త్వరలో మోదీ రిటైర్​కాబోతున్నారు! శివసేన లీడర్​ సంజయ్​ రౌత్​ సంచలన వ్యాఖ్యలు

త్వరలో మోదీ రిటైర్​కాబోతున్నారు! శివసేన లీడర్​ సంజయ్​ రౌత్​ సంచలన వ్యాఖ్యలు

ఆర్ఎస్ఎస్​ ఆఫీస్ ​విజిట్​కు కారణం అదే అయ్యుండొచ్చు
శివసేన లీడర్​ సంజయ్​ రౌత్​ సంచలన వ్యాఖ్యలు
2029లోనూ మోదీనే ప్రధాని..మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

ముంబై: ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 11 ఏండ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్​రౌత్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేండ్లలో ఎన్నడూ ఆర్ఎస్ఎస్​ కార్యాలయానికి మోదీ వెళ్లలేదని, ఇప్పుడు రావడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండొచ్చని అన్నారు. సెప్టెంబర్​లో ఆయన పదవీ విరమణ చేయాలని భావిస్తున్నారని,  తన రిటైర్​మెంట్ ​ప్రణాళికల గురించి ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ చీఫ్‌‌ మోహన్‌‌ భగవత్​తో చర్చలు జరిపేందుకే వచ్చి ఉంటారని అభిప్రాయపడ్డారు. 

దేశంలో ఆర్ఎస్ఎస్​ మార్పును కోరుకుంటున్నదని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. ‘‘తదుపరి బీజేపీ చీఫ్​ను ఎన్నుకోవాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నది. ఆ సంస్థ నిబంధనల ప్రకారం మోదీ కూడా రాజకీయాలకు రిటైర్​మెంట్​ ప్రకటించాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన మోహన్​భగవత్​ను కలిసి రిటైర్​మెంట్​ పత్రాన్ని ఇచ్చేందుకు వెళ్లి ఉంటారు.  అయితే, మోదీ వారసుడు మహారాష్ట్ర నుంచే వస్తారని నేను అనుకుంటున్నా” అని రౌత్​ వ్యాఖ్యానించారు.

2029లోనూ మోదీనే ప్రధాని: దేవేంద్ర ఫడ్నవీస్​

మోదీ రిటైర్​మెంట్​పై సంజయ్ రౌత్​ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ కొట్టిపడేశారు. 2029లోనూ మోదీనే దేశ ప్రధానిగా ఉంటారని చెప్పారు. సమర్థవంతమైన నాయకుడు తమను నడిపిస్తున్నప్పుడు  వారసుడి కోసం వెదకాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘ఆయన (మోదీ) మా నాయకుడు. ఆయనే ప్రధానిగా కొనసాగుతారు. మన సంస్కృతిలో తండ్రి జీవించి ఉన్నప్పుడు వారసత్వం గురించి మాట్లాడడం తగదు. అది మొఘల్​ కల్చర్. దాని గురించి చర్చించేందుకు ఇప్పడు ఇంకా సమయం రాలేదు. మోదీ నాయకత్వంలో మేం చాలా ఏండ్లు కలిసి పనిచేస్తాం” అని తెలిపారు.