బెంగళూరు మహానగరానికి మణిహారంగా వెలుగొందుతున్న ‘కెంపేగౌడ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం’ ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల బెంగళూరు నిర్మాత కెంపేగౌడ గౌరవార్థం ఆయన108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన బెంగళూరు నగరానికి అంకురార్పణ చేసిన విధానం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. 16వ శతాబ్దంలోనే 1537లో ఒక మట్టి కోట నిర్మించడం ద్వారా బెంగళూరు మహానగరానికి కెంపేగౌడ పునాది వేశారు. ఆనాడు ఆయన నాటిన మొక్క ఇవాళ మహావృక్షమై బెంగళూరు సిటీ దేశంలోనే ‘సిలికాన్ వాలీ’గా పేరుపొందింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న నగరంగానే కాకుండా భారతదేశంలో అతి త్వరలో జనాభాలో మూడో మహానగరంగా మారబోతున్నది. కెంపేగౌడ బెంగళూరు నగర నిర్మాత. ఆయన1533 నుంచి-1569 వరకు శ్రీకృష్ణదేవరాయల సామంతుడు. కొందరు ఆయనను పాలెగాడు అని కూడా పిలుస్తారు. కర్నాటకలో గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తిగా ఆయన పేరు మీదనే ఇప్పటి బెంగళూరు బస్సు స్టేషన్‌తో పాటు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారు. ఇప్పటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఆయన 27 జూన్ 1510 లో ‘మగాడి’అనే గ్రామంలో జన్మించారు. 1569లో ఆయన ‘కేన్పుపుర’ అనే గ్రామంలో మరణించారు. ఆయన నిర్మించిన మట్టి కోటను నేడు బెంగళూరు పోర్టుగా పిలుస్తున్నారు. ఆ తర్వాత దాన్ని తిరిగి నిర్మించి ఆధునీకరించారు. బెంగళూరు నగర నిర్మాత గానే కాకుండా అందులో అనేక చారిత్రక నిర్మాణాలను కూడా ఆయన ఆనాడే ప్రారంభించి పూర్తి చేశారు. ఆయనకు ముందు విజయనగర సామ్రాజ్యానికి ఆయన తండ్రి ‘‘కెంపేనంజే గౌడ’’ పాలెగాడుగా ఉండేవారు. తర్వాత ఆయన వారసులుగా గిడ్డే గౌడ విజయనగర సామ్రాజ్యంలో సామంత రాజుగా కొనసాగారు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కెంపేగౌడ ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు.
నాటి(గండుభూమి) వీరభూమి నేటి బెంగళూరు
కెంపేగౌడ అంతకుముందు ఈ ప్రాంతానికి పాలగాడుగా ఉన్న గంగరాజును ఓడించడానికి విజయనగర సామ్రాజ్యంతో జతకట్టి అతన్ని ఓడించి కంచికి వెళ్లగొట్టాడు. ఆ తర్వాత బెంగుళూరులో మట్టి కోటను నిర్మించారు. కెంపేగౌడ పోరాట శౌర్యానికి, శక్తికి భయపడ్డ ఆనాటి విజయనగర సామ్రాజ్య అధినేత అచ్యుత దేవరాయలు బెంగళూరుగా చెబుతున్న ప్రాంతంలో రాతికోట నిర్మాణానికి కెంపేగౌడకు అనుమతి ఇవ్వలేదు. అందుకే మట్టి కోట మాత్రమే నిర్మించి సరిపెట్టుకున్నారు. అలా కెంపేగౌడ తన కొత్త పట్టణాన్ని ‘గండు భూమి’ లేదా వీరభూమిగా పేర్కొన్నాడు. కోట లోపల పట్టణం చిన్న చిన్న విభాగాలుగా విభజించి ఉండేది. ప్రతి ఒక్క విభాగాన్ని కన్నడ భాషలో ‘పీట్’ అని పిలుస్తారు. పట్టణంలో ప్రధానంగా రెండు వీధులు ఉండేవి. ఒకటి చిక్కపేట వీధి మరొకటి దొడ్డపేట వీధి. నేటికీ బెంగుళూరు నడిబొడ్డులో చౌరస్తాగా ఈ వీధి ఉంది. అలాగే బెంగుళూరు సరిహద్దులను గుర్తించే నాలుగు టవర్లను కూడా ఆయనే నిర్మించారు. విజయనగర పాలెంలో అనేకమంది సాధువులు, కవులు బెంగళూరును దేవరాయ నగర, కల్యాణపుర, కల్యాణపురి అని కూడా పేర్కొన్నారు. ఆనాడు బెంగళూరు సరిహద్దు నిర్ణయించడానికి కెంపేగౌడ నిర్మించిన నాలుగు టవర్లు పట్టణ విస్తరణ వల్ల నేడు బెంగళూరులో నగరం మధ్యలో ఉన్నాయి. వాటిని అప్పటి స్మారక చిహ్నాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ టవర్లలో మొదటిది లాల్బాగ్ ఉద్యానవనంలో ఒక చివర పురాతన ద్వీపకల్ప గ్నిస్ రాక్ పై ఉంది. మిగిలిన మూడు టవర్లు ‘మైక్రి సర్కిల్’లో ఒకటి, ఉల్సూర్ సరస్సు పక్కన మరొకటి ‘కంపాబుధి’ సరస్సు పక్కన చివరి టవర్ ఉన్నాయి.
