
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంచి రాజకీయ యోధుడు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో చాణక్యుడు. ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఆయన దాన్ని నియంత్రించలేనప్పుడు, ప్రధాని మోదీ ఎటువంటి భేషజాలకు పోకుండా ఆ విధానాన్ని ఉపసంహరించుకుంటాడు. అది ఒక రాజకీయ నాయకుడిలో ఉండాల్సిన గొప్ప లక్షణం. ‘వ్యవసాయ చట్టాలు తన ప్రభుత్వానికి హాని కలిగిస్తున్నాయని ప్రధాని మోదీ గుర్తించగానే ఆయన వాటిని ఉపసంహరించుకున్నాడు. ఇది ఆయన రాజకీయ చతురతకు ఒక మంచి ఉదాహరణ. కానీ, మోదీ చాలా మంచి ఫైర్ ఫైటర్ అయినప్పటికీ, రాజకీయ అవాంతరాలను అంచనా వేయడానికి, వాటిని నివారించడానికి మోదీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తన హయాంలో కఠినమైన సమస్యలను పరిష్కరించడానికి ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకునేవారు. ‘మీరు ఒక సమస్యను విస్మరిస్తే, దాని తీవ్రత తగ్గి అది దూరమైపోతుంది’ అని పీవీ నరసింహారావు అన్నారు. ఆయన వ్యూహం చాలాసార్లు ఫలించి సత్ఫలితాలనే ఇచ్చింది. కానీ, ప్రస్తుతం తీవ్రమైన ప్రజాస్వామ్య కాంపిటీషన్లో ఒక భారత ప్రధానమంత్రిగా మోదీ కఠిన సవాళ్లను పరిష్కరించకుండా విస్మరించలేరు.
మోదీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నప్పటికీ, అంటే ప్రజలు ఆయన పాలనను ఆమోదిస్తున్నప్పటికీ, ప్రజా వ్యతిరేక సంఘటనలు, సమస్యలు తీవ్రమైన స్థాయికి చేరుకోవడానికి అవకాశం కూడా ఉంది. సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడే ప్రధానమంత్రి మోదీ లేదా ఆయన సారథ్యంలోని బీజేపీ సమస్యపై స్పందించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసే వ్యవస్థ అమలులో లేదు. బీజేపీ వ్యవస్థాపరంగా చాలా కేంద్రీకృతమై ఉంది. ఎవరూ పాలకుడి వద్దకు వ్యతిరేకత ఉన్న వార్తలను తీసుకెళ్లడానికి ఇష్టపడరు. అగ్ర నాయకత్వం దృష్టికి పాలనాపరమైన వ్యతిరేక వార్తలను తీసుకెళ్లడంలో సంకోచించడం వల్ల సమస్యలు మరింత తీవ్రంగా మారి రాజకీయంగా నష్టాన్ని కలిగిస్తాయి.
ప్రతికూలంగా ఆర్థిక వ్యవస్థ
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవలి వరకు, మోదీ బడ్జెట్లు పూర్తిస్థాయి విశ్వాసంతో నిండి ఉండేవి.
దేశవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలు అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రధాని మోదీ ప్రభుత్వం గత బడ్జెట్‌లో మాత్రమే గుర్తించింది. సమస్య పరిష్కార దిశగా బడ్జెట్లో కొన్ని రాయితీలు ప్రకటించారు. కానీ, కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రాయితీలు చాలా తక్కువ. నిర్ణయం కూడా చాలా ఆలస్యమైంది. ఇప్పుడు తిరోగమన దిశలో పయనిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి సమస్యను పరిష్కరించడానికి, ఇటీవలే భారత చరిత్రలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తి కాంతదాస్ను ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ.
డీలిమిటేషన్ సంక్షోభం
ఇప్పుడు అకస్మాత్తుగా డీలిమిటేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎందుకంటే లోక్‌సభ సీట్ల సంఖ్యను స్తంభింపజేస్తారని, లోక్సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయి తమ ప్రాధాన్యత తగ్గిపోతుందనే భయాలు ఉన్నాయి. వాస్తవానికి డీలిమిటేషన్ రూపంలో వారి భయం నిజమయ్యే అవకాశం కూడా ఉంది. లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయించడానికి జనాభా మాత్రమే ప్రమాణం. అయితే, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడిపోతామని దక్షిణాది రాష్ట్రాలు భయపడుతున్నాయి. 1976లో ఇందిరా గాంధీ..ఒక రాష్ట్రంలో లోక్‌సభ సీట్లను సర్దుబాటు చేసినా ఆ రాష్ట్రంలో పార్లమెంటు స్థానాల సంఖ్యను తగ్గకుండా చేయగలిగారు. కానీ, నరేంద్ర మోదీ లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచితే, జనాభా ప్రాతిపదికన ప్రతి రాష్ట్రానికి ఎంపీల సంఖ్యను నిర్ణయిస్తే, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. ఇక్కడ కూడా, ముందస్తు చర్యలు తీసుకుంటే డీలిమిటేషన్ సమస్య పరిష్కారం అయ్యేది. అయితే, ఇప్పుడు ఊహాగానాలు ఊపందుకున్నాయి. పరిష్కారం ఏదైనా అది మరిన్ని వివాదాలను సృష్టించవచ్చు.
వ్యవసాయ వైఫల్యాలు
భారతదేశం 45% కంటే ఎక్కువగా వ్యవసాయంతో ముడిపడి ఉంది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టినప్పుడు, 7 సంవత్సరాలలోపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పారు. కానీ, మోదీ అధికారంలోకి వచ్చి దశాబ్దానికి పైగా గడిచిపోయినా వ్యవసాయం ఇప్పటికీ నిరాశలో ఉంది. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను పరిష్కరించడానికి మోదీ సర్కారు తగినంత శ్రద్ధ చూపలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిష్కారాలు పాత పరిష్కారాలు మాత్రమే. అవి ఎప్పుడూ సవ్యంగా చేయలేదు. వ్యవసాయరంగం కష్టనష్టాలను ఎదుర్కోవడం ప్రధాని మోదీకి మాత్రమే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పెద్ద వైఫల్యంగా చెప్పవచ్చు.
మౌలిక సదుపాయాలు
మనకు మౌలిక సదుపాయాలు చాలా అవసరం. కానీ, ముంబైలో కార్పొరేట్లను సంతోషంగా ఉంచడానికి మనకు మైండ్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. మౌలిక సదుపాయాలు, సిమెంట్, ఉక్కు, ఇంజనీరింగ్, భారీ యంత్రాలు, మైనింగ్ పరికరాలు మొదలైన వాటిపై డబ్బు ఖర్చు చేసినప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఈ పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థ బాగా పనిచేస్తోందని చెబుతూనే ఉన్నాయి. మోదీ ప్రభుత్వం దానిని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మౌలిక సదుపాయాలపై అనవసరమైన దుబారా ఖర్చును నియంత్రించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం వంటి ఇతర రంగాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు మారాలి. కానీ, ప్రధాని మోదీకి ఎవరు చెబుతారు?
ప్రభుత్వంలో కొత్త రక్తం లేదు
బ్రిటిష్ మాజీ ప్రధాన మంత్రి హెరాల్డ్ మాక్‌మిలన్ 65 సంవత్సరాల క్రితం.. మంచి ప్రధాన మంత్రి మంచి బుర్రగలవాడిగా ఉండాలి అని అన్నారు. ప్రధాన మంత్రి అసమర్థులైన లేదా భారమైన మంత్రులను తొలగించాలని మాక్‌మిలన్ ఉద్దేశ్యం. కానీ, మోదీ ప్రభుత్వంలో దాదాపు 80% మంది మంత్రులు
8 సంవత్సరాలకు పైగా ఉన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలోకి కొత్త రక్తం అవసరం. కానీ, స్పష్టంగా మోదీకి మార్పు ఇష్టం లేదు. ఇది ఆయన ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తోంది, ఎందుకంటే మోదీ ప్రభుత్వంలో చాలా స్తబ్ధత ఉంది.
విఫలం కావడానికి ప్రతిపక్షం అక్కరలేదు
అనేక రంగాలలో, ముఖ్యంగా రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, భద్రత, ఆరోగ్యం మొదలైన వాటిలో ప్రధాని మోదీ గొప్ప విజయాన్ని నమోదు చేశారు. కానీ,
ప్రతిపక్షం ఆయనను ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. దీనికి బదులుగా ప్రతిపక్షం సైద్ధాంతిక సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. దీనిపట్ల ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి ప్రధాని మోదీ బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేదు. మోదీ ఎదుర్కొంటున్న చాలా సమస్యలను ముందుగానే అంచనా వేయగలిగితే వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. పాలనపరంగా ప్రజల అభిప్రాయాలకు మోదీ ప్రాధాన్యమివ్వాలి. మధ్యతరగతి ప్రజల బాధలను మోదీ గమనించినట్లయితే, ఆర్థిక వ్యవస్థను ముందుగానే సరిదిద్దేవారు. ఇప్పుడు మోదీకి ఏం చేయాలో నిజంగా తెలియదు. సమస్యలను పరిష్కరించకుండా పెరగనివ్వడం వల్ల చివరికి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ప్రభుత్వాలు విఫలమవాలంటే, బలమైన ప్రతిపక్షం అవసరం లేదు. ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందితే అది ప్రభుత్వానికి కఠినమైన సవాలుగా మారుతుంది. 2024 పార్లమెంట్ ఎన్నికలలో న్యారో విక్టరీనీ నరేంద్ర మోదీ గుర్తుంచుకోవాలి.
భాషా వివాదం
నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ నూతన విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకించింది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ.. రెండు భాషల సూత్రాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. రెండు వైపుల ప్రయోజనాలు ఏమైనప్పటికీ మోదీ ప్రభుత్వం సంయమనం పాటించి తమిళనాడు ప్రభుత్వంతో గౌరవంగా చర్చలు జరపాలి. బదులుగా మధ్యేమార్గం కనుగొనమని కోరాలి. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చాలా దూకుడుగా వ్యవహరించారు. తమిళనాడు ప్రజలను అవమానించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇది దేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారతదేశం మరింత గొంతు విప్పేలా చేసింది.
- పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్ ఎనలిస్ట్