ప్రధాని మోడీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం

ఈజిప్టులో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌’ దక్కింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి దీనిని అందజేసి సత్కరించారు. 1915లో ప్రారంభించిన ఈ పురస్కారాన్ని.. దేశంతోపాటు మానవాళికి విశేష సేవలందించే వివిధ దేశాల అధినేతలు, రాజులు, ఉపాధ్యక్షులకు అందిస్తున్నారు. తాజాగా మోడీకి ఈ పురస్కారం వరించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోడీకి ఇది 13వ పురస్కారం కావడం విశేషం. 

ఈజిప్టు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. అక్కడి ఓ పురాతన మసీదును సందర్శించారు. మతపెద్దలతో కలిసి అల్‌- హకీం- మసీదును కలియదిరిగిన ఆయన.. ప్రార్థనా మందిరం గోడలు, తలుపులపై చెక్కిన శాసనాలను పరిశీలించారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ మసీదులో ఇటీవల చేపట్టిన పునరుద్ధరణ  పనులను దావూదీ బోహ్రా వర్గానికి చెందిన మతపెద్దలు మోడీకి వివరించారు.

ఇవి కూడా చదవండి: రెస్టారెంట్ ఓపెన్ చేసిన సురేష్ రైనా.. ఏ దేశంలో అంటే?

11వ శతాబ్దంలో కైరోలోనే అతిపెద్ద మసీదుల్లో ‘అల్‌- హకీం- మసీదు’ ఒకటిగా నిలిచింది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రఖ్యాత మసీదు 13,560 చదరపు మీటర్ల పరిధిలో విస్తరించింది. ఇందులో ప్రధాన ప్రార్థనా మందిరమే ఐదువేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిని ఫాతిమిద్‌కు (అరబ్‌ మూలాలున్న ఇస్మాయిలీ షియా వర్గం) చెందిన దావూదీ బోహ్రా వర్గం వారు ఇటీవల పునరుద్ధరించారు. ఈజిప్టుకు చెందిన ఈ దావూదీ బోహ్రాలు.. తొలుత యెమెన్‌, అక్కడ నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. భారత్‌లో ఈ వర్గం జనాభా సుమారు 5 లక్షల వరకు ఉంటుందని అంచనా.

అంతకుముందు.. కైరో ఎయిర్ పోర్టులో  ప్రధాని మోడీకి ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ ఘన స్వాగతం పలికారు. ఆలింగనం చేసి వెల్ కమ్ చెప్పారు. ప్రధాని మోడీ గార్డ్ ఈజిప్టు  సేనల గౌరవ వందనం స్వీకరించారు. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈజిప్టులో  రెండు రోజులు పర్యటించనున్నారు.