భారతీయులను అవమానించినా.. ట్రంప్​ వైఖరిపై మోదీ మౌనం.!

భారతీయులను అవమానించినా.. ట్రంప్​ వైఖరిపై మోదీ మౌనం.!

ఇండియన్స్ తరలింపులో  అమెరికా అమానవీయ చర్యపై  విశ్వ గురువు మోదీజీ ఎందుకు మాట్లాడడం లేదు.  డోనాల్డ్ ట్రంప్ వలస విధానాలు ఎల్లప్పుడూ జాత్యహంకారంతో,  ద్వంద్వ నీతులతో,  మానవ గౌరవాన్ని పూర్తిగా విస్మరించే ధోరణితో ఉంటాయి. ఉద్యోగం, మంచి భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులను సైనిక కార్గో విమానాల్లో అవమానకరంగా వెనక్కి పంపింది కేవలం కఠిన విధానం కాదు. ఇది మానవత్వంపై చేసిన మాఫ్ చేయలేని నేరం. వీళ్లంతా నేరస్తులు కాదు,  కేవలం కొన్ని వీసాల ఉల్లంఘనలు ఉంటే, వారిని నేరస్తుల్లా బంధించడం సరైన చర్య కాదు. ఈ దారుణానికి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వహిస్తాడు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచ యవనికపై అవమానిస్తుంటే?  మన దేశ ప్రజలు, రాజకీయ నాయకులు గళం విప్పాల్సిన  అవసరం ఉంది.  బ్రిటీష్ వలస పాలన మిగిల్చిన చేదు గుర్తుల్లో జలియన్​వాలా బాగ్ ఒకటి. అది అమృతసర్ లోనిది.  అమెరికాలో మన భారతీయులను జంతువుల్లా వేటాడి, బంధించి, సంకెళ్లు వేసి, తన సైనిక విమానాల్లో తెచ్చి అమృతసర్​లో అమెరికా దింపింది. దీంతో ప్రపంచ యవనిక మీద భారత్ పరువు బజారు పాలవుతోంది. ‘ట్రంప్ అమెరికా’ ఎదుట  ‘మోదీ భారత్’ లొంగిన దుస్థితి విశ్వవీధుల్లో మన దేశానికి తలవంపు తెస్తున్నది.  సంకెళ్ళతో  అమెరికా  సైనిక విమానాల్లో కుక్కి అమృతసర్​లో పడదోసి వెళ్ళింది. అది ఆ 104 మందికి  కాదు. 140 కోట్ల ప్రజల్ని అవమానించడమే.

ట్రంప్​ అమానవీయం

భారత్​కు అమెరికా మిత్ర దేశమని గొప్పగా చెప్పుకొంటున్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం భారతీయుల పట్ల  అమానవీయంగా,  క్రూరంగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్తుండడం, గతంలో మోదీ,  ట్రంప్​ మధ్య ఉన్న సాన్నిహిత్యం,  తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించినప్పుడు మోదీ ఆయనను ప్రియమిత్రుడిగా సంబోధిస్తూ అభినందన సందేశం పంపడం ఇవన్నీ గమనించిన వారికి అమెరికా సర్కార్  వైఖరి సహజంగానే ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ విషయంలో మన ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు గురవుతోంది. ఈ 104 మందిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ భారత్​కు తిప్పిపంపనున్న విషయం కేంద్రానికి ముందే తెలుసు.  ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే వారిని అమెరికా తిప్పి పంపింది. అలాంటప్పుడు వారిని తీసుకు రావడానికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపించి ఉండవచ్చు కదా? గతంలో ఉక్రెయిన్లో,  గల్ఫ్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడానికి డజన్ల సంఖ్యలో ప్రత్యేక విమానాలను ప్రభుత్వం పంపించింది. మరి ఇప్పుడు ఎందుకు పంపలేదనేది చాలామంది అనుమానం. 

