ఇక ఆధార్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు.. గేమ్ ఛేజింగ్ యాప్ లాంఛ్ చేసిన కేంద్రం

ఇక ఆధార్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు.. గేమ్ ఛేజింగ్ యాప్ లాంఛ్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో అవసరం. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న, విద్యా, ఉద్యోగం ఇలా ప్రతిచోట్ల ఆధార్ కార్డ్ మస్ట్. ఇంతా అవసరమైన ఆధార్ కార్డ్‎ను మనం ఏదైనా పని మీద వెళ్లినప్పుడు మర్చిపోతే కష్టం. కాబట్టి ఎప్పుడూ ఆధార్ కార్డును జేబులో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుతోన్న డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆధార్ కార్డ్ సేవలనూ కూడా మరింత సులభతరం చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఆధార్ యాప్‎ను తీసుకొచ్చింది. 

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆధార్ యాప్‎ను లాంఛ్ చేశారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సహకారంతో రూపొందించబడిన ఈ యాప్‎లో QR కోడ్ ఆధారిత ధృవీకరణ, రియల్-టైమ్ ఫేస్ ID ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్ ఉపయోగించే వారు ఆధార్ కార్డు భౌతిక, ఫోటో కాపీలు ఇక వెంట తీసుకెళ్లడం అవసరం లేదు. ఆధార్ ధ్రువీకరణ అవసరమయ్యే చోట ఒక క్యూఆర్‌ కోడ్‌ ప్రదర్శించబడుతుంది. దాన్ని యూజర్‌ తన ఫోన్‎లోని ఆధార్‌ యాప్‌ ఉపయోగించి స్కాన్‌ చేస్తే వెంటనే ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతోంది. 

ఉదాహరణకు.. మనం ఇదేనా హోటల్‏కు వెళ్తే చెక్ ఇన్ సమయంలో వ్యక్తిగత వివరాల దృవీకరణ కోసం హోటల్ సిబ్బంది ఆధార్ కార్డు అడుగుతారు. అప్పుడు మనం ఫిజికల్ కాపీ లేదా ఫొటో కాపీ వారికి అందజేస్తాం. కానీ ఈ యాప్ ద్వారా హోటల్ సిబ్బంది దగ్గరున్న క్యూఆర్ కోడ్‎ను స్కాన్ చేస్తే మన డేటా క్షణాల్లో వారికి వెళ్లిపోతుంది. సో.. ఆధార్ కార్డు ఫిజికల్ కాపీ లేదా ఫొటో కాపీ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. మనం ఇక జేబులో ఆధార్ కార్డ్, ఫోన్లో ఫొటో కాపీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 

మన ఫోన్లోని ఆధార్ యాప్ నుంచి స్కాన్ చేస్తే మన డేటా మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వారికి వెళ్లిపోతుంది. అచ్చం UPI చెల్లింపు చేసే మాదిరిగానే అన్నమాట. ఈ యాప్ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఇది అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ఆధార్ ధృవీకరణను UPI చెల్లింపుల మాదిరిగా సులభతరం చేయడంతో పాటు యూజర్లకు ఎలాంటి ఆటంకాలు లేని డిజిటల్ ఐడెంటికేషన్‌ను సులభతరం చేస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.