మేలో మరోసారి మోదీ రష్యా టూర్..!

మేలో మరోసారి మోదీ రష్యా టూర్..!

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యాలో పర్యటించే అవకాశం ఉంది. ‘గ్రేట్ పేట్రియాటిక్ వార్’ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో జరిగే పరేడ్‎కు మోదీ హాజరయ్యే అవకాశం ఉందని రష్యన్ వార్తా సంస్థ టాస్ బుధవారం వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు గత ఏడాది అక్టోబర్‌లో మోదీ ఆ దేశంలో పర్యటించారు. రష్యా అధ్యక్షతన కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆయన  హాజరయ్యారు. 

మళ్లీ మే 9న మాస్కోలో జరిగే పరేడ్‎కు మోదీ వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. అంతేకాకుండా, ఈ పరేడ్‎లో భారత ఆర్మీ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ పరేడ్ కు వివిధ దేశాధినేతలను ఆహ్వానించినట్టు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపే దిశగా అమెరికా, రష్యా అధికారుల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నెల ప్రారంభంలో రియాద్‌లో మొదటి రౌండ్ చర్చలు జరిగాయి.