మోదీ సర్కార్ హెడ్​లైన్​ రాజకీయాలు!

మోదీ సర్కార్ హెడ్​లైన్​ రాజకీయాలు!

పీఎం నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర బీజేపీ సర్కార్ గత పది ఏండ్ల పాలనలో హెడ్ లైన్  రాజకీయం చాలా బాగా చేయడం నేర్చుకున్నది.  మొన్నటి  పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకుని వచ్చింది.  కొన్ని రోజులు మీడియాకు ఇదే హెడ్ లైన్  అయిపోయింది. 2029 వరకు కూడా అమలుకు సాధ్యంకాని బిల్లు తెచ్చి అహో ఓహో అనిపించుకున్నారు. ‘చార్  సౌ పార్' అన్నారు.  ఇది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.   మూడోసారి గెలిస్తే వంద రోజులలో మంచి ప్రణాళికను అమలు చేస్తామని, మొత్తం సిద్ధం అయిపోయిందని ప్రకటించారు.  అయితే,  మొదటి వంద రోజుల్లోనే ఆ యాక్షన్ ప్లాన్ అంతా తుస్సుమన్నది.  తన పుట్టుక బయాలాజికల్ కాదని, తనతో ఈశ్వరుడు మాట్లాడుతాడని చెప్పుకున్నారు పీఎం మోదీ.  కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళ సూత్రాలు లాక్కెళ్లుతారు అని చెప్పారు.  నిరుద్యోగం, అధిక ధరలు, అసమానతలు, పెరుగుతున్న మహిళల మీద దాష్టీకాలపై ఏమీ మాట్లాడలేదు. 16 నెలలుగా  మండిపోతున్న మణిపూర్ వైపు తొంగి చూడలేదు.-- ప్రధాని మోదీ  మాటలు,  హామీలు మొత్తంగా అన్నీ అబద్ధాలే అని తేలిపోయింది.  కొంతకాలం ఆయన మాటలు, హామీలు హెడ్ లైన్ న్యూస్ అయ్యాయి తప్ప  గతంలో ఇచ్చిన హామీలైన నల్లధనం వెలికితీత, 15 లక్షల రూపాయలు పౌరుల ఖాతాలో జమ చేయడం,  ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు,  రైతుల ఆదాయం డబుల్ చేయడంలాంటివి నమ్మకుండా అయిపోయాయి.  రైతు రుణమాఫీ లేదు. అదానిలాంటి  కార్పొరేట్​లకు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు.  అదానిపై, సెబీ చీఫ్ మాధవి బుచ్ మీద వచ్చిన ఆరోపణల మీద విచారణలు లేవు.  వెరసి పీఎం మోదీ గ్రాఫ్​ పడిపోయింది.

మోదీ గ్రాఫ్​ తగ్గింది, రాహుల్ గ్రాఫ్ పెరిగింది

 ఒక సామాన్యునిలాగా దేశం చుట్టిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దేశ ప్రజలకు నమ్మకం పెరిగింది. ఈ పరిస్థితుల్లో 400 స్థానాల పీఎం మోదీ నినాదం ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ స్థానాలకు బీజేపీ దూరమైంది.  టీడీపీ, యునైటెడ్ జనతాదళ్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. జమిలి ఎన్నికల కమిటీ నివేదిక రాగానే  పీఎం మోదీ మళ్ళీ హెడ్ లైన్ లోకి వచ్చారు. 

మీడియాకు డిబేట్​ కావాలి

పీఎం మోదీ ఇప్పుడు హెడ్​లైన్​లో ఉండాలి.  మీడియాకు డిబేట్ కావాలి. అందుకే ఈ జమిలి హడావుడి.  దేశంలోని నిరుద్యోగం, అధిక ధరలు, వైద్యం, విద్య, పేదరికం, రైతుల ఎమ్మెస్పీ, సమస్యలపై  డిబేట్లు లేవు.  జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలపై ప్రకటన చేసి, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తేదీలను ప్రకటించలేదు. ఈ ఎన్నికలు ఒకేసారి చేయలేనివారు.. జమిలి ఎన్నికలు అంటున్నారు. ఎన్నికల వ్యయం తగ్గుతుందని,  ప్రతి సంవత్సరం ఎన్నికలు  ఉండడం వల్ల కేంద్రం సమస్యల మీద దృష్టి పెట్టలేని పరిస్థితి ఉందంటున్నారు. 

