లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. ఈ జిల్లాలోని మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజక వర్గాలకు సంబంధించిన బీజేపీ ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులు రఘునందన్‌రావు, బీబీ పాటిల్ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ప్రచార సభను నాందేడ్-- –అకోలా నేషనల్ హైవే లో మండల కేంద్రమైన అల్లాదుర్గం సమీపంలోని ఐబీ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ వస్తుండటంతో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
40 ఎకరాల విస్తీర్ణంలో సభాస్థలి ఏర్పాటు చేశారు. మోదీ సభను సక్సెస్ చేసేందుకు భారీ ఎత్తున జన సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సభా వేదిక ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ బాలస్వామి పరిశీలించారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. కాగా, మే 3, 4వ తేదీల్లో జరగాల్సిన మోదీ పర్యటనలు వాయిదా పడినట్టు తెలుస్తోంది. మరోపక్క బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నగరానికి రానున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తారు. మే 5న నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి సెగ్మెంట్ల అభ్యర్థుల తరఫున అమిత్‌షా ప్రచారం నిర్వహించనున్నారు.
మే 8న వేములవాడకు మోదీ
వచ్చే నెల 8న ప్రధాని మోదీ తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు రానున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు. వేములవాడలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రసగిస్తారని చెప్పారు.