మనదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా.. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు మనదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అందుకే ఏటా జనవరి 26ను రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. మనకు ఆత్మ గౌరవాన్ని, మన జాతికి స్వపరిపాలననూ అందించిన రోజు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం.. మన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పాలించుకునే ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని మనకు కలిగించిన రోజది. ఆ రోజు నుంచే దేశాన్ని ఆర్థికంగా, అభివృద్ధి దిశగా ముందుకు నడిపించేందుకు పునాది పడింది.
దేశంలో జరుగుతున్న అభివృద్ధి వెనుక సరికొత్త ఆర్థిక విధానాలు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోగలిగేలా శిక్షణ ఇస్తున్న నూతన జాతీయ విద్యా విధానం, నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, దివ్య భవ్యమైన కాశీ క్షేత్ర అభివృద్ధి, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను అరికట్టడంలో భాగంగా 162 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు నిరాటంకంగా పూర్తి చేసిన గొప్ప ఘనత సాధించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే. అలాగే స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను బలపరచడం వంటి పరిణామాలు 73వ రిపబ్లిక్‌డే వేళ దేశ పురోగతికి నిదర్శనంగా భారతీయులు గుర్తిస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి మూలస్తంభం
ప్రజాస్వామిక పాలనకు, జీవన విధానానికి విశ్వసనీయమైన మార్గదర్శి మన రాజ్యాంగం. అయితే ప్రస్తుతం దేశ పాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలను అనుసరిస్తూ పాలిస్తున్నారనేది నిజం. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగమని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సమకూర్చాలని మన రాజ్యాంగ పీఠిక నిర్దేశించిన విధంగా మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతదేశ ప్రజలమైన మేము.. అనే వాక్యంతో మన రాజ్యాంగం ప్రారంభమవుతుంది. రాజ్యాంగానికి ప్రజలే బలం, స్ఫూర్తి.. ఇంకా లక్ష్యం కూడా. రాజ్యానికి రాజ్యాంగం ఓ రకంగా అస్థిపంజరం లాంటిది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేయడం.. ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయ వ్యవస్థ ప్రజానీకానికి జవాబుదారీ వహించడం కీలకం. వీటికి చట్టబద్ధత కల్పించిందే రాజ్యాంగం. రాజ్యాంగబద్ధత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం.
అంబేద్కర్ అహర్నిశలూ శ్రమించి..
మన రాజ్యాంగం భరతజాతి జీవన వేదం. హక్కులకు చుక్కానిగా.. ప్రజాస్వామ్య కరదీపికగా.. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాలకు ఆయువుగా.. భారతావని ఉజ్వల భవితకు దిక్సూచిగా శోభిల్లుతున్న రాజ్యాంగాన్ని ఆమోదించి 73 వసంతాలు అవుతోంది. మన రాజ్యాంగం దేశ ప్రజల ఐక్యతకు ప్రతీక. కోట్ల మంది భారతీయుల సంక్షేమానికి ఇది పూచీగా నిలుస్తుంది. శ్రేయోరాజ్యం, సమసమాజ స్థాపనకు దోహదపడుతుంది. ఎన్నెన్నో విశిష్ట లక్షణాలు కలిగిన భారత రాజ్యాంగ నిర్మాణం ఆద్యంతం ఆసక్తికరం. దాదాపు మూడేండ్లు పాటు సాగింది. అనేక మతాలు, కులాలు, తెగలు, ఆదివాసీలు, దళితులు, అణగారిన, పీడనకు గురైన వర్గాలున్న మన దేశంలో అందరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించడం పెద్ద సవాల్. దేశ మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డా.బాబా సాహెబ్ అంబేద్కర్ సారథిగా డ్రాఫ్టింగ్ కమిటీని నియమించింది. స్వతంత్ర భారతావనికి దిశానిర్దేశం చేయడానికి అంబేద్కర్ అహర్నిశలు శ్రమించి రాజ్యాంగాన్ని మనకు అందించారు. దేశ భవిష్యత్ రాజ్యాంగంలోనే ఉందని, దానిని సక్రమంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మంచి ఫలితాలు అందించవచ్చనేది అంబేద్కర్ అభిప్రాయం. దేశాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి అంబేద్కర్. ఆయన అసమాన విద్యావంతుడు, రాజనీతి కోవిదుడు. న్యాయశాస్త్ర దిట్ట. గొప్ప ఆర్థికవేత్త, కోట్ల మంది అణగారిన వర్గాల సాధికార కాంక్షకు ప్రతిరూపం. దేశ సార్వభౌమాధిపత్యానికి, సమగ్రతకు, ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి పరితపించారు. ఆయన సారథ్యంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగం మనల్ని ఏడు దశాబ్దాలుగా నడిపిస్తూనే ఉంది.
అందరికీ సమాన హక్కులు కల్పించడమే..
రాజ్యాంగం కేవలం ఒక చట్టపరమైన పత్రం కాదు. సమాజంలో అన్ని వర్గాల హక్కులకు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు భరోసా ఇచ్చే ముఖ్యమైన సాధనం. కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషా విచక్షణలకు ఆస్కారం ఇవ్వకుండా పౌరులందరికీ సమానత్వం ప్రసాదిస్తోంది. తద్వారా ప్రగతి పథంలో మనదేశం వడివడిగా దూసుకెళ్లడానికి పునాది వేసింది. దార్శనికులైన మన రాజ్యాంగ నిర్మాతలకు జాతీయవాదం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది. గడచిన ఏడు దశాబ్దాల్లో మనం ఎన్నో మైలురాళ్లు దాటాం. రాజ్యాంగం ఆరు ప్రాథమిక హక్కులకు భరోసా ఇస్తోంది. అవి - సమానత్వ హక్కు, స్వేచ్ఛా హక్కు, దోపిడీ నుంచి రక్షణ పొందే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్యా, సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిష్కారాలు కోరే హక్కు. ప్రజల మధ్య సాంస్కృతికంగా భేదాలు ఉన్నా అందరికీ సమాన హక్కులు కల్పించడం ద్వారా రాజ్యాంగం దేశ ఐక్యతకు గట్టి పునాది వేసింది. ఈ హక్కుల రక్షణే మన రాజ్యాంగానికి ప్రధాన స్ఫూర్తి.
అంబేద్కర్ భావజాలాన్ని చాటుతున్న మోడీ సర్కార్
మోడీ ప్రభుత్వం 2015లో నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని, భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. సంవిధాన్ గౌరవ్ అభియాన్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 వరకు 12 రోజులు రాజ్యాంగ ప్రాధాన్యతలు, అంబేద్కర్ దూరదృష్టి, ప్రజల హక్కులు, బాధ్యతల గురించి తెలియపరచడమే ప్రధాన అంశంగా కేంద్రం కార్యక్రమాలు నిర్వహించింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 ఏండ్లు పూర్తయిన సందర్భంలో రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు, రాజ్యాంగ సూత్రాలకు, విలువలకు బద్ధులమై శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాల పునాదులపై ఏక్ భారత్, శ్రేష్ట భారత్ నిర్మాణానికి నిబద్ధతతో నడుం బిగించాలి. నిజం చెప్పాలంటే నేడు భారత పౌరులు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను అనుభవించడం కన్నా ప్రాథమిక విధులను నెరవేర్చేందుకే అధిక ప్రాధాన్యమివ్వాలి.
డా. కె.లక్ష్మ ణ్, జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా