హైదరాబాద్ : ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోడీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు..? అంటూ పోస్టర్లులో పేర్కొన్నారు. 2018, మే, 5వ తేదీన ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమై.. ఇప్పటికీ ఐదేళ్లు పూర్తైన 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ పోస్టర్లలో తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారంటూ పోస్టర్లలో ప్రశ్నించారు.
ఇదే విషయంపై మంత్రి కేటీఆర్.. మార్చి 27వ తేదీన ట్విట్టర్ లో స్పందించారు. ‘ఐదేళ్లలో మేము 35 ప్రాజెక్టులు పూర్తి చేశాం. కేంద్రం 2 ఫ్లైఓవర్లు కూడా కట్టలేకపోయింది’ అని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గతంలో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ హైదరాబాద్ లో ఆయనకు వ్యతిరేకంగా పలు పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఉప్పల్, నారపల్లి మధ్య ఉన్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కాంట్రాక్టరే కారణమని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనదారులు, స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇటు కేటీఆర్ కు కూడా దీనిపై రిప్లై ఇచ్చారు. చాలామంది ఈ ఫ్లైఓవర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది భావిస్తున్నారని, కానీ... ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పూర్తి చేసి... కేంద్రానికి అందించిందని చెబుతున్నారు అధికార పార్టీ నాయకులు.
అయితే..పిల్లర్లపై ఈ పోస్టర్లు ఎవరు అంటించారు..? ఎప్పుడు అంటించారు..? ఎవరు చెబితే అంటించారనే చర్చ సాగుతోంది. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే బీజేపీని బద్నాం చేసేందుకే పోస్టర్లు అంటించారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.