వడోదరా నుంచి విమానాలను .. ప్రపంచానికి ఎగుమతి చేస్తాం: మోదీ

వడోదరా నుంచి విమానాలను .. ప్రపంచానికి ఎగుమతి చేస్తాం: మోదీ
  • టాటా ఎయిర్ క్రాఫ్ట్​ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మోదీ కామెంట్
  • రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడి
  • స్పెయిన్ కంపెనీతో కలిసి సీ 295 విమానాల తయారీ
  • రతన్ టాటా లేకపోవడం ఎంతో బాధాకరమన్న ప్రధాని
  • స్పెయిన్ ప్రధాని పెడ్రోతో కలిసి వడోదరాలో మోదీ రోడ్​ షో

వడోదరా: గుజరాత్​లోని వడోదరాలో తయారయ్యే విమానాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. సీ -295 ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌ లను తయారు చేసే టాటా ఎయిర్‌‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌‌ను స్పెయిన్‌‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌‌తో కలిసి మోదీ సోమవారం ప్రారంభించారు. టాటాల భాగస్వామ్యంతో స్పెయిన్​కు చెందిన ఎయిర్‌‌బస్‌‌ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముందు వడోదరా ఎయిర్​పోర్టుకు చేరుకున్న పెడ్రో సాంచెజ్​తో కలిసి ఓపెన్ టాప్ జీప్​లో మోదీ రోడ్ షో నిర్వహించారు. 2.5 కిలో మీటర్ల పొడవు ఈ రోడ్‌‌ షో కొనసాగింది. తర్వాత మోదీ, పెడ్రో ఇద్దరూ కలిసి టాటా ఎయిర్‌‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌‌ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. సీ 295 ట్రాన్స్​పోర్టు ఎయిర్​క్రాఫ్ట్ ఫీచర్స్​ను అధికారులు మోదీ, పెడ్రోకు వివరించారు.

2022లోనే స్పెయిన్​తో రూ.21వేల కోట్ల డీల్

ఎయిర్ క్రాఫ్ట్ కాంప్లెక్స్​ను మోదీ, పెడ్రో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘‘టాటా, ఎయిర్‌‌బస్ తయారీ కేంద్రం ఇండియా, స్పెయిన్ సంబంధాలను సరికొత్త మార్గంలోకి తీసుకెళ్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ మిషన్‌‌ను బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు 2022, అక్టోబర్​లోనే శంకుస్థాపన చేశాం. కొన్ని కారణాల వల్ల సీ 295 ట్రాన్స్​పోర్ట్ ఎయిర్​క్రాఫ్ట్ తయారీలో లేట్ అయింది. మొత్తం 56 సీ 295 ఎయిర్​క్రాఫ్ట్​ల కొనుగోలు కోసం స్పెయిన్​కు చెందిన ఎయిర్​బస్ డిఫెన్స్, స్పేస్ ఎస్ఏతో ఒప్పందం కుదిరింది. రూ.21,935 కోట్ల డీల్ ఇది. ఇప్పటి వరకు 16 ఎయిర్​క్రాఫ్ట్స్ స్పెయిన్ నుంచి ఇండియాకు డెలివరీ అయ్యాయి. మిగిలిన 40 ఎయిర్​క్రాఫ్ట్స్ టాటా భాగస్వామ్యంతో వడోదరాలోనే తయారు చేయనున్నారు’’ అని మోదీ తెలిపారు.

రక్షణ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం

ఇండియా డిఫెన్స్ సిస్టమ్ సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నదని మోదీ అన్నారు. తమ పదేండ్ల పాలనలో రక్షణ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ‘‘టాటా భాగస్వామ్యంతో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇలాంటి సమయంలో మన మధ్య రతన్ టాటా లేకపోవడం బాధాకరం. ఆయన జీవించి ఉంటే.. ఇప్పుడు మన మధ్య ఉండేవాళ్లు. కొన్ని రోజుల కిందే ఇండియా ముద్దు బిడ్డ రతన్‌‌ టాటాను కోల్పోయాం. ఎక్కడ ఉన్నా ఆయన దీనిని చూసి సంతోషిస్తారు. ఆయన ఆశయాలను ఇలాగే ముందుకు తీసుకెళ్దాం’’ అని మోదీ నివాళులర్పించారు. టాటా–ఎయిర్ బస్ ఫ్యాక్టరీతో వేలాది మందికి ఉద్యోగాల లభిస్తాయన్నారు. ‘‘18వేల ఎయిర్​క్రాఫ్ట్ పార్ట్స్ తయారు చేసే ఇండియన్ కంపెనీలకు మంచి సపోర్ట్ దొరుకుతది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎంఎస్​ఎంఈలకు అవకాశాలు లభిస్తాయి’’ అని మోదీ తెలిపారు. ప్రపంచంలోని కీలకమైన ఎయిర్​క్రాఫ్ట్స్​కు విడిభాగాలు సప్లై చేసే అతిపెద్ద దేశాల్లో ఇండియా ఒకటన్నారు. కొత్త ఎయిర్​క్రాఫ్ట్ ఫ్యాక్టరీ.. ఇక్కడ కొత్త నైపుణ్యాలు, కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు.

