తెలంగాణకు మోదీ పెద్దన్నలాగా ఉన్నారు : సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీ రాకను నాలుగు కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంభందాలు కలిగి ఉండాలని తెలిపారు. ఘర్షణ వాతావరణం వస్తే ప్రజలకు మంచిది కాదని చెప్పారు. అదిలాబాద్ లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ట్రానికి మోదీ పెద్దన్నలాగా ఉన్నారని అన్నారు.

 రాష్ట్ర అభివృద్ధికి రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి. తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం మరింత కావాలని కోరారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణ తీసుకున్నామని అందుకు సహకరించాలని కోరారు. ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. 

"మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి స్వాగతం.. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్‌ ఉత్పత్తిలో వెనకబడ్డాం.. విభజన చట్టంలో 4 వేల మెగావాట్లకు బదులు 1600 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే సాధించాం.. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కేంద్రం సహకరించాలి" అని రేవంత్ రెడ్డి అన్నారు.