
- మండపం చుట్టూ 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
- ముందుగా భగవతీ అమ్మన్ ఆలయంలో పూజలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారి వెళ్లారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు వివేకానంద రాక్ మెమోరియల్లోని ధ్యాన మండపంలో ఆయన మెడిటేషన్ చేయనున్నారు. మొత్తం 48 గంటల పాటు మోదీ ధ్యానంలో ఉంటారని బీజేపీ నేతలు తెలిపారు. దీంతో సుమారు 3 వేల మందికి పైగా పోలీసులను రాక్ మెమోరియల్ చుట్టూ మోహరించారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంతో పాటు అరేబియా మహాసముద్ర ప్రాంతంలో శనివారం సాయంత్రం దాకా ఇండియన్ కోస్ట్ గార్డ్స్, నేవీ సిబ్బంది పహారా కాస్తుంటారు. ఈ బీచ్‌లో పర్యాటకులను, ప్రైవేట్ బోట్లను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. చేపల వేటపైనా నిషేధం విధించారు.
భగవతీ అమ్మన్ ఆలయంలో పూజలు
కన్యాకుమారికి చేరుకున్న వెంటనే మోదీ.. నేరుగా శ్రీ భగవతీ అమ్మన్ ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పూజారులు భగవతి అమ్మన్ చిత్రపటం, తీర్థ ప్రసాదాలను మోదీకి అందజేశారు. ఆ తర్వాత వివేకానంద రాక్ పక్కనే ఉన్న తిరువల్లూరు విగ్రహాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ధ్యానం ప్రారంభించారు.
2014 ప్రతాప్‌గఢ్, 2019లో కేదార్నాథ్
1892లో ప్రముఖ హిందూ తత్వవేత్త స్వామి వివేకానంద ఇక్కడే మూడు పగళ్లు, మూడు రాత్రులు ధ్యానం చేశారని పలువురు చెప్తుంటారు. అందుకే ఆయనకు నివాళులు అర్పించేందుకు గుర్తుగా కన్యాకుమారిలో సముద్రంలో రాక్ మెమోరియల్‌ను ఏర్పాటు చేశారు. తమిళ కవి తిరువళ్లువార్ 133 అడుగుల విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 2014 ఎన్నికల ప్రచారం ముగిశాక మోదీ ప్రతాప్ గఢ్‌ను సందర్శించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం తర్వాత కేదార్ నాథ్‌లోని గుహలో ధ్యానం చేశారు.
మోదీ పోగ్రాంను ఖండించిన కాంగ్రెస్, సీపీఎం
ప్రధాని మోదీ కన్యాకుమారి సందర్శించడాన్ని, అక్కడ ధ్యానం చేయడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది. ఇది కూడా ఒక రకమైన ప్రచారమేనని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని విమర్శించింది. ఈ ధ్యానానికి సంబంధించిన వార్తలను మీడియా ప్రసారం చేయకుండా చూడాలంటూ మోదీపై వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. తమిళనాడు సీపీఎం నేతలు కూడా ఈసీకి లేఖ రాశారు. సైలెన్స్ పీరియడ్‌లో ఇలాంటి వాటికి తావివ్వొద్దని కోరారు. కాంగ్రెస్ నేతల కామెంట్లను బీజేపీ నేతలు ఖండించారు. కన్యాకుమారి ఎంపిక అనేది జాతీయ ఐక్యతకు సంకేతాన్ని ఇస్తుందని తెలిపారు.
ఆర్మీని రాజకీయ ఆయుధంగా మార్చారు..ఇంతకంటే పెద్ద పాపం మరొకటి ఉండదు: ప్రధాని
చండీగఢ్: ఆర్మీని ఇండియా కూటమి నేతలు రాజకీయ ఆయుధంగా మార్చారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇంతకంటే పెద్ద పాపం మరొకటి ఉండదని పేర్కొన్నారు. సాయుధ బలగాలను బలహీనపరిచే ఏ అవకాశాన్నీ కాంగ్రెస్, ఇండియా కూటమి వదులుకోబోవని ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ గురువారం హోషియార్‌పూర్‌లో నిర్వహించిన బీజేపీ ప్రచార ర్యాలీలో పాల్గొని, మాట్లాడారు. ‘పంజాబ్ ధైర్యసాహసాలు, శౌర్యం ఉన్న రాష్ట్రం. ఆ ధైర్యవంతులను కూటమి నేతలు అడుగడుగునా అవమానించారు.
దివంగత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను వీధి గూండా అని అన్నారు. ఇది దేశంలోని ప్రతి సైనికుడిని అవమానించడమే’ అని మోదీ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం గొంతు నొక్కిన వారు, 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లకు పాల్పడిన వారే ఇప్పుడు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు. "అవినీతికి కాంగ్రెస్ తల్లి. ఇందులో కాంగ్రెస్‌కు డబుల్ పీహెచ్‌డీ ఉంది" అని మోదీ పేర్కొన్నారు.