అన్నీ తానే..

రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బీజేపీలో ప్రధాని మోదీ వెళ్లినంతగా ఎవరూ వెళ్ళలేదు. బీజేపీకి రాష్ట్రాల్లో జనం వద్దకు వెళ్లే ముఖమే లేనట్లు మోదీనే ఎక్కువగా వెళుతుంటారు.  గడ్కరి, రాజ్​నాథ్ సింగ్, వసుంధర రాజే,  శివరాజ్ సింగ్ చౌహన్ లాంటి వారిని కార్నర్ చేసి అన్నీ తానే అన్నట్లు మోదీ కనిపిస్తున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ తోనే పీఎంకు ఇబ్బంది అనేవారు కూడా ఉన్నారు.--  ఏ ప్రాజెక్ట్ శంకుస్థాపన అయినా, ప్రారంభోత్సవం అయినా, సభ అయినా, సమావేశం అయినా ఆయనే హెడ్ లైన్ అవుతున్నారు. ఇప్పుడు జమిలి ఎన్నికల ప్రస్తావన, మాజీ రాష్ట్రపతి కోవింద్ రిపోర్ట్ కూడా అంతే.  దేశానికి ఏది ప్రయోజనం, ఏది నిష్ప్రయోజనం అనేది అవసరం లేదు.  మోదీ జీ మన్​కి బాత్ మాదిరే, ఆయన మనస్సులో  ఏది తడితే అదే కరెక్ట్ అనే పరిస్థితి ఉన్నది.  ఏది ఏమైనా జమిలి ఎన్నికల ఆలోచన వల్ల  ప్రస్తుతం అంత ప్రయోజనం ఉండదు అనే అభిప్రాయమే ఎక్కువగా ఉన్నది.  ఖర్చులు తగ్గడం, అభివృద్ధి,  సంక్షేమంపైన అధిక దృష్టి అనేవి కేవలం సాకు మాత్రమే.  ఈ హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు బీజేపీ, ముఖ్యంగా మోదీజీ  ఆరాటపడే పరిస్థితి ఎందుకు వచ్చిందో జగమెరిగిన సత్యం!

జమిలితో ప్రయోజనం ఉండదు

1952 –1967 కాలంలో  జమిలి ఎన్నికలు జరిగాయి.  ఇప్పుడు ఈ రిపోర్ట్  అంతా గందరగోళంగా ఉన్నది.  జమిలి ఎన్నికలు జరిగిన వందరోజుల్లో స్థానిక ఎన్నికలు జరపవచ్చు అనేది రిపోర్ట్ చెబుతున్నది.  రాష్ట్రాలతోపాటు కేంద్రం ఎన్నికలు ఒకేసారి జరుపుతారు. మధ్యలో  ఏ ప్రభుత్వమైనా పడిపోతే,  ఎన్నికల అవసరంవస్తే ఆ ఎన్నికలు జరుపుతారు.  దేశంలోని సుమారు 17 రాష్ట్రాల ప్రభుత్వాల కాలం ఇక్కడ ఎక్కువ ఉన్నా, రద్దు చేసే పరిస్థితి ఉంటుంది.  2029 నాటికి ఐదు ఏండ్ల కోసం ఎన్నుకున్న 17 రాష్ట్రాల ప్రభుత్వాలను  మూడేండ్లకే రద్దు చేసి పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఎన్నికలు జరపాలి.  ఈ లెక్క ఎట్ల వర్క్ అవుట్ అవుతుంది? పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడితే ఎలా?  ఇలాంటివి ఎన్నో గందరగోళం పరిస్థితులు ఉన్న ఈ జమిలి ఎన్నికలకు కాంగ్రెస్, ఇండియా కూటమిలోని దాదాపు అన్ని పార్టీలు తమ అంగీకారం తెలుపలేదు.


- ఎండి. మునీర్,