసిందంటూ మోడీ చేసిన కామెంట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. బోఫోర్స్ కేసుకు సంబంధించి రాజీవ్ గాంధీ అవినీతిపరుడన్న అర్థం వచ్చే రీతిలో మోడీ చేసిన కామెంట్ పై ప్రతిపక్ష నాయకులే కాదు రాజకీయాలకు సంబంధం లేని యూనివర్శిటీ టీచర్లు కూడా మండిపడ్డారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన రెండు వందల మంది టీచర్లు తీవ్ర నిరసన, ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో మరే ఇతర ప్రధాని ఇంతగా దిగజారలేదన్నారు. కేవలం ఎన్నికల్లో లాభం కోసం ఈ ప్రపంచంలో లేని వ్యక్తి పై ఇంతటి దారుణమైన ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.

వ్యూహాత్మకంగానే బోఫోర్స్  కేసు ప్రస్తావన

లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తత పరిస్థితుల్లో 30 ఏళ్ల కిందటి బోఫోర్స్ కేసును ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించడం యధాలాపంగా జరిగింది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల్లో ప్రయోజనం కోసం వ్యూహాత్మకంగా మూడు దశాబ్దాల నాటి బోఫోర్స్ కుంభకోణాన్ని ప్రస్తావించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం నీడలా వెంటాడుతుండటంతో దాని నుంచి తప్పించుకోవడానికే ఒక కవచంలా బోఫోర్స్ అంశాన్ని ఆయన తెరపైకి తీసుకువచ్చారన్న ఆరోపణలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.

2004 లో రాజీవ్ గాంధీ  క్లీన్ చిట్

దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపిన బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణంలో రాజీవ్ గాంధీకి 2004 లో ఢిల్లీ హై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సీబీఐ 16 ఏళ్ల పాటు చేసిన విచారణలో రాజీవ్ కు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క సాక్ష్యం తీసుకురాలేకపోయారని తీర్పు చెప్పిన ఢిల్లీ హై కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు వచ్చేనాటికి కేంద్రంలో అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వాన ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఎన్డీయే సర్కార్ అప్పీల్ కు వెళ్లలేదు. హిందూజా బ్రదర్స్ ను  నిరపరాధులుగా పేర్కొంటూ 2005 లో ఢిల్లీ హై కోర్టు మరో తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పుపై  2018 నవంబరులో సీబీఐ , అప్పీల్ కు దరఖాస్తు చేసుకోగా సుప్రీం కోర్టు నిరాకరించింది. కింది కోర్టు తీర్పు ఇచ్చిన 13 ఏళ్ల తర్వాత అప్పీల్ కు రావడంలో అర్థం లేదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఇవన్నీ తెలియని సంగతులు కావు. అయినప్పటికీ  రాజీవ్ గాంధీని, బోఫోర్స్ స్కాంను తెరమీదకు ప్రధాని మోడీ తీసుకువచ్చారు. ఇదే ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాఫెల్ డీల్ పై ప్రధాని మోడీ డిఫెన్స్ లో పడ్డారన్న విషయం అందరికీ తెలిసిపోయింది.

ఈ ఒప్పందానికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలకు ఎన్డీయే సర్కార్ సరైన సమాధానాలు చెప్పలేకపోయింది. రక్షణ శాఖ ఒప్పందం చేసుకునేటప్పుడు పాటించాల్సిన సంప్రదాయాలు, పద్ధతులు అన్నిటినీ తుంగలో తొక్కారన్న  ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ప్రధానమంత్రి కార్యాలయం ( పీఎంఓ) అనవసరంగా రాఫెల్ ఒప్పందం విషయంలో జోక్యం చేసుకుందన్న విమర్శలు కూడా వచ్చాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల అభ్యంతరాలను పక్కనపెట్టి తన మాటే చెల్లుబాటు అయ్యే విధంగా పీఎంఓ ఒత్తిడి తీసుకువచ్చిందన్న ఆరోపణలు జోరందుకున్నాయి. రాఫెల్ డీల్ పై వచ్చిన అభ్యంతరాలను 2018 డిసెంబర్ లో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఒప్పందం అంతా నిబంధనలకు అనుగుణంగానే ఉందని పేర్కొంది. అయితే  ఒప్పందానికి సంబంధించి కొత్త అంశాలు వెలుగు చూడటంతో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో  కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను పక్కన పెట్టి రివ్యూ పిటీషన్లను  స్వీకరించింది. రివ్యూ పిటీషన్లకు ఆధారమైన డాక్యుమెంట్లు చోరీకి గురైనవని కేంద్రం పేర్కొంది. ఈ డాక్యుమెంట్లను బయటపెట్టడం ‘ అధికారిక రహస్యాల చట్టం ’ ను ఉల్లంఘించడమేనని వాదించింది. అయితే కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాఫెల్ డీల్ కు సంబంధించి  ప్రధానమంత్రి కార్యాలయం అనవసర జోక్యం చేసుకుందన్న విషయాన్ని వెల్లడించే డాక్యుమెంట్లు మీడియా ద్వారా అందరికీ అందాక అవి ‘ ఆఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్‌‌ ’ పరిధిలోకి వస్తాయా రావా అనే ప్రశ్న అప్రస్తుతం అని సుప్రీం కోర్టు కరాఖండీగా చెప్పింది. దీంతో  ఎన్డీయే సర్కార్ లో డిఫెన్స్ లో పడింది. రివ్యూ పిటీషన్ల పై అఫిడవిట్లు దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు కోరింది. నాలుగు వారాల గడువు కోరడం వెనక కూడా మతలబు ఉందన్న విమర్శలు వచ్చాయి.

