వయనాడ్ (కేరళ): రాహుల్ గాంధీ సత్యం కోసం పోరాడుతున్నారని వయనాడ్ ప్రజలకు మాత్రమే అర్థమైందని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల హక్కులు.. రాజ్యాంగాన్ని రక్షించేందుకు కేంద్రంతో యుద్ధం చేస్తున్నాడని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మనంతవడిలో ఆమె మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. కేవలం కొంత మంది సంపన్నుల కోసమే పని చేస్తున్నది. మంచి వైద్యం, మెరుగైన జీవన విధానం, యువతకు ఉద్యోగాలు కల్పించడం మోదీ లక్ష్యాలు కావు.
అధికారంలో ఉండాలనేది మాత్రమే ఆయనకు తెలుసు. మనల్ని కులం, మతం ప్రాతిపదికన వేరు చేస్తున్నారు. ద్వేషం, హింసను వ్యాప్తి చేయడమే మోదీ ఎజెండా. మీ నుంచి భూములు, పోర్టులు గుంజుకుని ఫ్రెండ్స్‌కు ఇచ్చుకుంటున్నడు’’ అని ప్రియాంక విమర్శించారు. తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తానని తెలిపారు.
వయనాడ్ ప్రజలకు ధైర్యం ఎక్కువ
ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు, కొండ ప్రాంతాల్లోని గిరిజనుల సాగు ఇబ్బందులు పరిష్కరిస్తానని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఉపాధిహామీని పక్కాగా అమలుకు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్లమెంట్‌తో పాటు అన్ని చోట్ల వయనాడ్ వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.
నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ‘‘వయనాడ్ ప్రజలకు పోరాడే ధైర్యం ఎక్కువ. అణచివేతదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఏ మతానికి చెందిన వారైనా అందరూ కలిసి జీవిస్తారు’’ అని ప్రియాంక కొనియాడారు.