హర్యానాలో జాట్‌‌‌‌ల హైరానా

తాజా లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ హర్యానాలో పదికి పది సీట్లు కైవసం చేసుకొని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలో పదేళ్ల క్రితం నామమాత్రంగా ఉన్న పార్టీ తొలిసారిగా ఈ స్థాయి ఫలితాలను సాధించటం విశేషం. నిజానికి కమలదళం ఇక్కడ ఐదేళ్ల కిందటే పాగా వేసింది. ప్రస్తుతం పూర్తిగా పట్టు సంపాదించింది. వయొలెన్స్​, నిరుద్యోగం, జాట్​ల ఆగ్రహావేశాలు విజయావకాశాలను దెబ్బతీస్తాయన్న అనుమానాలను అధికార పార్టీ అలవోకగా తలకిందులు చేసింది. 40 ఏళ్ల పాటు సాగిన జాట్​ల రాజకీయ ఆధిపత్యం తగ్గడం మొదలైందని భావిస్తున్నారు.

ఉత్తరాదిలో జాట్‌‌‌‌ల పూర్తి ఆధిపత్యంలో ఉండే  రాష్ట్రం హర్యానా. బీజేపీ 2014కి ముందు ఆ స్టేట్​లో అక్కడక్కడే కనిపించేది. యూపీఏ–2 హయాంలో జరిగిన 2009 జనరల్​ ఎలక్షన్​లో పది సీట్లలో ఒక్కటీ పొందలేకపోయింది. దాన్నిబట్టి ఆ స్టేట్​లో పార్టీ పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి స్థితి నుంచి ఐదేళ్లు తిరిగేసరికి ఏడు సెగ్మెంట్లను ఖాతాలో వేసుకోగలిగింది. పోయినసారి (2014 చివరలో) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం కూడా చేపట్టినా.. సమర్థవంతమైన, నమ్మకమైన పాలన అందివ్వలేదన్న విమర్శలు బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు పదికి పది సీట్లు సొంతం చేసుకుంది.

ఇదెలా సాధ్యమైంది? 

జనరల్​ ఎలక్షన్​లో హర్యానాలో బీజేపీ బలోపేతం కావటానికి చాలా కారణాలు ఉన్నాయి. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలనేది ఇందులో ముఖ్యమైంది. జాట్​లు నాన్​–జాట్​ కమ్యూనిటీలపై దాడులు చేయటంతో కమలదళం బాధితులను అక్కున చేర్చుకుంది. దీంతో వాళ్లంతా బీజేపీకి అభిమానులుగా మారారు. రాష్ట్రంలో జరిగిన వివిధ అల్లర్ల వెనక హూడాల హస్తం ఉందని ఓటర్లను నమ్మించగలిగారు. తప్పు చేస్తే ఎంతవారికైనా శిక్ష తప్పదని రామ్​ రహీం సింగ్​, సుభాష్​ బరాలా అరెస్టుల ద్వారా హెచ్చరించటం పార్టీకి ప్లస్​ అయింది.

ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం 18 వేలకుపైగా టీచర్​, పోలీస్​ వగైరా లోయర్​ ర్యాంక్​ జాబ్​లను  ట్రాన్స్​పరెంట్​గా భర్తీ చేసింది. రిక్రూట్​మెంట్​ గతంలో ఇంత పక్కాగా జరిగేది కాదు. గతంలో ఓమ్‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌ చౌతాలా ఏలుబడిలో దాదాపు 3,000 మందిని అర్హత లేకపోయినా టీచర్లుగా నియమించారన్న ఆరోపణపై చౌతాలాతోపాటు ఆయన పెద్ద కొడుకు అజయ్‌‌‌‌ సింగ్‌‌‌‌ చౌతాలాకి జైలు శిక్షలు పడ్డాయి. ఖట్టర్‌‌‌‌ మాత్రం పూర్తి ట్రాన్స్‌‌‌‌పరెంట్‌‌‌‌గా రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్వహించడంతో అర్బన్​, రూరల్​ ఏరియాల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీచాయి. ప్రతిపక్షం చీలిపోవటమూ కమలానికి కలిసొచ్చింది. మాజీ సీఎం భూపిందర్​సింగ్​ హూడా, స్టేట్ కాంగ్రెస్​ చీఫ్​ అశోక్​ తన్వర్ మధ్య విభేదాలు పొడచూపాయనే టాక్​ వినిపించింది. ముఖ్య నేతల మధ్య కో–ఆర్డినేషన్​ లేకపోవటం గ్రాండ్​ ఓల్డ్​ పార్టీకి ప్రతికూలంగా మారింది.

జాట్​ల డామినేషన్​ ఇక గతమేనా!

హర్యానా రాజకీయాల్లో 40 ఏళ్లుగా జాట్​లదే ఆధిపత్యం. ప్రాంతీయ పార్టీ ఇండియన్‌‌‌‌ నేషనల్‌‌‌‌ లోక్‌‌‌‌ దళ్‌‌‌‌ ( ఐఎన్​ఎల్​డీ), కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్లు, సీఎంలుగా చేసినవాళ్లందరూ ఈ కమ్యూనిటీకి చెందినవారే. బీజేపీ లీడర్​, ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​ మాత్రం ఖత్రి సామాజిక వర్గంలోని అరోరా ఉపతెగకు చెందిన నాయకుడు. ఈ కమ్యూనిటీ నాన్​–జాట్​ కేటగిరీ కిందికి వస్తుంది. జాట్​ నేతలంతా ఇటీవలి లోక్​సభ ఎన్నికల్లో మట్టి కరిచారు. 2009లో ఈ రాష్ట్రం నుంచి తొమ్మిది మంది ఎంపీలు కలిగిన కాంగ్రెస్​ పార్టీకి ఇప్పుడు ప్రాతినిధ్యం జీరో. కమలదళం హర్యానాను క్లీన్​ స్వీప్​ చేసింది.

ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్​ కావొచ్చని అంచనా. 2014 వరకు రాష్ట్రంలో ఐఎన్​ఎల్​డీ, కాంగ్రెసే ప్రధాన పార్టీలు. తాజా ఎన్నికల్లో ఐఎన్​ఎల్​డీ అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయారు. హస్తం పార్టీ వాళ్లు 9 నియోజకవర్గాల్లో సెకండ్​ ప్లేస్​లో నిలిచినా వాళ్లపై గెలిచినోళ్లు పెద్దఎత్తున మెజారిటీలను సొంతం చేసుకున్నారు. రీసెంట్​ లోక్​సభ ఎన్నికలు హర్యానా పాలిటిక్స్​లో భారీ మార్పులకు నాంది పలికాయని చెప్పొచ్చు. జాట్​ల డామినేషన్​ ఇక గత చరిత్ర కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీజేపీ బాగుపడిందిలా..

మాజీ డిప్యూటీ ప్రధాని దేవీలాల్‌‌‌‌ పలుకుబడి ఈ రాష్ట్రంలో ఎక్కువ. ఆయన వారసుడిగా ఓమ్‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌ చౌతాలా కొంతకాలం హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫ్యామిలీ గొడవలతో హర్యానాలో దేవీలాల్‌‌‌‌ స్థాపించిన ఇండియన్​ నేషనల్​ లోక్​ దళ్​(ఐఎన్​ఎల్​డీ) 2018 డిసెంబర్​లో విడిపోయింది. చౌతాలా పెద్ద కొడుకు అజయ్‌‌‌‌ సింగ్‌‌‌‌ చౌతాలా ‘జన్​ నాయక్​ జనతా’ పేరిట కొత్త పార్టీ పెట్టగా, రెండో కొడుకు అభయ్‌‌‌‌ సింగ్‌‌‌‌  ఐఎన్​ఎల్​డీతోనే ఉన్నారు. ఓమ్‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌ చౌతాలా మనవడు దుష్యంత్‌‌‌‌ చౌతాలా (అజయ్‌‌‌‌ సింగ్‌‌‌‌ చౌతాలా కొడుకు) హిస్సార్‌‌‌‌ నుంచి జన్​ నాయక్‌‌‌‌ జనతా టికెట్‌‌‌‌పై లోక్‌‌‌‌సభకు ఎన్నికై, తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ రెండు గ్రూపులు ఒక్క సీటు కూడా గెలవకపోవటం గమనించాల్సిన విషయం. రీజనల్​ పార్టీలో వచ్చిన ఈ చీలికతో జాట్​ల ఆధిపత్యం గల పార్టీల తరఫున ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలవటం, ఆ సమాజం ఓట్లు గుంపగుత్తగా ఒకరికే కాకుండా తలా కొన్ని పడటంతో బీజేపీ బాగుపడిందని అంటున్నారు.

అల్లర్లే అల్లర్లు

2014 అక్టోబర్​లో సీఎంగా రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టిన మనోహర్​లాల్​ ఖట్టర్ మొదట్లోనే తేలిపోయారు. అల్లర్లకు, వయొలెన్స్​కి చెక్​ పెట్టడంలో విఫలమయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే స్థానిక ఆధ్యాత్మిక గురువు రామ్​పాల్​ని ఓ హత్య కేసులో అరెస్ట్​ చేయటానికి ప్రభుత్వం ప్రయత్నించింది. దీంతో హిసార్​ జిల్లా కేంద్రంలో ఆయన అనుచరులకు, పారామిలటరీ బలగాలకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. అవి హింస​కి దారితీశాయి.

2016 ఫిబ్రవరిలో జాట్​లు​ సర్కారు​ ఉద్యోగాల్లో, చదువుల్లో రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనకు దిగారు. అదీ వయొలెంట్​గానే మారింది. రాష్ట్ర జనాభాలో జాట్​లు దాదాపు మూడో వంతు పైగా ఉంటారు. వాళ్లలోని 36 కమ్యూనిటీలవారు ఒక్క తాటిపైకి వచ్చి నిరసన చేపట్టారు. రోహ్​తక్​, సోనిపట్​ జిల్లాల్లో నాన్​–జాట్‌‌‌‌ జనాలపై  దాడులకు పాల్పడ్డారు. 2017 ఆగస్టులో ఓ బీజేపీ లీడర్​ కొడుకు సుభాష్​ బరాలాని స్టాకింగ్​ కేసులో అదుపులోకి తీసుకోవటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అదే నెలలో డేరా సచ్ఛా సౌదాకి చెందిన గుర్మీత్​ రామ్​ రహీం సింగ్​ని అరెస్ట్​ చేసినప్పుడు అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనల్లో రూ.126 కోట్ల మేరకు ఆస్తి నష్టం సంభవించింది. వీటితోపాటు గోసంరక్షణ పేరిట యాంటీ సోషల్‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఉదంతాలు హర్యానాలో 2014 నుంచి 2018 వరకు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీకి 2019 లోక్​సభ ఎన్నికల్లో ఛేదు అనుభవం తప్పదని అంతా భావించారు. కానీ.. దానికి భిన్నమైన ఫలితాలు రావటం గమనార్హం.