లోక్ సభ ఎన్నికలు ముగిసేంతవరకు రాఫెల్ డీల్ కు సంబంధించిన రివ్యూ పిటీషన్ల విచారణను పెండింగ్ లో ఉంచడమే ఈ మతలబు అనే వాదన తెరపైకి వచ్చింది. అయితే నాలుగువారాల గడువు ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. నాలుగు రోజుల్లోనే అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అంటే మే నెల ఆరో తేదీవరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. దీంతో గడువులోపలే మే నాలుగున కేంద్రం అఫిడవిట్లు దాఖలు చేసింది. ఈ  అఫిడవిట్లలో  రెండు అంశాలను తెరపైకి తీసుకువచ్చింది కేంద్రం. మొదటి సబ్మిషన్ అంతా ‘ అధికారిక రహస్యాల చట్టం ’ చుట్టూ తిరిగింది. ఇందుకు సంబంధించి పాత వాదననే మరోసారి కేంద్రం  వినిపించింది. ‘ అధికారిక రహస్యాల చట్టం’ ను ఉల్లంఘించి ఏ డాక్యుమెంట్ నైనా బహిరంగం చేయడాన్ని ఆమోదించడం కరెక్ట్ కాదన్న వాదన వినిపించింది. రెండో అంశం ప్రధానమంత్రి కార్యాలయాన్ని విమర్శల నుంచి కాపాడటం. రాఫెల్ డీల్ కు సంబంధించి జరిగిన లావాదేవీలను  ప్రధానమంత్రి కార్యాలయం కేవలం పర్యవేక్షించిందని పేర్కొంది. అనవసర జోక్యం చేసుకుందన్న మాట అవాస్తవమని స్పష్టం చేసింది.

కేంద్రం దాఖలు చేసిన రెండు అఫిడవిట్లను జాగ్రత్తగా పరిశీలిస్తే అన్నీ  ఏ విషయానికి మరో దానితో పొంతన కుదరదు. ఈ నేపథ్యంలోనే  రాఫెల్ డీల్ పై ఇరుకున పడుతున్నామన్న  ఆందోళన కావచ్చు…మరోటి కావచ్చే  మే నాలుగున ఉత్తరప్రదేశ్ లోని ఓ ఎన్నికల ప్రచారం లో మాట్లాడుతూ మూడు దశాబ్దాల నాటి బోఫోర్స్ స్కాంను మరోసారి తెరమీదకు తీసుకువచ్చారు. రాఫెల్ డీల్ కుంభకోణానికి బోఫోర్స్ స్కాంతో  చెక్ పెట్టాలన్నదే ప్రధాన మోడీ వ్యూహమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మోడీ అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ కు ధైర్యం ఉంటే మిగతా రెండు పోలింగ్ దశల్లో  రాజీవ్ పేరు చెప్పి ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగాలన్నారు. ఇలా పెట్రేగిపోవడం వల్ల జరిగే పరిణామాలు ఏంటో తెలియని అమాయకుడు కాదు నరేంద్ర మోడీ. మహా అయితే కాంగ్రెస్ లీడర్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారు. అయితే ఫిర్యాదు ఆధారంగా తన దూకుడుకు ఎన్నికల సంఘం కళ్లెం వేస్తుందని  మోడీ అనుకోరు. ఏమైనా రాఫెల్ డీల్ అక్రమాలను బోఫోర్స్ పేరు చెప్పి కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని మోడీ ప్రయత్నం చేశారన్న విమర్శలు రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.