మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మహా కాళేశ్వర్ ఆలయ కారిడార్ ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. 856 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మోడీ ఇక్కడ శివలింగాన్ని ఆవిష్కరించడంతో పాటు ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ప్రారంభోత్సవానికి ఆలయ పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈవెంట్ ను ప్రత్యేక్షంగా ప్రసారం చేసేందుకు పెద్ద టీవీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. మహాకాల్ ఆలయానికి వెళ్లే దారిలో 600 మీటర్ల పొడవున్న హరిపతక్ వంతెనపై నూనె దీపాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి తరహాలో వేడుకలు జరుపుకోవాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మహాకాళుడి ఆలయం ఒకటి. భక్తులు ఏడాది మొత్తం మహాకాళుడి దర్శనం చేసుకుంటారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మహాకాళుడి ఆలయం ఉంది. ఆలయాన్ని మరింత విస్తరిస్తోంది ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుతో పర్యాటక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఆలయం ప్రస్తుతం 2.87 హెక్టార్లు ఉండగా ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిన తర్వాత ఆలయ విస్తీర్ణం 47 హెక్టార్లకు ఎక్స్ టెండ్ అవ్వనుంది. మహాకాల్ దారి పోడవున 108 ఇసుక స్తంభాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఇసుక స్తంభంపై త్రిశూలం, శివుడి ముద్రలు ఉన్నాయి. కాశీ విశ్వనాథ ఆలయ పునరాభివృద్ధి కంటే మూడు రెట్లు ఎక్కువగా మహాకాల్ కారిడార్ పునరాభివృద్ధి జరిగినట్లు అధికారులు తెలిపారు.
సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రధాని మోడీ ఉజ్జయిని చేరుకోనున్నారు. కారిడార్ ప్రారంభాని కంటే ముందు సంధ్యా హరతి కార్యక్రమంలో పాల్గోంటారు. తర్వాత కారిడార్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత సభలో పాల్గోని ప్రధాని ప్రసంగించనున్నారు.