ఆక్రమించుకునే రోజులు పోయినయ్
లడఖ్ వేదికగా చైనాకు ప్రధాని మోడీ గట్టి వార్నింగ్
ఇప్పుడున్నదంతా అభివృద్ధి యుగమే
శత్రువులు మన వాడివేడి రుచి చూశారు
శాంతి కావాలనుకోవడం ఇండియా బలహీనత అనుకోవద్దు
అభివృద్ధిని అడ్డు కోవాలని చూస్తే గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరిక
లడఖ్ ఏరియాలో ప్రధాని సర్ప్రైజ్ టూర్
నీమూలో సైనికులతో ముచ్చట
గల్వాన్లో గాయపడిన సైనికులకు పరామర్శ.. అమరులకు నివాళులు
న్యూఢిల్లీ: బార్డర్ లో కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు ప్రధాని నరేంద్రమోడీ గట్టి వార్నింగ్ ఇచ్చారు.లడఖ్ వేదికగా ఇంచు భూమినీ వదులుకోబోమన్న సందేశం పంపారు. ‘పూజించడమూ తెలుసు..అవసరమైతే శిక్షించడమూ తెలుసు’అని శ్రీకృష్ణుడిని ప్రస్తావిస్తూ చెప్పారు. బలగాలకు మనోధైర్యాన్నిచ్చేలా మాట్లాడారు. ఆక్రమించుకునే రోజులు పోయాయని, అటువంటి వాళ్ల పని అయిపోయిందని అన్నారు. శత్రువులంతా మన బలగాల వాడి, వేడిని రుచిచూశారన్నారు. ఇప్పుడున్నదంతా అభివృద్ధేనని, దానిని డిస్టర్బ్ చేయాలనుకునేవాళ్లకు గట్టిబుద్ధి చెప్తామని హెచ్చరించారు. శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ లడఖ్లో సర్ ప్రైజ్ విజ్విజిట్ చేశారు. లేహ్ లోని జన్ స్కార్ రేంజులో ఉన్న 11 వేల అడుగుల ఎత్తులోని నీమూ ఫార్వర్డ్ పోస్ట్ సైనికులతో మాట్లాడారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ , ఐటీబీపీ సిబ్బందితో ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఉన్నారు. జూన్ 15న ఈస్టర్న్ లడఖ్లోని గల్వాన్ వ్యాలీలో చైనాతో జరిగిన బార్డర్ గొడవలో అమరులైన కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులకు ఆయన నివాళులర్పించారు. ‘భారత్మాతా కీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో ఆ ప్రాంతాన్ని ప్రధాని, సైనికులు హోరెత్తించారు. తర్వాత ఆయన సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు లేహ్ ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సైనికులను మోడీ పరామర్శించారు.
అది మా చేతగానితనం అనుకోవద్దు
గల్వాన్ ఘటనతో సైనికుల ధైర్య సాహసాలు దేశమంతా మార్మోగిపోయాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శాంతి కావాలంటే దానికన్నా ముందు ధైర్యం ఉండాలని చెప్పారు. బలహీనులు శాంతిని తీసుకురాలేరని అన్నారు. శాంతి, స్నేహం, ధైర్యం మన దేశపు గొప్ప కల్చర్ అని చెప్పారు. శాంతిని, అభివృద్ధిని డిస్టర్బ్ చేయాలనుకున్న వారికి సందర్భం వచ్చినప్పుడల్లా గట్టిబుద్ధి చెప్పామని అన్నారు. ఇండియా ఎప్పుడూ శాంతి, స్నేహానికి కట్టుబడి ఉంటుందని, దాన్ని చేతగానితనంగా చూడొద్దని చైనాకు హెచ్చరికలు పంపారు. ‘‘ఆక్రమించుకోవాలనుకునే రోజులు ఇకపోయాయి. ఇది అభివృద్ధియుగం. ఆక్రమించుకోవాలనే ధోరణి నుంచి ప్రపంచం మొత్తం బయటకొచ్చింది. అభివృద్ధినే కావాలనుకుంటోంది. ఆక్రమణదారుల కాలం చెల్లిపోయిందనడానికి, వెన్నుచూపి పారిపోయారడానికి చరిత్రే సజీవ సాక్ష్యం’’ అని మోడీ అన్నారు.
