కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వారిపై ఈడీ దాడులు చేయాలని డిమాండ్ చేశారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల డబ్బులు దోచుకున్న వారిపై దాడులు చేయాలన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో గ్యాస్ పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయన్నారు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. నిత్యవసర ధరలు 70 నుండి 80% పెరిగాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు. 16 లక్షల కోట్ల రూపాయలను అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు మోదీ మాఫీ చేశారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పనిచేస్తుందన్నారు వివేక్.
10 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు టాక్స్ లు కట్టిన కుటుంబం తమదన్నారు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. కేంద్ర హోమంత్రికి అమిత్ షాకు తాను ఛాలెంజ్ చేస్తున్నానని.. తనపై ఈడీ దాడులు చేసి తానేం దోచుకున్నాను నిరూపించాలన్నారు. వెంకటేష్ నేత ఎంపీగా పెద్దపల్లి నియోజకవర్గంలో కనీసం ప్రజలకు తెలియదు, ప్రజలకు కనబడలేదన్నారు. ప్రజాసేవ చేయడానికి గడ్డం వంశీకృష్ణ ఎంపీగా పోటీ చేస్తున్నాడని.. తండ్రి కాక వెంకటస్వామిని, తనని గెలిపించినట్టుగానే గడ్డం వంశీని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.