
- రాజ్‌నాథ్‌కు రక్షణ..అమిత్ షాకు హోం
- నిర్మలకు ఫైనాన్స్.. గడ్కరీకి రోడ్డు రవాణా
- 12 మందికి పాత పోర్ట్ఫోలియోలే71 మంది మంత్రులకు శాఖలను కేటాయించిన మోదీ
- మిత్రపక్షాలకు బ్యాలెన్సింగ్‌గా పోర్ట్‌ఫోలియోలు
- 30 మంది కేబినెట్.. ఐదుగురు ఇండిపెండెంట్.. 36 మంది సహాయ మంత్రులు
- నడ్డాకు హెల్త్.. శివరాజ్‌కు వ్యవసాయం.. ఖట్టర్‌కు విద్యుత్
- రైల్వే, ఐ అండ్ బీ అశ్వినీ వైష్ణవ్.. విద్యా శాఖ ధర్మేంద్ర ప్రధాన్‌కు
- పార్లమెంట్ వ్యవహారాలు కిరణ్ రిజిజుకు అప్పగింత
న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీయే సంకీర్ణ సర్కారులో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. కీలక పోర్ట్‌ఫోలియోలు బీజేపీకే దక్కాయి. మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, జేడీఎస్, శివసేన (షిండే) పార్టీలకు బ్యాలెన్సింగ్‌గా వివిధ శాఖలను మోదీ కేటాయించారు. రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా మొత్తం 12 మందికి గత సర్కారులో నిర్వర్తించిన శాఖలనే మళ్లీ అప్పగించారు. రాజ్‌నాథ్‌కు రక్షణ.. అమిత్‌షాకు హోం.. నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖను తిరిగి కేటాయించారు.
ఆదివారం ప్రధానిగా నరేంద్రమోదీతోపాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఇందులో 30 మంది కేబినెట్ మంత్రులు.. ఐదుగురు ఇండిపెండెంట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్.. పలు అంశాలపై చర్చించింది. అనంతరం మంత్రులకు శాఖలను మోదీ కేటాయించారు.
తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం ఐదుగురికి మంత్రి పదవులు దక్కగా.. రామ్మోహన్నాయుడు(ఏపీ–టీడీపీ)కి సివిల్ ఏవియేషన్, పెమ్మసాని చంద్రశేఖర్(ఏపీ–టీడీపీ)కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్(సహాయ), భూపతిరాజు శ్రీనివాసవర్మ (ఏపీ– బీజేపీ)కు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ) పోర్టుఫోలియోలు లభించాయి.
నడ్డాకు ఫస్ట్ టర్మ్‌లోని శాఖే
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మళ్లీ ప్రభుత్వంలోకి మోదీ తీసుకున్నారు. ఆయనకు ఆరోగ్య శాఖతోపాటు ఫ్యామిలీ వెల్ఫేర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖలు కేటాయించారు. గతంలో(మోదీ ఫస్ట్ టర్మ్ పాలనలో) కూడా నడ్డా ఆరోగ్య శాఖను చేపట్టారు. మళ్లీ సర్కారులోకి ఆయనను తీసుకోవడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తారన్న చర్చ జరుగుతున్నది. మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. హర్యానా సీఎంగా పనిచేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌కు హౌసింగ్, అర్బన్, విద్యుత్ శాఖలను కేటాయిం చారు.
పీయూష్ గోయల్‌కు కామర్స్, ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖలు దక్కాయి. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎడ్యుకేషన్, కిరణ్ రిజిజుకు పార్లమెంట్, మైనార్టీ వ్యవహారాల శాఖలను అప్పగించారు. రైల్వేతోపాటు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ శాఖలు అశ్విని వైష్ణవ్‌కు దక్కాయి. గత సర్కారులో కూడా ఈయన రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. జలశక్తి శాఖ సీఆర్ పాటిల్‌కు, కార్మిక శాఖ మాండవీయాకు దక్కాయి. గత సర్కారులో జలశక్తి శాఖను చూసిన గజేంద్రసింగ్ షెకావత్‌కు ఈ సారి టూరిజం, కల్చరల్ శాఖలు లభించాయి. కేరళ నుంచి గెలిచిన బీజేపీ ఏకైక ఎంపీ, సినీ నటుడు సురేశ్ గోపీకి టూరిజం, కల్చరల్ సహాయ మంత్రిగా అవకాశం దొరికింది.
