
- ఏడు శాఖల అధికారులతో మోదీ రివ్యూ మీటింగ్
- తొలి వంద రోజుల్లో చేపట్టబోయే ప్రణాళికపై చర్చ
- హీట్‌వేవ్స్, తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల పరిస్థితులపై సమీక్ష
- వరుస అగ్ని ప్రమాదాల కారణాల గురించి ఆరా
- అధికారుల నుంచి సలహాలు తీసుకున్న ప్రధాని
న్యూఢిల్లీ: కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలతో.. ప్రధాని నరేంద్ర మోదీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం పలు శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారం చేపట్టిన తర్వాత తొలి వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. మొత్తం 7 శాఖలపై ఆయన రివ్యూ నిర్వహించారు. వంద రోజుల ప్రణాళిక అమలుపై అధికారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు.
కాగా, మొదటి వంద రోజులకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రులకు మోదీ సూచించారు. ఆదివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ప్రధానంగా హీట్ వేవ్స్, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, వరుసగా సంభవించిన అగ్ని ప్రమాదాలు, రెమాల్ తుఫాన్ ప్రభావం వంటి అంశాలపై అధికారులతో చర్చించినట్టు తెలుస్తున్నది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో, ఢిల్లీలో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన డేటాపై కూడా ఆయన ఐఎండీ అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమచారం.
ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి
దేశ వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్‌తో పాటు పబ్లిక్ ప్లేసుల్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో ఇటీవల ఓ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఏడుగురు నవజాత శిశువులు చనిపోయారు. రాజ్‌కోట్‌లోని గేమ్ జోన్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో 22 మంది చనిపోయారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన కారణాలను, తీసుకున్న చర్యల గురించి మోదీ ఆరా తీశారు. అగ్ని ప్రమాదాల నివారణకు రెగ్యులర్ డ్రిల్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. క్రమం తప్పకుండా అడవుల్లో ఫైర్లైన్ల మెయింటెనెన్స్ చేపట్టాలని చెప్పారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలపైనా ఉన్నతాధికారులతో ప్రధాని చర్చించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా అవగాహన పెంచాలని సూచించారు.
రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటది
రెమాల్ తుఫాన్ ప్రభావం కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తడంతో అక్కడ నెలకొన్న పరిస్థితులను మోదీ అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది చనిపోయారు? ఎంత ఆస్తి నష్టం సంభవించింది? అన్నవి ఆరా తీశారు. పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్‌పై గురించి కూడా మోదీ అడిగి తెలుసుకున్నారు. వడదెబ్బ కారణంగా దేశ వ్యాప్తంగా వందలాది మంది చనిపోయారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వీస్తున్న వేడి గాలులు, ఎండల నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి మోదీకి ఐఎండీ అధికారులు వివరించారు. నార్త్ ఇండియాలో వేడిగాలుల పరిస్థితులు రెండు రోజుల్లో తగ్గే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ, ఇతర శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.