మీ తెగువ హిమాలయాలకన్నా గొప్పది
గల్వాన్ వ్యాలీలో అమరులైన సైనికులను మోడీ గుర్తు చేసుకున్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన వారంతా మదర్ఇండియా ముద్దుబిడ్డలన్నారు. వారి త్యాగం దేశం తెగువకు నిదర్శనమన్నారు. ‘‘మీరు, మీ స్నేహితులు చూపించిన తెగువ, ధైర్యాన్ని ప్రపంచం మొత్తం చూసింది. అది దేశం గురించి ప్రపంచానికి ఓ గొప్ప సందేశాన్ని పంపింది. అమర సైనికుల త్యాగం మన దేశ ధైర్యసాహసాలను ప్రపంచానికి చాటి చెప్పింది. అలాంటి మీ సాహసం, మన శక్తి సామర్థ్యాలు, దేశాన్ని కాపాడాలన్న తపన.. మీరు పనిచేస్తున్న ఈ హిమాలయాల ఎత్తుకన్నా గొప్పవి. దేశం కోసం మీరు చిందించిన రక్తం, మీ తెగువ భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. మీ ఈ గట్టి సంకల్పమే ‘ఆత్మనిర్భర్భారత్’ను మరింత పటిష్ఠం చేసింది’’ అని సైనికుల సాహసాలను మోడీ కొనియాడారు. లేహ్–లడఖ్ అయినా, కార్ల్గి అయినా.. సియాచిన్ గ్లేసియర్ గ్లేస్ అయినా.. ఎత్తైన పర్వతాలైనా.. నదుల్లో ప్రవహించే చల్లటి నీళ్ళయినా.. ఏవైనా సరే అవన్నీ సైనికుల తెగువకు సాక్ష్యాలన్నారు.
బలగాల బాగు కోసం ఎన్నో చేసినం
కొన్నేళ్లుగా దేశ భద్రత కోసం, బలగాల బాగు కోసం ఎన్నో చర్యలు తీసుకున్నామని ప్రధాని మోడీ చెప్పారు. సైనికులకు అవసరమైన ఆధునిక ఆయుధాలను అందించామన్నారు. బార్డర్ లో మౌలిక వసతులను పెంచామన్నారు. బార్డర్ ఏరియాను డెవలప్ చేశామని, రోడ్ నెట్వర్క్ను విస్తరించామని చెప్పారు. సరిహద్దుల్లో మౌలిక వసతుల కోసం ఖర్చులను మూడు రెట్లు పెంచామన్నారు.
రెచ్చగొట్టే చర్యలొద్దు : చైనా
ప్రధాని లడఖ్ టూర్ పై చైనా స్పందించింది. రెచ్చగొట్టే చర్యలు తీసుకోవద్దని వ్యాఖ్యానించింది. బార్డర్ లో టెన్షన్లు మరింత పెంచే చర్యలను ఏ వర్గమూ తీసుకోకూడదని శుక్రవారం చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియన్ అన్నారు. లడఖ్లో రగిలిన వేడిని తగ్గించేందుకు రెండు దేశాల మధ్య మిలటరీ, డిప్లొమాటిక్ చర్చలు జరుగుతున్నాయని, ఇలాంటి టైంలో ఏ దేశం కూడా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని ఆయన అన్నారు. బిజినెస్లకు సంబంధించి ఇండియా తీసుకున్న నిర్ణయాలపైనా ఆయన మాట్లాడారు. ఇండియాలోని చైనా కంపెనీల న్యాయమైన బిజినెస్ హక్కులను కాపాడేందుకు అన్నిచర్యలూ తీసుకుంటామన్నారు. చైనాపై ఇండియా ఎప్పు డూ తప్పుడు లెక్కలు వేయొద్దని ఆయన
సూచించారు.
ఇండియాకు జపాన్ మద్దతు
చైనాతో స్టాండాఫ్ విషయంలో ఇండియాకు జపాన్ మద్దతుగా నిలిచింది. ఆ ప్రాంతంలో స్టేటస్ కోను మార్చేందుకు ఏకపక్షంగా తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం విదేశాంగ శాఖ కార్యదర్శి హరవర్షన్ శ్రింగాలాతో జపాన్ అంబాసిడర్ సతోషి సుజుకీ భేటీ అయ్యారు. రెండు దేశాలు చర్చలతో శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
మురళీకృష్ణుడే కాదు.. ‘చక్రధారీ’ మాకు ఆదర్శమే
ఆయుధశక్తితో ఎన్నోసార్లు ధీరులు మాతృభూమిని రక్షించారని ప్రధాని మోడీ అన్నారు. ‘పూజిస్తం.. అవసరమైతే శిక్షిస్తం’ అన్న సందేశాన్నిస్తూ పురాణాలను ప్రస్తావించారు. శ్రీకృష్టుడి గురించి చెప్పారు. ‘‘ఇండియాకు మురళీకృష్ణుడిని పూజించడమూ తెలుసు.. అవసరమైతే దుష్టశిక్షణ కోసం ‘సుదర్శనచక్రం చేతబట్టిన చక్రధారి శ్రీకృష్ణుడిని’ ఆదర్శంగా తీసుకోవడమూ తెలుసు’’ అని అన్నారు. దాని వల్లే ఇండియా ఇంత శక్తిమంతమైన దేశంగా ఎదిగిందని చెప్పారు. లడఖ్ సంస్కృతి చాలా గొప్పదన్నారు. కషోక్ బకులా రింపోచే బోధనలు ఎప్పుడూ ఆదర్శమేనన్నారు. త్యాగాలకు లడఖ్ ప్రతీకని, ఆ గడ్డ ఎందరో దేశభక్తులను ఇచ్చిందన్నారు. బుద్ధుడి బోధనలు దేశ ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమేనని అన్నారు.
For More News..