జీ 7 దేశాల సమిట్..దేశాధినేతలతో మోదీ భేటీ

జీ 7 దేశాల సమిట్..దేశాధినేతలతో మోదీ భేటీ
  •     జీ7 దేశాల సమిట్​ కోసం ప్రధాని ఇటలీ టూర్
  •     ఫ్రాన్స్, ఉక్రెయిన్  అధ్యక్షులు, బ్రిటన్ ప్రధానితో సమావేశం

బారి :  ఇటలీలోని అపూలియాలో జరుగుతున్న జీ7 సమావేశాలలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. శుక్రవారం ఇటలీ చేరుకున్న మోదీ..  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మాక్రాన్​తో సమావేశమయ్యారు. రక్షణ, న్యూక్లియర్ అండ్ స్పేస్ వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై వారిద్దరూ చర్చలు జరిపారు. వ్యూహాత్మక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇరు నేతలూ అంగీకారం తెలిపారు. అలాగే సెక్యూరిటీ, టెక్నాలజీ, ఆర్టిఫిషియెల్  ఇంటెలిజెన్స్, క్లైమేట్  యాక్షన్, విద్య, డిజిటల్  పబ్లిక్  ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సాంస్కృతిక సంబంధాలు, భారత్–ఫ్రాన్స్  మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనా మాట్లాడుకున్నారు. 

అనంతరం మోదీ ఈ విషయాన్ని ట్విటర్ లో తెలిపారు. ‘‘నా ఫ్రెండ్, ప్రెసిడెంట్ మాక్రాన్ తో అద్భుతమైన భేటీ జరిగింది. వివిధ అంశాలతో పాటు యువతలో ఇన్నోవేషన్, రీసెర్చ్ ను ఎలా ప్రోత్సహించాలో కూడా చర్చించాం” అని మోదీ ట్వీట్  చేశారు. కాగా.. భారత ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టినందుకు మోదీకి మాక్రాన్  అభినందనలు తెలిపారు. అలాగే ఒలింపిక్స్​కు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో మాక్రాన్ కు మోదీ కూడా అభినందనలు చెప్పారు.

రిషి సునక్ తోనూ సమావేశం

బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తోనూ మోదీ సమావేశమయ్యారు. ఇండియా–యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఇరు నేతలూ చర్చించారు. కాగా, రష్యా–ఉక్రెయిన్  మధ్య యుద్ధం సమాప్తం కావాలంటే చర్చలు, దౌత్యమార్గాలే పరిష్కారం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉక్రెయిన్  ప్రెసిడెంట్ జెలెన్ స్కీతోనూ ఆయన భేటీ అయ్యారు. ఉక్రెయిన్​తో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చూస్తున్నామని మోదీ ట్వీట్  చేశారు. ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితిపై జెలెన్ స్కీని మోదీ అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ ధీర్  జైస్వాల్  వెల్లడించారు.

జీ7 సమిట్​లో అమెరికా అధ్యక్షుడి వింత ప్రవర్తన!

జీ 7 సమిట్​లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వింతగా ప్రవర్తించారు. సభ్యులంతా ఫొటో దిగేందుకు ఓచోట నిల్చుండగా.. బైడెన్​ మాత్రం వారికి దూరంగా వెళ్లారు. అక్కడ జనాలు లేకున్నా వారికి థంబ్​ చూపిస్తూ ముందుకు కదిలారు.  ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆయనను వెనక్కి తీసుకురాగా, సభ్యులతో కలిసి ఫొటో దిగారు. మరో సంఘటనలో జార్జియా మెలోనీని కలిసేందుకు స్టేజీపైకి వెళ్లిన బైడెన్.. ఆమెను హగ్​ చేసుకున్న తర్వాత చేతులు పైకిత్తి సెల్యూట్​ చేశారు.