
న్యూఢిల్లీ: ఇంకో ఐదేళ్లలో ఇండియా టెక్స్‌టైల్ (దారాలు, క్లాత్, బట్టల) ఎగుమతులు ఏడాదికి రూ.9 లక్షల కోట్లకు చేరుకుంటాయని భారత్ టెక్స్2025 లో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పత్తి ఉత్పత్తిని పెంచేందుకు బడ్జెట్‌లో ఐదేళ్ల కాటన్ మిషన్‌ను ప్రకటించామన్నారు. నేషనల్ కాటన్ టెక్నాలజీ మిషన్ కోసం రూ.500 కోట్లను బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది.
‘ టెక్స్‌టైల్స్, క్లాత్స్ ఎగుమతుల్లో ప్రపంచంలోనే ఆరు స్థానంలో ఉన్నాం. మొత్తం ఎగుమతుల విలువ ఏడాదికి రూ.3 లక్షల కోట్ల దగ్గర ఉంది. 2030 నాటికి ఈ నెంబర్‌ను మూడింతలు చేయడమే మన లక్ష్యం’ అని మోదీ వివరించారు. గత పదేళ్లుగా తీసుకున్న పాలసీలు, ఇండస్ట్రీ కృషి ఫలితంగానే టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో వృద్ధి నమోదు చేశామని, ఈ సెక్టార్‌లోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు రెండింతలు పెరిగాయని అన్నారు.
టెక్స్‌టైల్ ఇండస్ట్రీ పెద్ద మొత్తంలో ఉద్యోగాలను అందిస్తోంది. మొత్తం మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో ఈ సెగ్మెంట్ వాటా 11 శాతంగా ఉంది. యూనియన్ బడ్జెట్‌లో 2025–26 కోసం రూ.5,272 కోట్లను టెక్స్‌టైల్స్ మినిస్ట్రీకి కేంద్రం కేటాయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం కోసం ఇచ్చిన ఫండ్స్‌తో పోలిస్తే 19 శాతం పెంచింది. టెక్స్‌టైల్ ప్రొడక్ట్‌లను ప్రదర్శించేందుకు ఢిల్లీలో ఈ నెల 14–17 మధ్య భారత్ టెక్స్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో 120 దేశాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు.
మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో ముందుకు..
హై గ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీలో ఇండియా విస్తరిస్తోందని మోదీ అన్నారు. బ్యాంకింగ్ సెక్టార్ కూడా టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి ఆర్థికంగా సాయం అందివ్వాలని కోరారు. ‘ఒక ప్లాంట్ పెట్టడానికి సగటున రూ.75 కోట్లే అవుతాయి. 2 వేల మంది ఉద్యోగాలు వస్తాయి’ అని పేర్కొన్నారు. ‘ఇండియా టెక్స్‌టైల్స్, క్లాత్స్ ఎగుమతులు కిందటేడాది 7 శాతం వృద్ధి సాధించాయి. స్కిల్స్ ఉన్న వారిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
టెక్నికల్ టెక్స్‌టైల్ (కార్ల సీట్ కవర్లు, బ్యాండేజ్‌లు వంటివి) సెక్టార్‌పై ఫోకస్ పెట్టాం. ఈ సెగ్మెంట్‌లో గ్లోబల్‌గా ఇండియా ప్రాతినిధ్యం కనిపిస్తోంది’ అని మోదీ అన్నారు. టెక్స్‌టైల్ సెక్టార్ కోసం తన 5 ఎఫ్ విజన్‌ను పంచుకున్నారు. అవి పొలం నుంచి ఫైబర్, ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్, ఫ్యాషన్ నుంచి ఫారిన్. ఐఐటీలతో కలిసి కొత్త టూల్స్‌ను టెక్స్‌టైల్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలన్నారు.
టెక్స్‌టైల్ సెక్టార్డెవలప్మెంట్కు 7 ప్రాజెక్ట్‌లు
ఇండియాలో టెక్స్‌టైల్, చేనేత రంగాలను అభివృద్ధి చేసేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ), టెక్స్‌టైల్స్ మినిస్ట్రీ కలిసి ఏడు కొత్త ప్రాజెక్ట్‌లను లాంచ్ చేశాయి. ఈ ఏడు ప్రాజెక్ట్‌లను తొమ్మిది రాష్ట్రాల్లో డెవలప్ చేస్తారు. టెక్స్‌టైల్ సెక్టార్‌లోని మొత్తం సప్లయ్ చెయిన్‌ను డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఈయూ రూ.85.5 కోట్లను గ్రాంట్‌గా ఇవ్వనుంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖాండ్, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సా, జార్కండ్, బిహార్, హర్యానా రాష్టాల్లో ఈ ఏడు ప్రాజెక్ట్‌లను అమలు చేయనున్నారు.
మొత్తం 15 వేల ఎంఎస్‌ఎంఈలు, 5 వేల చేనేత కార్మికులు, 15 వేల రైతులు ఈ ప్రాజెక్ట్‌లతో లాభపడతారని ప్రభుత్వం చెబుతోంది. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో వీటిని పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లతో లోకల్ ప్రజలు, పరిశ్రమలు కూడా లాభపడతాయని ప్రభుత్వం పేర్కొంది. రెండు లక్షల మంది మహిళలకు ఉపాధి దక్కుతుందని, టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుందని తెలిపింది.