దూరదృష్టి, లక్ష్య శుద్ధి
ఉద్యానవనాల నగరంగా నేడు బెంగళూరు వెలసిల్లుతోందంటే ఆనాటి కెంపెగౌడ ఆలోచన దూరదృష్టి, లక్ష్య శుద్ధి గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక నగర నిర్మాతగానే కాకుండా వచ్చే తరాల కోసం తాగు నీటి సౌకర్యంతో పాటు మౌలిక వసతులు కల్పించిన వ్యక్తిగా కెంపేగౌడ ప్రసిద్ధి చెందారు. అందుకే ఇన్నాళ్లకు కెంపేగౌడ ప్రధాన విగ్రహాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం ముందు సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ ఆవిష్కరించారు. వీటి వెనక రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నా వక్తలిగ కులం వర్గం ఓట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న అన్ని పార్టీలు కూడా కెంపేగౌడ విగ్రహావిష్కరణను స్వాగతిస్తున్నాయి. భారత మాజీ ప్రధాని దేవేగౌడ ఇటీవల దేశ పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్ లో కూడా కెంపేగౌడ విగ్రహాన్ని పెట్టాల్సిందిగా ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఏదేమైనా గతం పునాదుల మీద వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు దర్శనం చేయాలంటే ఇలాంటి మహానుభావులను మనం స్మరించుకోవడం ఎంతైనా అవసరం.
దొడ్డ బసవడి గుడి
దక్షిణ బెంగళూరు నగరంలో దొడ్డ బసవడి గుడిగా పిలవబడే నందీశ్వరుడి వృషభాలయం కూడా కెంపేగౌడ నిర్మించినదే. ఎన్ఆర్ కాలనీలో ఉన్న ఈ బసవ గుడిలో నందీశ్వరుడు ప్రధాన దైవం. నందీశ్వరుడి ఆలయాల్లో కెల్లా అతిపెద్దదైన ఈ ఆలయాన్ని 1537లో కెంపేగౌడ నిర్మించారు. ద్రావిడ నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయంలో 15 అడుగుల ఎత్తు 20 అడుగుల పొడవు ఉండే నందీశ్వర విగ్రహాన్ని ఏకశిలతో మలిచారు. ఈ నంది పాదాల వద్ద నుంచే విశ్వభారతి నది పుట్టిందని ప్రతీతి. బెంగళూరు నగర స్థాపనలో నగరానికి ఈశాన్యంగా ఎంజీ రోడ్డుకు దగ్గరలో ఉన్న ఉల్సూరు చెరువును కూడా కెంపేగౌడ నిర్మించారు. సుమారు ఒకటిన్నర చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉండే ఈ చెరువులో అక్కడక్కడ చిన్నచిన్న దీవులు ఉంటాయి. శ్రావణ, భాద్రపద మాసాల్లో ఇక్కడ వినాయక చవితి ఘనంగా జరుపుకుంటారు. ఈత కోసం ఈతకొలను లాంటి అనేక వినోద కార్యక్రమాలకు ఒక ప్రత్యేక కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఉంది. ఉల్సూర్ చెరువుకు దగ్గరలో ఉన్న గురుద్వారా బెంగళూరు నగరంలో అతిపెద్దది. ఈ చెరువులో బోట్ షికారు చేయవచ్చు. మధ్యలో ఉన్న దీవుల్లో ఆగడానికి బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి. మూడు ప్రధాన కాలువల ద్వారా ఈ చెరువులోకి నీరు చేరుతుంది. చెరువు పరిరక్షణ కోసం కఠిన నిబంధనలు కూడా చేశారు. ఎంజీ రోడ్డుకు నడక దూరంలోనే ఈ చెరువు ఉంటుంది.
- బండారు రామ్మోహనరావు,సోషల్ ఎనలిస్ట్