80 కోట్ల కుటుంబాలకుమూడేండ్లుగా ఫ్రీ రేషన్

మల్యాల, వెలుగు: ‘వన్ నేషన్, వన్ రేషన్’ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మూడేండ్లుగా 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్‌‌‌‌లో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్యాలలో లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. తర్వాత నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ..డిజిటలైజేషన్ ద్వారా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా రేషన్ బియ్యం ప్రజలకు నేరుగా అందజేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఉన్నంతకాలం స్థానిక ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగదని అన్నారు.

రైతులకు రాష్ట్ర సర్కారు సాయం చేస్తలే: బండి సంజయ్

బండి సంజయ్ మాట్లాడుతూ.. 9 ఏండ్ల మోడీ పాలన గురించి ప్రజలకు వివరించడమే మహాజన్ సంపర్క్ అభియాన్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ‘‘అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తామన్న సీఎం కేసీఆర్.. ఒక్క రైతు అకౌంట్లోనూ డబ్బులు వేయలేదు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్.. రుణమాఫీ ఎందుకు చేయడం లేదు? ఇక్కడి రైతులకు ఒక్క రూపాయి ఇవ్వడు కానీ.. పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చి రాష్ట్ర పరువు తీశాడు’’ అని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పోలీసు అధికారులకు టీఏలు, ప్రమోషన్లు, మెడికల్ అలవెన్స్‌‌‌‌లు అందించలేదని విమర్శించారు. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం, కేసీఆర్ కుటుంబం మరో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని, కారు సారు- 60 పర్సంట్ సర్కార్ కేసీఆర్​దని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, సుద్దాల దేవయ్య, నాయకులు పెరుక శ్రవణ్, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

త్వరలో బీజేపీలోకి మాగం రంగారెడ్డి..డీకే అరుణను కలిసిన కాంగ్రెస్ నేత

హైదరాబాద్, వెలుగు : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి సోమవారం భేటీ అయ్యారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రంగారెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు.   ముహూర్తం ఖరారు చేసుకొని పార్టీలో చేరనున్నారు.