న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్ హిబ్బొల్లా మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. లెబనాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తోన్న హిబ్బొల్లాపై ఇజ్రాయెల్ విరుకుచుపడుతోంది. హిబ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బాంబులు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో హిబ్బొల్లా చీఫ్ హసన్ నస్రాల్లా మరణించిన విషయం తెలిసిందే. హసన్ నస్రాల్లా మరణంతో హిబ్బొల్లా ప్రతీకారంతో రగిలిపోతుంది. దీంతో పశ్చిమాసియా దేశాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళన పరిస్థితి నెలకొంది.
ALSO READ | సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్.. ముడా స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ
ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఇవాళ (సెప్టెంబర్ 30) మాట్లాడారు. ఈ సందర్భంగా.. పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితులపై నెతన్యాహుతో చర్చించినట్లు మోడీ పేర్కొన్నారు. నెతన్యాహుతో మాట్లాడిన విషయాన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మోడీ వెల్లడించారు. "ఉగ్రవాదానికి మన ప్రపంచంలో స్థానం లేదు. ప్రాంతీయ తీవ్రతను నిరోధించడం, బందీలందరిని సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. శాంతి, స్థిరత్వం యొక్క ముందస్తు పునరుద్ధరణ కోసం ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం కట్టుబడి ఉంది’’ అని మోడీ ట్వీట్ చేశారు.