12 మందికి మారలే
తాజా కేబినెట్ లో మొత్తం 12 మంది మంత్రుల శాఖల్లో మార్పులు జరగలేదు. వీరిలో రాజ్‌నాథ్ సింగ్ (రక్షణ శాఖ), అమిత్ షా(హోం), జైశంకర్(విదేశీ వ్యవహారాలు), నిర్మల (ఆర్థిక), గడ్కరీ (రోడ్లు), పీయూష్ గోయల్ (వాణిజ్యం), ధర్మేంద్ర ప్రధాన్ (ఎడ్యుకేషన్), భూపేంద్ర యాదవ్ (అటవీశాఖ, పర్యావరణం), జ్యుయల్ ఓరం (గిరిజన శాఖ), సర్బానంద సోనోవాల్ (షిప్పింగ్, పోర్ట్స్, వాటర్ వేస్), అర్జున్ రామ్ మేఘ్వాల్(న్యాయశాఖ) ఉన్నారు. అశ్వినీ వైష్ణవ్‌కు రైల్వే శాఖతో పాటు కొత్తగా సమాచార ప్రసారాల శాఖను మోదీ కేటాయించారు.
మిత్రపక్షాలకు ఆచితూచి
మిత్రపక్షాలకు నరేంద్రమోదీ ఆచితూచి శాఖలను కేటాయించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని ఇచ్చారు. గతంలో(మోదీ ఫస్ట్ టర్మ్ పాలనలో) కూడా టీడీపీకి ఇదే శాఖ లభించింది. అప్పట్లో అశోకగజపతిరాజు సివిల్ ఏవియేషన్ మంత్రిగా పనిచేశారు. టీడీపీ మరో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు ప్రస్తుత సర్కారులో గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్(సహాయ) మంత్రి పదవి దక్కింది. జేడీయూ తరఫున లలన్‌సింగ్ (రాజీవ్ రంజన్‌సింగ్)కు పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖలను అప్పగించారు.
జేడీఎస్తరఫున హెచ్డీ కుమార స్వామికి భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖలను కేటాయించారు. ఎల్జేపీ తరఫున చిరాగ్ పాశ్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్మంత్రిత్వశాఖ దక్కింది. అప్నాదళ్ తరఫున అనుప్రియా పటేల్‌కు హెల్త్, ఫ్యామిలీ వెల్పేర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సహాయ మంత్రిగా అవకాశం లభించింది. శివసేన (షిండే) తరఫున ప్రతాప్‌రావ్ గణపతిరావ్ జాదవ్‌కు ఆయుష్ (ఇండిపెండెంట్) మంత్రిత్వ శాఖ దక్కింది.
ఏ మంత్రిత్వ శాఖలు ఎవరెవరికి..నరేంద్ర మోదీ ప్రధానమంత్రి, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, స్పేస్‌తో పాటు ఎవరికీ కేటాయించని ఇతర పోర్ట్‌ఫోలియోలు
కేబినెట్ మంత్రులు
క్ర.సం. పేరు మంత్రిత్వ శాఖలు
1. రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ
2. అమిత్‌షా హోం, సహకార
3. నిర్మలా సీతారామన్ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
4. జైశంకర్ విదేశీ వ్యవహారాలు
5. నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా, జాతీయ రహదారులు
6. జేపీ నడ్డా హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్
7. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి
8. మనోహర్ లాల్ ఖట్టర్ హౌసింగ్, పట్టణ వ్యవహారాలు, విద్యుత్
9. హెచ్డీ కుమారస్వామి భారీ పరిశ్రమలు, స్టీల్
10. పీయూష్ గోయల్ వాణిజ్యం, పరిశ్రమలు
11. ధర్మేంద్ర ప్రధాన్ విద్య
12. జితన్ రామ్ మాంఝీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ)
13. లలన్ (రాజీవ్ రంజన్) సింగ్ పంచాయతీ రాజ్, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమలు
14. సర్బానంద సోనోవాల్ పోర్ట్స్, షిప్పింగ్, జలమార్గాలు
15. వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం, సాధికారత
16. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ
17. ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, న్యూ అండ్ రినెవబుల్ ఎనర్జీ
18. జువల్ ఓరం గిరిజన వ్యవహారాలు
19. గిరిరాజ్ సింగ్ జౌళీ
20. అశ్విని వైష్ణవ్ రైల్వే, సమాచార - ప్రసార, ఎలక్ట్రానిక్స్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
21. జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
22. భూపేందర్ యాదవ్ పర్యావరణం, అటవీ, వాతావరణం
23. గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతిక, పర్యాటకం
24. అన్నపూర్ణా దేవి మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
25. కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు
26. హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం, సహజ వాయువు
27. మన్సుఖ్ మాండవియా కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడలు
28. జి. కిషన్ రెడ్డి బొగ్గు, గనులు
29. చిరాగ్ పాశ్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
30. సీఆర్ పాటిల్ జలశక్తి
ఇండిపెండెంట్ (సహాయ మంత్రులు)
31. రావు ఇందర్‌జిత్‌సింగ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ప్లానింగ్, సాంస్కృతికం
32 . జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్, ప్రైమినిస్టర్ ఆఫీస్, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్
33. అర్జున్ రామ్ మేఘ్వాల్ లా అండ్ జస్టిస్, పార్లమెంటరీ వ్యవహారాలు
34. జాదవ్ ప్రతాప్ రావ్ ఆయూష్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
35. జయంత్ చౌధరీ స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్, ఎడ్యుకేషన్ సహాయ మంత్రులు
36. జితిన్ ప్రసాద వాణిజ్యం, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
37. శ్రీపాద యశోనాయక్ విద్యుత్, న్యూ అండ్ రినెవబుల్ ఎనర్జీ
38. పంకజ్ చౌధరీ ఆర్థిక
39. కృష్ణన్పాల్ సహకారం
40. రాందాస్ అథవాలే సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్
41. రామ్‌నాథ్ ఠాకూర్ వ్యవసాయం, రైతుల సంక్షేమం
42. నిత్యానంద్ రాయ్ హోం
43. అనుప్రియా పటేల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్
44. వి.సోమన్న జల్ శక్తి, రైల్వేస్
45. పెమ్మసాని చంద్రశేఖర్ రూరల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్స్
46. ఎస్పీ సింగ్ బఘేల్ పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ
47. శోభ కరంద్లాజే ఎంఎస్ఎంఈ, కార్మిక, ఉపాధి
48. కీర్తివర్దన్ సింగ్ పర్యావరణం, అటవి, వాతావరణం, విదేశాంగ
49. బీఎల్ వర్మ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషఖన్, సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్
50. శాంతను ఠాకూర్ పోర్ట్స్, షిపింగ్స్, జలమార్గాలు
51. సురేశ్ గోపి పెట్రోలియం, సహజవాయువు, టూరిజం
52. ఎల్.మురుగన్ ఐ అండ్ బీ, పార్లమెంటరీ వ్యవహారాలు
53. అజయ్ టమ్టా రోడ్డు రవాణా, హైవేస్
54. బండి సంజయ్ కుమార్ హోం
55. కమ్లేశ్ పాశ్వాన్ రూరల్ డెవలప్మెంట్
56. భగీరథ్ చౌధరి వ్యవసాయం, రైతుల సంక్షేమం
57. సతీశ్ చంద్ర దుబే బొగ్గు, గనులు
58. సంజయ్ సేత్ రక్షణ
59. రవ్నీత్ సింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, రైల్వేస్
60. దుర్గాదాస్ ఉయికీ గిరిజన వ్యవహారాలు
61. రక్ష నిఖిల్ ఖాడ్సే యువజన వ్యవహారాలు, స్పోర్ట్స్
62. సుకాంత మజుమ్దార్ విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
63. సావిత్రి ఠాకూర్ మహిళ, శిశు సంక్షేమాభివృద్ధి
64. టోఖన్ సాహూ హౌసింగ్, అర్బన్ అఫైర్స్
65. రాజ్‌భూషన్ చౌధరి జలశక్తి
66. భూపతిరాజు శ్రీనివాసవర్మ భారీ పరిశ్రమలు, స్టీల్
67. హర్ష మల్హోత్రా కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, హైవేస్
68. జయంతిభాయ్ బంభానియా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ
69. మురళీధర్ మోహోల్ సహకారం, సివిల్ ఏవియేషన్
70. జార్జ్ కురియన్ మైనార్టీ వ్యవహారాలు, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ
71. పబిత్రా మార్గరీట విదేశీ వ్యవహారాలు, టెక్స్టైల్స్