సౌతాఫ్రికాకు మోదీ.. బ్రిక్స్‌‌ సమిట్‌‌ కోసం మూడు రోజుల పర్యటన

సౌతాఫ్రికాకు మోదీ.. బ్రిక్స్‌‌ సమిట్‌‌ కోసం మూడు రోజుల పర్యటన
  • ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

న్యూఢిల్లీ/జొహెన్నెస్‌‌బర్గ్: మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం సౌతాఫ్రికాకు వెళ్లారు. ఆయనకు ఎయిర్‌‌‌‌పోర్టులో సౌతాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ పాల్ షిపొకోస మషాటిలే సాదరంగా ఆహ్వానం పలికారు. జొహెన్నెస్‌‌బర్గ్‌‌లో జరగనున్న 15వ బ్రిక్స్‌‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) సమిట్‌‌లో మోదీ పాల్గొననున్నారు. పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. 

సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసా ఆహ్వానం మేరకు 22, 23, 24 తేదీల్లో సౌతాఫ్రికాలో మోదీ పర్యటిస్తున్నారు. భవిష్యత్ సహకార రంగాలను గుర్తించడానికి, సంస్థాగత అభివృద్ధిని రివ్యూ చేయడానికి అవకాశాన్ని ఈ శిఖరాగ్ర సమావేశం కల్పిస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు.

బ్రిక్స్ ఇదీ..

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా కూటమే బ్రిక్స్. ప్రపంచ జనాభాలో 41% ఈ దేశాల్లోనే ఉంది. ప్రపంచ జీడీపీలో 24 %, ప్రపంచ వాణిజ్యంలో 16% ఈ దేశాల్లోనే జరుగుతోంది. మరోవైపు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని 20 దేశాల అధినేతలను ఈ సమ్మిట్‌‌కు ఆహ్వానించారు. 2019 తర్వాత తొలిసారిగా వ్యక్తిగతంగా ఈ సమావేశం జరుగుతోంది. కరోనా కారణంగా గత 3 సమావేశాలు వర్చువల్‌‌గా జరిగాయి. 

పుతిన్ వర్చువల్‌‌గానే

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. బ్రిక్స్‌‌ సమ్మిట్‌‌లో వర్చువల్‌‌గా హాజరయ్యే అవకాశాలున్నాయి. సౌతాఫ్రికాకు వస్తే.. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారెంట్​తో అరెస్టు చేసే చాన్స్‌‌ ఉంది.

25న గ్రీస్‌‌కు ప్రధాని

సౌతాఫ్రికా నుంచి ఈ నెల 25న గ్రీస్‌‌కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. గ్రీస్ ప్రధాని ఆహ్వానం మేరకు ఏథెన్స్ నగరంలో పర్యటించనున్నారు. ఈ ప్రాచీన దేశంలో మోదీకి ఇదే తొలి పర్యటన.

జిన్‌‌పింగ్‌‌తో భేటీ అవుతారా?

బ్రిక్స్‌‌ సమ్మిట్‌‌లో ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్‌‌ జిన్‌‌పింగ్‌‌ భేటీ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2020 జూన్‌‌లో లడఖ్‌‌లోని గల్వాన్‌‌ లోయలో ఇండియా, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దౌత్య, సైనిక చర్చల తర్వాత తూర్పు లడఖ్‌‌ నుంచి దళాలు వెనుదిరిగినప్పటి కీ.. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావర ణం కొనసాగుతోంది. 

ఈ క్రమంలో మోదీ, జిన్‌‌పింగ్‌‌ భేటీపై  ఫారిన్ సెక్రటరీ వినయ్ క్వాత్రా స్పందిస్తూ.. ప్రధాని షెడ్యూల్ ఇంకా డెవలప్‌‌ అవుతోందని చెప్పారు. గతేడాది నవంబర్‌‌‌‌లో జరిగిన జీ20 డిన్నర్ టైంలో చివరి సారిగా ఈ ఇద్దరూ కలిశారు. ఇప్పుడు మోదీ, జిన్‌‌పింగ్ భేటీ అయితే 2020 మేలో మొదలైన బార్డర్ వివాదం తర్వాత జరిగిన తొలి సమావేశం కానుంది.