న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని సవరించాలంటూ నెహ్రూ అప్పట్లో సీఎంలకు లేఖలు రాశారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. నెహ్రూ రాసిన లేఖను ప్రధాని వక్రీకరిస్తున్నారని ఖర్గే విమర్శించారు. ఆ లేఖపై దేశ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినందుకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం రాజ్యసభలో నిర్వహించిన చర్చలో ఖర్గే మాట్లాడారు. బీజేపీ నేతలు మోదీ భక్తిలో మునిగారని, దీంతో దేశం నియంతృత్వం వైపు వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘1947 నుంచి 1952 మధ్య ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదని మోదీ అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అక్రమంగా సవరించిందన్నారు. వాస్తవానికి ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడానికి, విద్యా రంగానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మొదటిసారిగా రాజ్యాంగాన్ని సవరించారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో ఆ సవరణ చేశారు. ఆ సభ్యుల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారు. అంతేకాకుండా ఉద్యోగాల కల్పన, జమీందారీ వ్యవస్థ రద్దు కూడా ఆ సవరణలో ఉన్నాయి. అయితే, రిజర్వేషన్లపై నాటి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అలాగే, మత ప్రచారాన్ని అడ్డుకోవడం కూడా ఆ సవరణలో ఉన్న మరో ఉద్దేశం. రాజ్యాంగ సవరణతోనే మతప్రచార సమస్యకు చెక్ పెట్టగలమని నెహ్రూకు నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ సూచించారు. ఈ మేరకు 1950 జులై 3న నెహ్రూకు పటేల్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సీఎంలకు నెహ్రూ లేఖలు రాశారు” అని ఖర్గే పేర్కొన్నారు. కానీ, రాజ్యాంగాన్ని మార్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నించిందంటూ నెహ్రూపై మోదీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేసినందుకు దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.
ప్రధాని ఇంకా గతంలోనే ఉన్నరు
ప్రధాని మోదీ ఇంకా గతంలోనే బతుకుతున్నారని ఖర్గే ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన ప్రస్తుత ఘనకార్యాలను ఆయన ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు. ‘‘మనుస్మృతి ఆధారంగా లేదని 1949లో ఆరెస్సెస్ లీడర్లు రాజ్యాంగాన్ని వ్యతిరేకించారన్న విషయం దేశానికి తెలుసు. ఈ విషయాన్ని ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజరే 1949 నవంబరు 30న వెల్లడించింది” అని ఖర్గే తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఓటు హక్కులేని రోజుల్లో.. కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగం ద్వారా భారత్లో అన్నివర్గాల ప్రజలకు ఓటుహక్కు కల్పించిందని చెప్పారు. దేశంకోసం పోరాడని వారికి స్వాతంత్ర్యం, రాజ్యాంగం విలువ ఏమి తెలుస్తుందన్నారు. అబద్దాలు ప్రచారం చేయడం ఒక్కటే బీజేపీకి తెలుసని ఖర్గే చురకలంటించారు.
సభలో మంత్రి నిర్మల ఆరోపణలకు కౌంటర్
రాజ్యసభలో రాజ్యాంగంపై వాడీవేడి చర్చ కొనసాగింది. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిర పేర్లు ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యల కు ఏఐసీసీ చీఫ్ఖర్గే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘లోక్సభలో రాజ్యాంగ చర్చ ద్వారా ప్రధాని సభను తప్పుదోవ పట్టించారు. ఎలా మాట్లాడాలో ఈరోజు నేను వాళ్లకు చెప్పదల్చుకున్నా. నేను చదువుకుంది మున్సిపాలిటీ బడిలో. నిర్మలా సీతారామన్ జేఎన్యూలోనే చదవొచ్చు. ఆర్థిక నిపుణురాలే కావొచ్చు. కానీ, ఆమె మాట్లాడే విధానం అస్సలు బాగోలేదు. జాతీయ పతాకాన్ని, అశోక చక్రాన్ని.. రాజ్యాంగాన్ని ద్వేషించినవాళ్లు.. ఇవాళ మాకు పాఠాలు చెబుతున్నారు’’ అని ఖర్గే మండిపడ్డారు.