పారిశ్రామిక రంగంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, రైతాంగం మాదిరే కులమతాలకు అతీతంగా కార్మికవాడల్లో, కాలనీలలో కలిసిమెలిసి ఉంటారు. దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలను కలిసే చేసుకుంటారు. వారిలో ఒక అద్భుతమైన సంతోషం, ఆనందం కనిపిస్తుంది. కష్టనష్టాల్లో ఒకరి భుజం మరొకరు తట్టి ధైర్యంగా కలిసి ముందుకు నడుస్తారు. ఎన్నికలు, విద్వేష రాజకీయాలు వారిని విడదీయలేవు. పారిశ్రామిక రంగంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సుమారు రెండు కోట్లు ఉంటారు. బొగ్గు గనులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి, ఎరువులు, పేపర్ మిల్, సెరామిక్స్ తదితర రంగాలు ఇందులో ప్రధానమైనవి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న పది ఏండ్లలో మోదీ వివక్ష కారణంగా పారిశ్రామికరంగం, ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
ప్రభుత్వ రంగంలో కొత్త రిక్రూట్మెంట్ 3 శాతం దాటలేదు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్‌పరం చేయడం, కార్పొరేట్లకు చౌకబారుగా అమ్మేయడం ద్వారా కేంద్రం ఆరు లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో వేయడానికి సిద్ధమైంది. 35కు పైగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేశారు. ఈ పది ఏండ్ల పీఎం మోదీ కాలంలో ప్రభుత్వ రంగానికి చెందిన ఒక్క సంస్థ కూడా కొత్తగా రాలేదు. ప్రధాని మోదీ పాలనలో చిన్న, చితక పరిశ్రమలు, కొద్దిమందికి ఉపాధి కల్పించిన సంస్థలు మూతపడ్డాయి.
నల్లధనం వెలికితీత ఏమైంది?
నల్లధనం వెలికి తీసే లక్ష్యం పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసి, చిన్న వ్యాపారుల ఉసురు తీశారు. 11,000 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశ పౌరుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున వేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. అలాగే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించారు. కనీసం పది ఏండ్లలో పది లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. దేశంలో బొగ్గు సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గు ధర 2,000 రూపాయలు ఉంటే, ఆస్ట్రేలియాలోని అదాని బొగ్గును టన్ను 18,000 రూపాయలకు కొనుగోలు చేయించారు. గత పది ఏండ్లుగా కోల్ ఇండియా, సింగరేణిలకు బడ్జెట్లో నయా పైసా కేటాయించలేదు. గతంలో ఎలాంటి జాప్యం లేకుండా కేటాయించిన బొగ్గు బ్లాక్‌లను కేంద్రం తెచ్చిన యాక్ట్ ప్రకారం వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది.- తెలంగాణలో గోదావరి తీరంలో సింగరేణి గుర్తించిన బొగ్గు బ్లాక్‌లను మన తెలంగాణ బొగ్గుకు కూడా వేలంలో ఫీజులు చెల్లించి పాల్గొనాల్సిన పరిస్థితి దాపురించింది.---
కార్పొరేట్లకు రుణమాఫీ
బీజేపీ పాలనలో అసమానతలు భారీగా పెరిగిపోయాయి. స్వేచ్ఛ లేదు, నిరసనలు తెలిపే పరిస్థితి లేదు. మనకు బుక్కెడు అన్నం పెడుతున్న రైతన్నకు రుణ మాఫీ లేదు, పంటలకు గిట్టుబాటు ధర లేదు. కానీ, కార్పొరేట్లకు 16 లక్షల కోట్ల రుణమాఫీ ఇచ్చి బ్యాంకులను కుదేలు చేశారు. కులం, మతం, మందిర్, మసీద్, చర్చి అంటూ అధికారం కోసం..ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారు.
ప్రస్తుతం దేశంలోని 96 కోట్ల ఓటర్లలో మెజారిటీగా ఉన్న పారిశ్రామిక రంగంలోని కోట్ల మంది ఓటర్లు, విద్వేష రాజకీయాలను, మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బొగ్గు గని, విద్యుత్, సిమెంట్ రంగంలోని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దేశం అంతా ఇప్పుడు పారిశ్రామిక రంగంలోని కార్మిక కుటుంబాలన్నీ వన్ సైడ్ గా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నాయి. కార్మిక రంగంలోని 44 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చిన బీజేపీ మీద కార్మికులతోపాటు, కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఈ పరిణామం పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. --
- ఎండి. మునీర్,
సీనియర్ జర్నలిస్ట్