
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన క్రమంలో మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జూన్ 8న దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ప్రధానిగా మళ్లీ మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
జూన్ 4న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 293 సీట్లతో మెజారిటీ సాధించింది. దీంతో మూడోసారి ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జూన్ 5వ తేదీ బుధవారం సాయంత్రం 4గంటలకు మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశం కానున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో వారు ఈరోజు ఉదయమే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సమావేశం అనంతరం ఎన్డీఏ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలువనున్నారు. ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఫలితాలపై ఇండియా కూటమి నేతలు కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో సమావేశం కానున్నారు.