ఎయిరోస్పేస్ ఇండస్ట్రీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది: స్పెయిన్ ప్రధాని పెడ్రో

టాటా, ఎయిర్​బస్ భాగస్వామ్యం.. ఇండియా ఎయిరోస్పేస్ ఇండస్ట్రీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌‌ అన్నారు. ‘‘ఇప్పుడు మనం రెండు ప్రముఖ కంపెనీల మధ్య ఒక అసాధారణ ప్రాజెక్ట్ ప్రారంభం కావడాన్ని చూస్తున్నాం. ఇండియా, ప్రధాని మోదీ విజన్‌‌కు ఇది మరో విజయం. ఇండియాను పారిశ్రామిక శక్తిగా మార్చడం, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచడంపైనే మోదీ ఫోకస్ పెట్టారు. మరిన్ని యూరప్ దేశాలు ఇండియాకు వచ్చేందుకు టాటా, ఎయిర్​బస్ కాంప్లెక్స్ డోర్లు తెరిచింది’’ అని పెడ్రో అన్నారు. కాగా, 2024 అక్టోబర్ 28 డేట్ రాసిపెట్టుకోవాలని, సరిగ్గా రెండేండ్లలో తొలి విమానం డెలివరీ చేస్తామని టాటా సన్స్‌‌ చైర్మన్ ఎన్‌‌.చంద్రశేఖరన్‌‌ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.

ఎయిర్​క్రాఫ్ట్ ఫీచర్స్

ఆరు దశాబ్దాలుగా వినియోగిస్తున్న అవ్రో -748 ట్రాన్స్‌‌పోర్ట్ ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌ల స్థానాన్ని సీ 295 ఎయిర్​క్రాఫ్ట్ భర్తీ చేయనున్నాయి.

టేకాఫ్, ల్యాండింగ్​కు తక్కువ రన్​వే ఉన్నా సరిపోతుంది. 5–10 టన్నుల సామాగ్రిని మోసుకెళ్లగలదు. 
ఈ ఎయిర్​క్రాఫ్ట్​లో 40 నుంచి 45 మంది పారాట్రూపర్లు లేదంటే 70 మంది సాధారణ ప్రజలు జర్నీ చేయొచ్చు.

ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా నాన్​స్టాప్​గా 11 గంటలు గాల్లో ఎగురుతుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎడారి, మైదాన ప్రాంతాల్లోనూ మిషన్ సక్సెస్ చేస్తది.

పారా డ్రాపింగ్ (పారా ట్రూపర్స్, కార్గో) కోసం ఎయిర్​క్రాఫ్ట్ వెనుక డోర్లు ఉంటాయి. 56 ఎయిర్​క్రాఫ్ట్స్​లో డీపీఎస్​యూకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ తయారు చేసిన ఎలక్ట్రానిక్ వార్​ఫేర్ సూట్​ను అమర్చారు.

నేడు పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం 

ప్రధాని మోదీ మంగళవారం రూ.12వేల కోట్లు విలువ చేసే పలు డెవలప్​మెంట్ ప్రాజెక్టులను వర్చువల్​గా ప్రారంభించనున్నారు. 70 ఏండ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్​ను వర్తింపజేయనున్నారు. రోజ్​గార్ మేళా కింద 51వేల మందికి అపాయింట్​మెంట్ లెటర్లు అందజేస్తారు. ఆలిండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్​ను ప్రారంభిస్తారు. మధ్యప్రదేశ్​లో మూడు మెడికల్ కాలేజీలను ఓపెన్ చేస్తారు. హిమాచల్​ప్రదేశ్, యూపీ, వెస్ట్​బెంగాల్, అస్సాం, ఢిల్లీలో పలు కొత్త హెల్త్ కేర్ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.