నరేంద్ర మోదీ మంగళవారం రష్యా వెళ్లారు. మధ్యాహ్నం కజాన్ సిటీకి చేరుకున్న మోదీకి రష్యన్లతోపాటు అక్కడి ఇండియన్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ భేటీ అయ్యారు. సమావేశం తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ఇండియా పూర్తిగా సహకరిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. సమస్యను శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని సూచించారు.
కజాన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన కోసం భారత్ తరఫున పూర్తి సహకారం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రెండు దేశాలూ సమస్యను శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. రష్యాలో జరుగుతున్న 16వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాల సమిట్ లో పాల్గొనేందుకు మంగళవారం మధ్యాహ్నం మోదీ కజాన్ సిటీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద, ప్రధాని బస చేసిన హోటల్ కోర్ స్టన్ వద్ద ఆయనకు రష్యన్లు, ఇండియన్లు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం బ్రిక్స్ సమిట్ వేదిక వద్దకు చేరుకున్న మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాదరంగా ఆహ్వానించారు. ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత పరిష్కారమే సరైనదని పుతిన్‌కు సూచించినట్టు మోదీ తెలిపారు. ‘‘రష్యా, ఉక్రెయిన్ సమస్యపై మేం అన్ని వర్గాలతో టచ్ లో ఉన్నాం. సంఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనే మేం ఎల్లప్పుడూ కోరుకుంటాం.
శాంతి స్థాపనకు సహాయం చేయడంలో ఇండియా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని ఆయన చెప్పారు. బ్రిక్స్ గ్రూపునకు ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా దానిని విజయవంతంగా నడిపించిందని, అందుకే ఈ గ్రూపులో అనేక దేశాలు చేరాలని కోరుకుంటున్నాయని అన్నారు. గత జులైలో జరిగిన 22వ ఇండియా–రష్యా యాన్యువల్ సమిట్ కోసమూ రష్యా పర్యటనకు వచ్చానని, అన్ని రంగాల్లో సహకారం పెంచుకునేందుకు పుతిన్, తాను అంగీకరించామని గుర్తు చేశారు. పుతిన్ మాట్లాడుతూ.. ఇండియా, రష్యా మధ్య ప్రత్యేకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు. కాగా, కజాన్ సిటీలో మంగళవారం ప్రారంభమైన బ్రిక్స్ సమిట్ శనివారం ముగియనుంది. సమిట్ ముగింపు రోజున బ్రిక్స్ సభ్య దేశాలు ‘కజాన్ డిక్లరేషన్’ను ప్రకటించనున్నాయి. అలాగే ఈ గ్రూపులోకి కొత్తగా ఐదు దేశాలు అధికారికంగా చేరనున్నాయి.
రష్యన్ ఆర్మీ నుంచి 85 మంది ఇండియన్ల డిశ్చార్జ్
రష్యన్ ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న మరో 85 మంది ఇండియన్లు విధుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు. రష్యన్ ఆర్మీలో మిగిలిన 20 మంది ఇండియన్లను రిలీవ్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
భజనలు, ఆటపాటలతో గ్రాండ్ వెల్ కం
కజాన్ సిటీకి చేరుకున్న మోదీకి అక్కడి ఇండియన్లు, రష్యన్లు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు వద్ద రష్యన్ సంప్రదాయంలో స్వీట్లతో వచ్చి వెల్ కం చెప్పగా.. మోదీ బస చేసిన కోర్ స్టన్ హోటల్ వద్ద మాత్రం ఇండియన్ ట్రెడిషన్‌లో చీరలు, దుస్తులు ధరించిన రష్యన్ మహిళలు శ్రీకృష్ణ భజన కీర్తనలు ఆలపిస్తూ, సంస్కృతంలో పాటలు పాడుతూ, ఆటపాటలతో మోదీకి వెల్ కం చెప్పారు. ఈ సందర్భంగా ఇండియన్లు ‘‘మోదీ, మోదీ.. భారత్ మాతా కీ జై” అంటూ నినాదాలతో హోరెత్తించారు.