11 రోజులు మోదీ దీక్ష.. నేలపైనే నిద్ర

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువులు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. నాలుగు గంటల పాటు పూజలు నిర్వహించిన తర్వాత రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ డే సెలవు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

నేలపైనే మోదీ నిద్ర.. 

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో 11 రోజుల దీక్ష చేపట్టిన ప్రధాని మోదీ.. కఠిన నియమాలు పాటిస్తున్నారు. రోజూ నేలపైనే నిద్రిస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం నియమ నిష్ఠలతో 11 రోజుల పాటు పూజలు చేస్తానని మోదీ గత శుక్రవారం ప్రకటించారు.