విద్యార్థుల తల్లిదండ్రులకు పెనుభారం

ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్​టైం ఉద్యోగాలు చేస్తే తప్ప అక్కడ జీవించే పరిస్థితి లేదు. అమెరికా పంపేందుకు ఇక్కడ బ్యాంకుల ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పు చేసి ఇంకా కొంతమంది ఆస్తులు తాకట్టు పెట్టి విదేశాలకు పంపించారు. చదువు పూర్తయిన తర్వాత కూడా ఓపిటి( ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) పూర్తి చేసి ఏదో ఒక కంపెనీలో పని చేస్తూ కొంతలో కొంత మిగుల్చుకుని తల్లిదండ్రులకు పంపేవారు. ఇక్కడి తల్లిదండ్రులు వారి పిల్లల ఖర్చుకు చేసిన అప్పులకు జమ చేస్తూ ఉండేవారు. చదువు కోసం వెళ్లిన వారు కూడా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ తల్లిదండ్రులకు భారం కాకుండా చూసుకునే వారు. కానీ ఇప్పుడు విద్యార్థులు పార్ట్ టైం ఉద్యో గాలు చేయడానికి వీలు లేదని ట్రంప్ నిబంధనలు పెట్టడంతో ఇక్కడి నుంచి నెలకు రూ.60వేల నుంచి రూ. 80వేలు పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే అమెరికాలో కనీస జీవనానికి రూ.700 నుంచి రూ.800 డాలర్లు అవసరం అవుతాయని అంచనా. అట్లాంటా, ఓహయో, కాలిఫో ర్నీయా, న్యూజెర్సీ, న్యూయార్క్, చికాగో, డల్లాస్​ల్లో  తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. కేవలం పార్ట్ టైం ఉద్యోగాలు చేయనివ్వకుండా నిషేధించడం ఇక్కడి తల్లిదండ్రులకు పెనుభారంగా మారింది. 

యావత్  ప్రపంచం గళం విప్పాలి

భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ అమెరికాతో సహకరిస్తున్నప్పటికీ,  ట్రంప్ దానిని పట్టించుకోకుండా భారతీయులను అవమానపర్చాడు.  ఇది కేవలం వ్యక్తులపై కాదు, భారత్ పట్ల కూడా ఇది అవమానకరమైన చర్య. ఇది కేవలం భారతీయుల సమస్య కాదు. ప్రపంచమంతా ఇలాంటి అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పాలి. అమెరికా ఎదుగుదలకు కారణం వలసదారులే.  అనేక రంగాలలో విజ్ఞానం, పరిశ్రమ, కళ, సాంకేతికత వలసదారులే ప్రధాన పాత్ర వహించారు.  కానీ, ట్రంప్ అమెరికా చరిత్రను విస్మరించి, వలసదారుల్ని నేరస్తుల్లా చిత్రించడంలో కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ట్రంప్ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలు ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.  అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని, విధానాలను, అగ్రరీతి ప్రవర్తనను ఎదుర్కోవడానికి ప్రపంచం ఒక్కటిగా ఐక్యమవ్వాలి.  చిన్న దేశాలను బెదిరించే  ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది.  ట్రంప్ పాలన కేవలం వలసదారుల పట్ల ద్వేషంతోనే కాదు, మానవత్వానికి వ్యతిరేకంగానూ నిలిచింది. ఆయన జాత్యహంకార విధానాలు, విస్తరణ వాద కలలు, ఇతర దేశాలపై ఆగ్రహావేశ ధోరణి  ప్రపంచ ప్రజలను కలచివేస్తున్నాయి. వలసదారుల పట్ల ద్వేషం చూపిన నేతగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్,  భారతీయలకు అవమానకరంగా సంకెళ్లు వేసినా.. స్పందించని భారత ప్రధానిగా మోదీ  వీరిద్దరూ చరిత్రలో నిలిచిపోతారు.

- వెంకటేష్, 
పీడీఎస్​యూ, తెలంగాణా రాష్ట్ర సహాయ కార్యదర్శి