త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం.. గంగా మాతకు సారె, ప్రత్యేక పూజలు

త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం.. గంగా మాతకు సారె, ప్రత్యేక పూజలు
  • మెడలో రుద్రాక్ష మాలతో సూర్య భగవానుడికి జల సమర్పణ
  • గంటన్నరలో పర్యటన ముగించుకుని ఢిల్లీకి రిటర్న్

మహాకుంభనగర్ (యూపీ):  ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న మహా కుంభ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పుణ్య స్నానమాచరించారు. మెడలో రుద్రాక్షమాల ధరించి.. హర్.. హర్.. గంగే అంటూ త్రివేణి సంగమంలో స్నానం చేశారు. ఆ తర్వాత గంగా మాత, సూర్య భగవానుడికి జలాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 10.30 గంటలకు మోదీ ప్రయాగ్​రాజ్ ఏయిర్​పోర్టుకు చేరుకున్నారు. 

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు, బీజేపీ నేతలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఎయిర్​పోర్టు నుంచి కారులో 3 కిలో మీటర్లు ప్రయాణించి హెలీప్యాడ్ వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఆరైల్ ఘాట్​కు చేరుకున్నారు. ఆ తర్వాత బోటులో త్రివేణి సంగమానికి వెళ్లారు. సూర్యుడిని స్మరిస్తూ రుద్రాక్షలతో జపం చేసి 11.15 గంటలకు పుణ్య స్నానమాచరించారు. 

తర్వాత గంగా నదికి పాలు, పూలు, సారె, నీటిని సమర్పించి హారతి ఇచ్చారు. అనంతరం ఘాట్ల వద్ద నిల్చున్న భక్తులకు మోదీ- అభివాదం చేశారు. ఆయన వెంట సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. తర్వాత మళ్లీ బోటులో అరైల్ ఘాట్​కు.. అక్కడి నుంచి హెలికాప్టర్​లో హెలిప్యాడ్​కు.. ఆ తర్వాత కారులో ప్రయాగ్​రాజ్ ఎయిర్​పోర్టుకు చేరుకుని ఢిల్లీ బయల్దేరి వెళ్లిపోయారు. 90 నిమిషాల్లో మోదీ పర్యటన ముగిసింది. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

పుణ్య స్నానం.. గొప్ప అవకాశం: మోదీ

మహా కుంభమేళాను సందర్శించడం తనకు లభించిన ఆశీర్వాదమని పర్యటన అనంతరం మోదీ ట్వీట్​ చేశారు. త్రివేణి సంగమంలో స్నానం చేసిన క్షణం.. దైవ అనుభూతిని కలిగించిందని తెలిపారు. సంగమంలో పాల్గొన్న కోట్లాది మంది మాదిరిగానే.. తనకు భక్తి స్ఫూర్తి కలిగిందన్నారు. అందరికీ శాంతి, జ్ఞానం, మంచి ఆరోగ్యం, సామరస్యాన్ని గంగామాత అనుగ్రహించాలని ఆకాంక్షించినట్లు తెలిపారు

కుంభ మేళాకు సైనా, కిరణ్ రిజిజు ఫ్యామిలీ

బుధవారం ఇండియన్ షట్లర్ సైనా నెహ్వాల్.. తన ఫ్యామిలీతో కలిసి పుణ్యస్నానం చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫ్యామిలీతో కలిసి షాహీ స్నాన్ చేశారు. కాగా, ఇప్పటి దాకా సుమారు 41 కోట్ల మంది పుణ్య స్నానం చేశారని నిర్వాహకులు తెలిపారు.